పెళ్లి వాహనం బోల్తా 35 మందికి గాయాలు | Married Celebration Vehicle Accident In Adilabad | Sakshi
Sakshi News home page

పెళ్లి వాహనం బోల్తా 35 మందికి గాయాలు

Published Mon, Apr 29 2019 8:22 AM | Last Updated on Mon, Apr 29 2019 10:47 AM

Married Celebration Vehicle Accident In Adilabad - Sakshi

స్వల్ప గాయంతో బయటపడ్డ పెళ్లికూతురు, బోల్తా పడ్డ ఐచర్‌ వాహనం

ఆదిలాబాద్‌రూరల్‌: ఓ పెళ్లి వాహనం బోల్తా పడి 35 మంది గాయాలపాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెళ్లికూతురుతో వెళ్తున్న ఆ వాహనం మరో 15 నిమిషాల్లో మండపానికి చేరుకోవాల్సి ఉండగా, ఈ ప్రమాదంతో పెళ్లికి వచ్చిన వారందరూ విషాదంలో మునిగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంద్రవెళ్లి మండలం సమ్మక్క గ్రామానికి చెందిన జంగు వివాహం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం తంతోలి గ్రామానికి చెందిన అనక సొనేరావుతో నిశ్చయమైంది. ఈ క్రమంలో సమ్మక్క గ్రామం నుంచి తంతోలి గ్రామానికి ఐచర్‌ వ్యాన్‌ పెళ్లి కూతురు, ఇతర బంధువులతో బయల్దేరింది. పెళ్లి జరిగే ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాల గుట్ట వద్ద ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 50 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలవగా, 29 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు తరుపు వారు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొని, గాయపడ్డ వారిని రిమ్స్‌కు తరలించారు. క్షతగ్రాతుల్లో షెడ్మకె నాగమణి, చాకటి లక్ష్మి, పెందూర్‌ దేవురావు, సోయం మాలని, కొడంగ యశ్వంత్‌రావు, పెందూర్‌ దాములకు తీవ్ర గాయాలవగా, వీరిలో మాలని కుడి చేతిని వైద్యులు తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బంధువుల రోదనలతో రిమ్స్‌ దద్దరిల్లింది. స్వల్ప గాయాలపాలైన 29 మంది కూడా ప్రస్తుతం రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదం కారణంగా బంధువులంతా ఆసుపత్రిలోనే ఉండటంతో ముహూర్తం దాటిపోయింది. అయినా, మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన వివాహం సాయంత్రం 5.30 గంటలకు సాదాసీదాగా జరిపించారు.

డ్రైవర్‌ అజాగ్రత్తతోనే..
వాహన డ్రైవర్‌ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఒకసారి బోల్తా పడ్డ వాహనం, మరో పల్టీ కొట్టి ఉంటే వాహనంతోపాటు తామంతా లోయలో పడేవారమని వివరించారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమా దం తప్పిందని వారు వివరించారు. ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ కూడా రిమ్స్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ప్రముఖుల పరామర్శ..
పెళ్లి బోల్తా విషయాన్ని తెలుసుకన్న ఆయా పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను ప రామర్శించారు. వారిలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి ఉన్నారు. వీరు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న విషయాన్ని తెలుసుకొని రిమ్స్‌ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రుల వైద్యంలో లోటు రాకుండా చూడాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement