marriege
-
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
కరోనా ప్రభావం: సామూహిక వివాహాల్లో ఒక్కటే జంట
సాక్షి, తుమకూరు(కర్ణాటక): కరోనా ప్రభావం కారణంగా ప్రజలు సాముహిక వివాహాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం కొద్ది మందిలో మాత్రమే వివాహం జరుపుకుంటున్నారు. తాజాగా, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలో శ్రీధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో పేర్లు నమోదు చేసుకున్న ఒక్కజంటకే వివాహం జరిపించారు. దొడ్డ ఎన్నెగెరె గ్రామంలో సోమవారం బీమాసతి తీతారాజు దేవాలయంలో అనిల్ కుమార్, భూమిక జంట నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. సంస్థ అధికారి ప్రేమానంద్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. వైరస్ కారణంగా ఎవరూ పెళ్లి జరుపుకోవడానికి ముందుకు రాలేదు. -
పెళ్లి వాహనం బోల్తా 35 మందికి గాయాలు
ఆదిలాబాద్‌రూరల్: ఓ పెళ్లి వాహనం బోల్తా పడి 35 మంది గాయాలపాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెళ్లికూతురుతో వెళ్తున్న ఆ వాహనం మరో 15 నిమిషాల్లో మండపానికి చేరుకోవాల్సి ఉండగా, ఈ ప్రమాదంతో పెళ్లికి వచ్చిన వారందరూ విషాదంలో మునిగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంద్రవెళ్లి మండలం సమ్మక్క గ్రామానికి చెందిన జంగు వివాహం ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన అనక సొనేరావుతో నిశ్చయమైంది. ఈ క్రమంలో సమ్మక్క గ్రామం నుంచి తంతోలి గ్రామానికి ఐచర్ వ్యాన్ పెళ్లి కూతురు, ఇతర బంధువులతో బయల్దేరింది. పెళ్లి జరిగే ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాల గుట్ట వద్ద ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 50 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలవగా, 29 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు తరుపు వారు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొని, గాయపడ్డ వారిని రిమ్స్‌కు తరలించారు. క్షతగ్రాతుల్లో షెడ్మకె నాగమణి, చాకటి లక్ష్మి, పెందూర్ దేవురావు, సోయం మాలని, కొడంగ యశ్వంత్‌రావు, పెందూర్ దాములకు తీవ్ర గాయాలవగా, వీరిలో మాలని కుడి చేతిని వైద్యులు తొలగించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బంధువుల రోదనలతో రిమ్స్ దద్దరిల్లింది. స్వల్ప గాయాలపాలైన 29 మంది కూడా ప్రస్తుతం రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రమాదం కారణంగా బంధువులంతా ఆసుపత్రిలోనే ఉండటంతో ముహూర్తం దాటిపోయింది. అయినా, మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన వివాహం సాయంత్రం 5.30 గంటలకు సాదాసీదాగా జరిపించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే.. వాహన డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఒకసారి బోల్తా పడ్డ వాహనం, మరో పల్టీ కొట్టి ఉంటే వాహనంతోపాటు తామంతా లోయలో పడేవారమని వివరించారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమా దం తప్పిందని వారు వివరించారు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ కూడా రిమ్స్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రముఖుల పరామర్శ.. పెళ్లి బోల్తా విషయాన్ని తెలుసుకన్న ఆయా పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను ప రామర్శించారు. వారిలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి ఉన్నారు. వీరు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విషయాన్ని తెలుసుకొని రిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రుల వైద్యంలో లోటు రాకుండా చూడాలని కోరారు. -
ప్రమాదము.. ప్రేమ
మనుషులు ప్రేమలో పడ్తారు. పడడం ప్రమాదమేగా?జరిగింది అదికాదు.. ఒక ఉన్మాదం ప్రమాదమైంది ప్రేమలో పడినవాళ్లు మాత్రం..పడిలేచారు.. లేచి నడిచారు!! ‘‘మీరు మహిళల తరపున నిలబడ్తారని... వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తారని మీ దగ్గరకు వచ్చాను’’‘‘చెప్పండి.. మీకేం హెల్ప్ కావాలి?’’‘‘నాకు విడాకులు కావాలి’’‘‘అయితే అన్ని విషయాలు నిజాయితీగా చెప్పాలి’’‘‘తప్పకుండా’’ఈ సంభాషణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘‘ఫైర్‌బ్రాండ్’’ అనే మరాఠీ సినిమాలోనిది. ముంబైలో సక్సెస్ఫుల్ లాయర్.. మహిళా పక్షపాతి. న్యాయం తరపున నిలబడుతుంది. .గృహ హింసకు బలవుతున్న వివాహితులకు తగిన భరణంతో విడాకులు ఇప్పిస్తుంటుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మారు మాట్లాడకుండా.. తమ భార్యలకు ఆస్తిలో వాటా ఇచ్చేలా వాదిస్తుంది. ఆమె తమ కేస్ తీసుకుందంటే చాలు జీవితకాలపు భరోసాతో ఉంటారు స్త్రీలు. అందుకే ఒక బాధితురాలు ఆమెను అలా రిక్వెస్ట్ చేస్తుంది. ఎక్స్‌పార్టీగా పురుషులు తమ ఆటలు ఇక చెల్లవనే నిర్థారణకు వచ్చేస్తారు. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసైనా సరే గెలుస్తామనే ఆశను తుడిచేసుకుంటారు ప్రతివాది లాయర్లు. అందుకే ఆమె ఫైర్‌బ్రాండ్. అలాంటి ధీశాలి వ్యక్తిగతమైన సమస్యతో సతమతమవుతూ ఉంటుంది. భర్తతో శారీరక చనువును పెంచుకోలేకపోతుంది. ఎందుకలా? ఆ లాయర్ పేరు సుందర్ రా. ప్రొఫెషనల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంతా మ్యారీడ్ లైఫ్‌తోనే. అలాగని భర్త.. మాధవ్ పాట్కర్ చెడ్డవాడు ఏమీ కాదు. భార్యను అర్థం చేసుకుంటాడు. గౌరవిస్తాడు. ఆర్కిటెక్ట్‌గా తన వృత్తికెంత విలువిస్తాడో అడ్వకేట్‌గా ఆమె వృత్తికీ అంతే విలువిస్తాడు. అయినా ఆమె అతనికి దగ్గరకాలేపోతుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణతో బాధపడ్తుంటుంది. దానిపేరు.. పీటీఎస్డి (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్). స్కూల్లో చదువుకునే రోజుల్లో లైంగిక దాడికి గురవుతుంది సునంద. అది కలిగించిన భయమే పీటీఎస్డి రూపంలో ఇప్పటికీ వెంటాడుతూంటుంది. ‘‘అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. ప్రేమ వేరు.. లవ్ వేరు’’ అంటూ ఈ విషయంలో ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తూంటాడు భర్త ఓ స్నేహితుడిలా. అయినా సాధ్యం కాదు సునందకు. సైకియాట్రి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూంటుంది. రాత్రి నిద్ర పోవాలంటే భయం ఆమెకు. రోజూ ఆ పీడకలే. భార్య వ్యథను చూస్తూ నిస్సహాయంగా ఉంటాడు మాధవ్. ఇదిలా ఉండగా.. ఓ రోజు.. దివ్య వస్తుంది సునంద ఆఫీస్‌కు. ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్న క్లయింట్. యవ్వనంలో ఆమె ఫేమస్ మోడల్. ఆనంద్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఓ పాప. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆనంద్‌ది. ఆడవాళ్లతో కూడా స్నేహంగా ఉంటాడు. ఆ తీరును అనుమానిస్తూంటుంది దివ్య. ‘‘నీకు వేరే అఫైర్లున్నాయ’ంటూ రోజూ తగవు పెట్టుకుంటుంది. వాళ్ల పోట్లాటతో కూతురు వణికిపోతూంటుంది. దాంతో పాప అబ్నార్మల్ చైల్డ్ అయిపోతుంది. ఆ బిడ్డ పట్లా అసహనమే దివ్యకు. చివరకు ఆస్తిలో సగం వాటాతో విడాకులు కావాలని భీష్మించుకుంటుంది. పాప కస్టడీనీ డిమాండ్ చేస్తుంది. ఒప్పుకోడు ఆనంద్. ‘‘చీటికిమాటికి మనం ఇలా పోట్లాడుకుంటూంటే పాప హెల్త్ మరింత పాడవుతుంది. నాకే అఫైరూ లేదు.. నన్ను నమ్ము ప్లీజ్’ అంటూ మొరపెట్టుకుంటాడు ఆనంద్. కన్విన్స్ కాదు దివ్య. పాపకేమో తండ్రంటేనే ఇష్టం. తల్లి పట్ల మొండిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సునంద గురించి తెలుసుకుని ఆమెను కలుస్తుంది దివ్య. ఈ కథ మొదట్లో చెప్పుకున్నట్లు విడాకులు ఇప్పించమని అడుగుతుంది. అబద్ధం తనవైపు బలమైన సాక్ష్యాన్ని సృష్టించుకోడానికి తనే గాజుముక్కతో గాయం చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ భర్త మీద నేరారోపణ చేస్తుంది దివ్య. ఆనంద్‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తన ఇన్ఫ్లుయెన్స్, స్నేహితుడి సహాయంతో ఎలాగోలా బయటకొస్తాడు. ఓ లాయర్ని మాట్లాడుకుంటాడు. ఆ వ్యవహారమంతా ఎక్కడ పాప మీద దుష్ప్రభావం చూపుతుందోనని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందామని ప్రతిపాదిస్తాడు భార్యతో. సరే అంటుంది దివ్య. ఆనంద్ తన లాయర్‌తో కలిసి సునంద ఆఫీస్‌కు వస్తాడు. దివ్యా ఉంటుంది. చెప్తారు.. తామిద్దరూ మ్యూచువల్ కన్సెంట్కి వెళ్దామనుకుంటున్నామని. ఓకే అంటుంది సునంద. మళ్లీ అక్కడ ఆస్తి విషయంలో పోట్లాటకు దిగుతుంది దివ్య. అప్పుడే తెలుస్తుంది సునందకు.. ఆనంద్ తనను గాయపరిచాడంటూ దివ్య అబద్ధమాడిందని. ఆమె మీద నమ్మకం పోతుంది సునందకు. ఈ కేస్ నుంచి తప్పుకుంటానని.. ఇంకో లాయర్‌ను మాట్లాడుకోమనీ దివ్యతో చెప్తుంది. ఇంకోసారి అలా జరగదని బతిమాలుకొని సునందను ఒప్పిస్తుంది దివ్య. కోర్టులో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఆ ప్రాభవాన్నంతా కోల్పోయి ఆనంద్ నీడలో మామూలు భార్యగా బతుకుతున్నాననే భావన దివ్య సంయమనం కోల్పోయేలా చేస్తుంది. ఆ విషయాన్నే ఆనంద్ తరపు లాయర్ కోర్టులో చెప్పి.. బిడ్డ కస్టడీని ఆనంద్‌కు ఇప్పించాల్సిందిగా కోరుతాడు. ఆ మాటతో ఆవేశపడిపోయి.. ఒక్కసారిగా భర్తమీద అరిచేస్తుంది దివ్య.. క్రమశిక్షణనుల్లంఘించి. దాంతో ఆమె మానసిక ప్రవర్తనను బేరీజు వేసుకున్న జడ్జి బిడ్డ కస్టడీని ఆనంద్‌కే అప్పగిస్తాడు. ఆ కోపాన్నంతా సునందమీద వెళ్లగక్కుతుంది దివ్య. ఆమెలోని తల్లి మనసును అర్థం చేసుకున్నా దివ్య ప్రవర్తనను సహించదు సునంద. అంతకుముందు.. తన సాహచర్యం, సైకియాట్రి ట్రీట్మెంట్.. ఏదీ ఫలితం చూపించకపోయేసరికి హర్ట్ అవుతాడు మా«ధవ్. కొన్నాళ్లు సొంతూరికి వెళ్దామనుకుంటాడు. తన ఎడబాటు వల్లయినా సునందలో మార్పు వస్తుందేమోనని. అనుకున్నట్టుగానే సునందకు చెప్పకుండా ఊరుకెళ్లిపోతాడు. భార్య ఫోన్ చేసి అడిగితే.. పని మీద ఊరొచ్చినట్టు చెప్తాడు. ఆ రాత్రి.. దివ్య వాళ్లకు విడాకులు మంజూరైన రోజు రాత్రి దివ్య భర్త ఆనంద్.. సునంద వాళ్లింటికి వస్తాడు. కూర్చోని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటారు. కోర్టులో తన భార్య బిహేవియర్ పట్ల సారీ చెప్తాడు ఆనంద్. అనీజీగా కదులుతుంది సునంద. ఏమైంది అంటాడు ఆనంద్. మెడ, వెన్ను నొప్పి అని చెప్తుంది. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే మస్సాజ్ చేయనా? నేను ట్రైన్డ్’’ అంటాడు. ‘‘పర్లేదు.. అదే సర్దుకుంటుంది’’ అంటుంది. కాని ఇబ్బంది పడ్తూంటుంది. ‘‘నేను మస్సాజ్ చేస్తాను ఆగండి’’ అంటూ చనువు తీసుకొని మస్సాజ్ చేస్తుంటాడు. ఆ స్పర్శ ఆమెలో స్త్రీత్వాన్ని తట్టి లేపుతుంది. మానసికంగా ఉపశమనాన్నిస్తుంటుంది. శారీరకంగా సాన్నిహిత్యాన్ని కోరుతుంటూంది. తెల్లవారి.. ఎప్పటిలా కాకుండా చాలా హుషారుగా ఉంటుంది సునంద. భర్తకు ఫోన్ చేస్తుంది త్వరగా రమ్మని. ఆ మాటలోని ఉత్సాహాన్ని, ఆత్రాన్ని గ్రహిస్తాడు భర్త. మాధవ్ ఆశించిన మార్పు సునందలో. బయలుదేరి వస్తాడు. భార్య చొరవను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రాత్రి చెప్తుంది భర్తతో.. ‘‘నా చిన్నప్పటి భయంకరమైన కల.. నిన్న సమాధి అయిపోయింది’’ అంటూ. ‘‘వెరీగుడ్..’’ అంటాడు భర్త ఆనందంగా. ‘‘దీనికి కారణం ఓ వ్యక్తి. నిన్న కలిశాను శారీరకంగా. అప్పుడు తెలిసింది నాకు.. పీడకు, సంతోషానికి మధ్య తేడా’’అని ఆగుతుంది. భర్త మొహంలో రంగులు మారుతుంటాయి.‘‘మాధవ్.. ఏంటలా ఉన్నావ్?’’ అంటుంది కంగారుగా. ‘‘ఏంటో.. నాకు కన్ఫ్యూజన్గా ఉంది’’ అంటాడు భర్త. ‘‘అదేంటీ.. నువ్వే చెప్పావ్‌గా చాలాసార్లు.. యాక్సిడెంట్ వేరు.. లవ్ వేరు అని. నీ మీదున్న నా ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలిసింది..’’ అంటుంది భర్తను హత్తుకుంటూ. ఆమె స్థితిని అర్థం చేసుకునేక్రమంలో భాగంగా భార్య తలను ముద్దు పెట్టుకుంటాడు. సమకాలీన పరిస్థితుల జీవనశైలి.. ప్రమాదాలు.. ప్రేమలు.. ఘర్షణలు.. దుఃఖాలు.. ఆనందాలు అన్నీ రీలై రియల్లైఫ్లా చూపిస్తుంది ఫైర్‌బ్రాండ్. దర్శకురాలు అరుణ రాజె. నిర్మాత.. ప్రియాంక చోప్రా. సునంద రాగా ఉషా జాధవ్ నటించారు. – సరస్వతి రమ -
ఏ జన్మదో ఈ బంధం!
సుభాష్‌నగర్ : అనాథ చిన్నారిని చేరదీశారు. ఆలనా పాలన చూశారు. చిన్నప్పటినుంచి కన్నబిడ్డలా పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. యుక్త వయసు రాగానే ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. గండిమైసమ్మ దుండిగల్ మండలం బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమాన్ని డీఎన్ గౌరి, మీరా కుమారి నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో అమీర్‌పేటలోని ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి రమ్య అనే మూడేళ్ల చిన్నారిని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు. ప్రస్తుతం రమ్య (22) బీటెక్ పూర్తి చేసి బాలానగర్‌లోని మెడిప్లస్‌లో ఉద్యోగం చేస్తోంది. పంజాబ్ రాష్ట్రం పటాన్‌కోట్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, దర్శినిదేవిల కుమారుడు శంభు మెహేరా (25) బీకాం పూర్తి చేసి బాలానగర్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు శంభు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం కుదిర్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమంలో హైందవ సంప్రదాయ పద్ధతిలో గౌరీ, మీరాలు కన్యాదానం చేశారు. ఉమెన్ డైవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంవీ సాయిబాబా, ఆశ్రమం ఇన్చార్జి లక్ష్మి, ప్రేమ పాల్గొన్నారు. -
ఒక్కటైన మూగ మనసులు
ఇల్లంతకుంట(మానకొండూర్) : మండల కేంద్రానికి చెందిన మామిడి అంజయ్య ఏకైక కూతురు అనూష పుట్టు మూగ, కరీంనగర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడు కూడా పుట్టు మూగ. మండల కేంద్రంలోని వైశ్యభవన్‌లో పెద్దల సమక్షంలో అనూష, అర్జున్ గురువారం వివాహం చేసుకున్నారు. మానకొం డూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొంకటి అనీల్ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అజయ్‌వర్మ మాట్లాడుతూ ఇద్దరు మూగ వారు కావడంతో వారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు. -
బాధితురాలు..నిందితుడికి పోలీస్ స్టేషన్లో వివాహం
బరంపురం : గంజాం జిల్లాలోని బల్లిగుడ ప్రాంగణంలో ఓ మహిళా హోమ్‌గార్డుపై జవాన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో బాధి త మహిళకు నిందితుడితో పోలీసులు సోమవారం వివాహం జరిపిం చారు. వివరాలిలా ఉన్నాయి. కొందమాల్ జిల్లా బల్లిగుడ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళపై..జవాన్ తరిణి మహేంద్ర అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటనపై బాధిత మహిళా హోమ్‌గార్డు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలితో నిందితుడు తరిణి మహేంద్రకు రాజీ కుదిర్చి సోమవారం జి.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. -
మూడు ముళ్లు..ఆరు విడాకులు
విజయనగరం ఫోర్ట్ : జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా తాళికట్టి ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లు నిండకుండానే విడిపోతున్నారు. ప్రేమ, అప్యాయతలతో ఆనందంగా గడపాల్సిన వారు అపొహలు, అనుమనాలతో విడిపోతున్నారు. నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతా అంటూ పెళ్లికి ముందు, పెళ్లి అయిన తొలినాళ్లలో ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, కొన్నేళ్ల తర్వాత కోపం, చీదరించుకోవడం, అనుమానించడంగా మారి విడిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం చిన్నదే అయినా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నాతిచరామి అని తాళి కట్టే సమయంలో చెప్పిన దంపతులు అవగాహన లేక, ఒత్తిడికి తట్టుకోలేక విడిపోతున్నారు. పోలీసులు, గృహ హింస విభాగం వారు చేస్తున్న కౌన్సిలింగ్‌తో కొందరు సర్దుకుపోతున్నా, మరికొందరు మూర్ఖంగా ఆలోచిస్తూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇటీవల కాలంలో తరచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో యువత పెళ్లంటనే భయపడుతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఎంత ముందుకు వెళ్తామనే విషయంలో సందిగ్ధంలో పడిపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే.. గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇస్తూ పిల్లల దృష్టిలో ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పి మనస్పర్ధలను తొలిగించేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. విభేదాలు వచ్చిన దంపతులను కలిపేందుకు ఎన్ని కౌన్సిలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛన్నమైపోవడంతో సంప్రదాయాలు, బంధాల గురించి పిల్లలకు తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకుండా, మొండిగా వ్యవహరిస్తూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నామాటే చెల్లాలన్న అహంకారం వల్ల భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. సర్దుబాటు చేసే వారు లేక, ఉన్నా వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు భార్యభర్తలు ఇష్టపడకపోవడంతో ఇటీవల కాలంలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు చిన్న కారణాలతో విడిపోవాలనుకుంటున్న దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారిలో కొద్ది మాత్రమే కలిసి జీవిస్తుండగా ఎక్కువ భాగం మంది విడిపోతున్నారు. వేరే కాపురాల వల్ల.. ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకు అధికశాతం యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తె సుఖం కోసమే ఆలోచిస్తున్నారే తప్ప ఉమ్మడి కుటుంబం ప్రాముఖ్యతను వివరించేందుకు చూడడం లేదు. కారణం ఏదైనా పంతాలకు పోయి దంపతులు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లైన కొద్ది రోజులకే భర్త వేధిస్తున్నాడని, అత్తమామలు, ఆడ పడుచులు ఇబ్బంది పెడుతున్నారని మహిళలు గృహహింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. ఇంకొందరు నేరుగా కోర్టులనే ఆశ్రయిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించాలి.. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యభర్తలు ఇద్దరూ చదువుకున్న వారే. ఆర్భాటాలు, గొప్పలకు పోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారే తప్ప ఉన్నంత సర్దుకునేందుకు ప్రయత్నించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబ వ్యవస్థ ప్రా ముఖ్యతను వివరించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. – జి.రజిని, గృహహింస విభాగం కౌన్సిలర్. సర్దుబాటును అలవర్చుకోవాలి.. భార్యభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే సర్ధి చెప్పేవారు కరువయ్యారు. దీంతో వారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తన కోపమే తనకు శత్రువు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు.– జి.మాధవి,న్యాయవాది, విజయనగరం. -
జ్యోతిష్యంతో ‘పెళ్లి’కి ఎసరు!
సిద్దిపేటటౌన్ : తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి సంబంధం వదులుకున్నారు. ఆ మాటే అబ్బాయి తరఫు వాళ్లు అమ్మాయి వాళ్లకు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆ జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మూఢ నమ్మకంతో పెళ్లి ఆగిన ఘటన సోమవారం సిద్దిపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్లో రాజు పంతులు అనే వ్యక్తి జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. అదే కాలనీలోని ఓ కుటుంబం తమ కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నామని తాము చూసిన అమ్మాయి జాతకం చూడమని ఆ జ్యోతిష్యునికి చూపించారు. దాన్ని చూసిన పంతులు ఇద్దరికి జాతకాలు కలవడం లేదని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఇంట్లో ఒకరికి ప్రాణ హాని ఉందని ఖంగు తినే విషయం చెప్పాడు. ఆ పంతులు చెప్పిన మాట నమ్మిన వారు అమ్మాయి వాళ్లకు అదే విషయాన్ని చెప్పి పెళ్లి ఆలోచన మానుకోవాలని చెప్పారు. అంతకుముందే కట్నకానుకల విషయం మాట్లాడుకొని ఈ నెల 22న నిశ్చితార్థం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే జాతకాల వ్యవహారం అమ్మాయి తరఫువాళ్లను ఆందోళనలో పడేసింది. అమ్మాయి వాళ్లు ఆదివారం వచ్చి జ్యోతిష్యున్ని సంపద్రించడంతో మీ అమ్మాయికి జన్మలో పెళ్లి కాదని చెప్పాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జాతకంలో దోషం ఉందని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుందని చెప్పినట్టు తెలిపారు. నాలుగు నెలల నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయి, అబ్బాయి రాజు పంతులు చెప్పిన మాటలతో పెళ్లి చేసుకోలేకపోతున్నారని, దీనంతటికి పంతులే కారణమని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన మీదకు దాడికి వచ్చారని రాజు పంతులు పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కోరడంతో పోలీసులు అతడిని, అబ్బాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి తరఫు వాళ్లు మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకున్నారు. పెళ్లి కారణంగా అమ్మాయివాళ్లకైన డబ్బులు ఇవ్వడానికి అబ్బాయి వాళ్లు అంగీకారం తెలపడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు.. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టైంల శనివారం రాత్రి అబ్బాయి వాళ్లు ఫోన్ చేసి మా అమ్మాయిని చేసుకుంటే వారి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందని చెప్పిండ్రు. పెళ్లి క్యాన్సల్ చేస్తున్నట్టు చెప్పిండ్రు. ఏం చేయాల్నో మాకు ఏం అర్థం కావడం లేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు. గుట్టుగా బతికే మమ్మల్ని రోడ్డు మీదకు గుంజిండ్రు.. –అమ్మాయి తల్లి పెళ్లి యోగం లేదన్నాడు ముందుగా మేం చూపించిన పంతులు జాతకం బాగానే ఉందన్నాడు. రాజు పంతులు మా అమ్మాయికి జన్మలో పెళ్లి కాదన్నాడు. పెళ్లి యోగం లేదన్నాడు. ఒక వేళ పెళ్లి అయితే నా తల నరుక్కుంటా అని చెప్పి.. ఇంకా ఎవరినైనా పండితులను అడిగి తెలుసుకొని నాకు ఫోన్ చేయమని తన నంబర్ నాకిచ్చాడు. రాజు పంతులు వల్లనే మా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. – అమ్మాయి తండ్రి పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమన్నా.. నా దగ్గరకు ముందుగా ఒక తప్పుడు డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూసి చెప్పాను. మళ్లీ ఇంకో డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూస్తే జాతకంలో కొంచెం దోషం ఉందని, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను. అదే జాతకం తీసుకొని వేరే పంతులు దగ్గరకు వెళ్లినా నేను చెప్పిందే చెప్తాడు. నేను తప్పుడు జాతకం చెప్పలేదు. –రాజు పంతులు, జ్యోతిష్యుడు -
రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్
సాక్షి,సిటీబ్యూరో: తమిళనాడు గవర్నర్ రోశయ్య మనుమడు అనిరుద్, బొమ్మిడాల కాశీవిశ్వనాథం మనుమరాలు లక్ష్మీప్రదీప్తిల వివాహం మాదాపూర్‌లోని ఎన్.కన్వెన్షన్‌లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కవిత, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
క్రిష్ వెడ్స్ రమ్య
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, డాక్టర్ రమ్యసాయిల వివాహం వైభవంగా జరిగింది. గండిపేట ఉస్మాన్‌సాగర్ లేక్ సమీపంలోని గోల్కొండ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి జరిగిన వీరి పెళ్లికి టాలీవుడ్ సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు అగ్రనటులు చిరంజీవి, అల్లు అర్జున్, మంచు లక్ష్మి, రకుల్, రాశీఖన్నా తదితరులు హాజరయ్యారు.