దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న గృహహింస విభాగం కౌన్సిలర్
విజయనగరం ఫోర్ట్ : జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా తాళికట్టి ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లు నిండకుండానే విడిపోతున్నారు. ప్రేమ, అప్యాయతలతో ఆనందంగా గడపాల్సిన వారు అపొహలు, అనుమనాలతో విడిపోతున్నారు.
నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతా అంటూ పెళ్లికి ముందు, పెళ్లి అయిన తొలినాళ్లలో ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, కొన్నేళ్ల తర్వాత కోపం, చీదరించుకోవడం, అనుమానించడంగా మారి విడిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కారణం చిన్నదే అయినా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
నాతిచరామి అని తాళి కట్టే సమయంలో చెప్పిన దంపతులు అవగాహన లేక, ఒత్తిడికి తట్టుకోలేక విడిపోతున్నారు. పోలీసులు, గృహ హింస విభాగం వారు చేస్తున్న కౌన్సిలింగ్‌తో కొందరు సర్దుకుపోతున్నా, మరికొందరు మూర్ఖంగా ఆలోచిస్తూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇటీవల కాలంలో తరచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో యువత పెళ్లంటనే భయపడుతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఎంత ముందుకు వెళ్తామనే విషయంలో సందిగ్ధంలో పడిపోతున్నారు.
ఎవరికి వారే యమునా తీరే..
గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇస్తూ పిల్లల దృష్టిలో ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పి మనస్పర్ధలను తొలిగించేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి.
విభేదాలు వచ్చిన దంపతులను కలిపేందుకు ఎన్ని కౌన్సిలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛన్నమైపోవడంతో సంప్రదాయాలు, బంధాల గురించి పిల్లలకు తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకుండా, మొండిగా వ్యవహరిస్తూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నామాటే చెల్లాలన్న అహంకారం వల్ల భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి.
సర్దుబాటు చేసే వారు లేక, ఉన్నా వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు భార్యభర్తలు ఇష్టపడకపోవడంతో ఇటీవల కాలంలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు చిన్న కారణాలతో విడిపోవాలనుకుంటున్న దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారిలో కొద్ది మాత్రమే కలిసి జీవిస్తుండగా ఎక్కువ భాగం మంది విడిపోతున్నారు.
వేరే కాపురాల వల్ల..
ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకు అధికశాతం యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తె సుఖం కోసమే ఆలోచిస్తున్నారే తప్ప ఉమ్మడి కుటుంబం ప్రాముఖ్యతను వివరించేందుకు చూడడం లేదు.
కారణం ఏదైనా పంతాలకు పోయి దంపతులు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లైన కొద్ది రోజులకే భర్త వేధిస్తున్నాడని, అత్తమామలు, ఆడ పడుచులు ఇబ్బంది పెడుతున్నారని మహిళలు గృహహింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. ఇంకొందరు నేరుగా కోర్టులనే ఆశ్రయిస్తున్నారు.
కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో భార్యభర్తలు ఇద్దరూ చదువుకున్న వారే. ఆర్భాటాలు, గొప్పలకు పోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారే తప్ప ఉన్నంత సర్దుకునేందుకు ప్రయత్నించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబ వ్యవస్థ ప్రా ముఖ్యతను వివరించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. – జి.రజిని, గృహహింస విభాగం కౌన్సిలర్.
సర్దుబాటును అలవర్చుకోవాలి..
భార్యభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే సర్ధి చెప్పేవారు కరువయ్యారు. దీంతో వారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తన కోపమే తనకు శత్రువు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు.– జి.మాధవి,న్యాయవాది, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment