నివేదిత (ఫైల్)
హస్తినాపురం : అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ యువతి అపార్టుమెంటు నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాఖత్‌పుర ప్రాంతానికి చెందిన భువనగిరి రఘునాథ్‌కు సైదాబాద్ ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన వరాల సబిత, పృధ్వీరాజ్ దంపతుల కుమార్తె నివేదిత(29)తో గత జూలైలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 40 తులాల బంగారం , 2కిలోల వెండి, కొంత నగదును కట్నకానుకలుగా ఇచ్చారు. రఘునాథ్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుండగా, నివేదిత కూకట్‌పల్లిలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ పనిచేస్తోంది.
వీరు వనస్థలిపురం సుష్మసాయినగర్ కాలనీలోని అపార్టుమెంటులో ఉంటున్నారు. గత కొద్దినెలలుగా అదనపు కట్నం కోసం రఘునాథ్ తరుచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. సమస్యను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నచ్చజెప్పి పంపారు. శనివారం సాయంత్రం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలియడంతో నివేదిత తల్లి దండ్రులు కుమార్తె ఇంటికి వచ్చి ఆదివారం తెల్లవారు జాము వరకు అక్కడే ఉండి కుమార్తె, అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నివేదిత అపార్టు మెంటు నాలుగో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి పృధ్వీరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment