నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ స్వల్ప వివాదం చెలరేగి క్షణికావేశానికి లోనైన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నెల్లూరు నగరంలోని శ్రీహరినగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సమాచారం మేరకు మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామంలో బి.ఓబుల్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కుమార్తె స్రవంతి(26) బీటెక్ పూర్తిచేసుకొంది. 2013లో ఆమెకు మర్రిపాడు మండలం సింగన్నపల్లికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లురెడ్డితో వివాహమైంది. వెంకటేశ్వర్లురెడ్డి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వివాహానంతరం దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లారు. ఈక్రమంలో 2016 జూలైలో స్రవంతి తన చెల్లెలు వివాహ నిశ్చితా ర్థం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చింది.
అప్పటి నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. వీసా సమస్యల కారణంగా వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడుకు రాలేకపోయారు. ఐదు నెలల క్రితం ఆయన స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకొంటూ దంపతులిద్దరూ నగరంలోని శ్రీహరినగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ చిలకపాడుకు వెళ్లాలని దంపతులిద్దరూ నిర్ణయించుకొన్నారు. స్రవంతి తన తండ్రి ఓబుల్‌రెడ్డికి ఫోన్ చేసి ఊరికి వస్తున్నామని చెప్పగా ఆయన బస్సులో రావాలని సూచించాడు. అయితే వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడు నుంచి తన ఊరికి బైక్‌పై వెళదామని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది.
బస్సులోనే వెళదామని స్రవంతి పట్టుబట్టింది. వెంకటేశ్వర్లురెడ్డి ససేమిరా అన్నారు. కుమారుడు రామ్‌శ్రావణ్‌రెడ్డి వస్తువులన్నీ కింద పడేస్తుండడంతో స్రవంతి అతనిని మందలించడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకు కుమారుడిని తిడుతావని ఆమెను ప్రశ్నించాడు. దీంతో మనస్థాపం చెంది సీలింగ్‌ఫ్యాను హుక్కుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన భర్త స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దించి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారణ కావడంతో బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శుక్రవారం అర్ధరాత్రి మృతురాలి తండ్రి ఓబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు శనివారం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment