ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళకు కౌన్సెలింగ్ ఇస్తున్న కానిస్టేబుల్ సుబ్బారావు
గుంటూరు, తాడేపల్లిరూరల్: మండల పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో నివసించే ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక బుధవారం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజీ మీదకు వచ్చింది. చంకలో ఉన్న ఐదు నెలల బాలుడిని కృష్ణానదిలోకి విసిరేయబోతుంటే, ఓ ఆటో డ్రైవర్ ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే... వడ్డేశ్వరం గ్రామంలో నివసించే కాండ్రుకొండ చిన్నాకు, దేవికి ఏడేళ్ల కిందట వివాహమైంది. భర్త చిన్నా ప్రతిరోజూ తాగి వచ్చి దేవిని అనుమానిస్తూ చితకబాదడంతో ఆమె ఆ దెబ్బలు తట్టుకోలేక, అవమానం భరించలేక, తన ముగ్గురు పిల్లలైన భావన, భాను, 5నెలల బాలుడిని తీసుకుని ఉదయం ప్రకాశం బ్యారేజీ పైకి వచ్చింది.
మొదట చంకలో ఉన్న ఐదు నెలల బాలుడిని కృష్ణానదిలోకి విసిరేస్తుండగా, విజయవాడ వైపు నుంచి ఆటో నడుపుకొంటూ వస్తున్న కిషోర్ అనే యువకుడు చూసి, ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఆమె దూకేందుకు ప్రయత్నం చేయగా, ఒక చేత్తో పిల్లవాడిని పట్టుకొని మరోచేత్తో ఆమెను పట్టుకొని పెద్దగా కేకలు వేయడంతో, మరికొంతమంది ఆటోవాలాలు వచ్చి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ముగ్గురు పిల్లలను, దేవిని ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. కృష్ణానదిలో ఓ తల్లి ముగ్గురు పిల్లలను తోసేసి నదిలో దూకేందుకు వచ్చిందని తెలిసి చుట్టుపక్కల ఉన్న మహిళలు భారీగా ఔట్‌పోస్ట్ వద్దకు తరలివచ్చారు. పిల్లల్ని పెంచడం కష్టంగా ఉంటే మాకివ్వండి, మేం పెంచుకుంటాం, ఆడపిల్లలు లక్షణంగా ఉన్నారు, మేం తీసుకెళ్తామంటూ పిల్లల్ని ఎత్తుకొని ఆడించారు. చివరకు దేవి భర్త చిన్నాకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువుల సమక్షంలో వారిద్దరినీ ఇంటికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment