మమత మృతదేహాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ ఉష, పోలీసులు మమత మృతదేహం (ఇన్‌సెట్‌లో), పోలీసుల అదుపులో ఉన్న సూర్య
కలిగిరి (నెల్లూరు): మండల కేంద్రమైన కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెం ఎస్సీకాలనీలో కట్టా మమత (20) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్సీకాలనీకి చెందిన కట్టా నాగేశ్వరరావు కుమారుడు సూర్యకు రాయచోటికి చెందిన బండ్ల కుమార్, రమణమ్మల కుమార్తె మమతకు ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహమైంది. భర్త వేధింపులు అధికంగా ఉన్నాయని గతంలో మమత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను జైలులో ఉండి వచ్చాడు.
నెలరోజుల క్రితం పెద్దలు సర్దుబాటు చేసి ఆమెను జిర్రావారిపాలెంలోని భర్త ఇంటికి పంపారు. సోమవారం ఉదయం సూర్య తన భార్య ఇంట్లోని వంటగదిలో ఉరి వేసుకుందని స్థానికులకు తెలిపాడు. ఆమెను కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మమత మృతదేహన్ని ఇంటి వద్దకు తీసుకువచ్చి సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మమత బంధువులు గ్రామానికి చేరుకుని సూర్య వేధింపుల కారణంగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
తహసీల్దార్ ఆగ్రహం
తహసీల్దార్ సి.ఉష ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మమత మృతదేహాన్ని, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న చున్నీని పరిశీలించారు. ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేశారు. సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్సై పి.చినబలరామయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment