మట్కా నిర్వాహకులతో డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది
వైఎస్‌ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పోలీసులు మట్కా స్థావరాలను ఏరిపారేస్తున్నారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో 9 మంది మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 84 వేల నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో మట్కా జూదంలో ఇంత పెద్ద మొత్తం పట్టుకోవడం ఇదే మొదటి సారి. డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఉత్తర్వుల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించారన్నారు. మట్కా నిర్వహించడానికి ప్రత్యేక అనుమతులున్నాయని కొందరు నిర్వాహకులు ప్రజలను నమ్మించేవారన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మట్కా రాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్‌ఐలు, సీఐలు మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారన్నారు. వన్‌టౌన్ పరిధిలోని మట్టిమసీదు వీధిలో షేక్ ఖాదర్‌బాషా, బీరం జయరామిరెడ్డిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 59, 440, 5 మట్కా పట్టీలు, టూ టౌన్ పరిధిలో మోడంపల్లెకు చెందిన సయ్యద్ ఆలీషేర్‌ను అరెస్ట్ చేసి రూ. 1 లక్షా 10 వేలు, 10 మట్కా పట్టీలు, త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరసానిపల్లెకు చెందిన ఎన్. నారాయణ, కొండయ్య, రవిచంద్రారెడ్డి, కొత్తపల్లె గోపాల్, ఎర్రగంగుల రవికుమార్, ఉండెల వెంకటేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 10 లక్షల 15 వేలు నగదు, ఆరు మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామన్నారు.
మట్కా బీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తాం
మట్కా నిర్వహిస్తున్న వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మట్కా నిర్వహిస్తూ మానుకున్నవారు తిరిగి రాస్తున్నారన్నారు. వీరిని జిల్లా బహిష్కరణ చేస్తామని తెలిపారు. ఇంకా కొందరిని గుర్తిస్తున్నామని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రొద్దుటూరులో మట్కా నిర్వాహకులు ఎక్కడున్నా ఉక్కుపాదం మోపుతామన్నారు. మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు జయానాయక్, మల్లికార్జున గుప్త, రామలింగమయ్య, ఎస్‌ఐలు కృష్ణంరాజునాయక్, నరసయ్య, మధుమళ్లేశ్వరరెడ్డి, నారాయణయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment