రాహుల్ కిరణ్, వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఏఆర్.శ్రీనివాస్
బంజారాహిల్స్: అతనో ఉన్నత విద్యావంతుడు..ఎంబీఏ పూర్తి చేశాడు.. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలై వాటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. గత రెండు నెలలుగా పూణే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న డాలర్ మోసగాడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ముంబైలోని మలబార్ హిల్స్ 98 నిపినాసియా రోడ్డులోని శాంతినగర్‌లో ఉంటున్న రాహుల్ కిరణ్ ఘాటియా అలియాస్ నిఖిల్(31) ఎంబీఏ చదివాడు. అనంతరం మూడు కంపెనీలు ప్రారంభించాడు. అన్నిట్లోనూ నష్టాలే వచ్చాయి. ఒక వైపు జల్సాలకు అలవాటు పడి మరోవైపు వ్యాపారంలో నష్టాల కారణంగా అప్పులపాలయ్యాడు. దాదాపు రూ. 50 లక్షలు అప్పులు చేశాడు. వీటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. అందులో భాగంగానే డాలర్ ఎక్సైంజ్ పేరుతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. గత నెల 26న బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని స్టార్ ఆస్పత్రి సమీపంలోని అట్లాస్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు.
జస్ట్ డయల్ ద్వారా ఓ మనీ ఎక్సైంజ్ సెంటర్‌కు ఫోన్ చేసిన అతను తనకు 7 వేల డాలర్లు కావాలని కోరాడు. డాలర్లు తీసుకొని వచ్చిన శ్రీధర్‌గౌడ్ నుంచి వాటిని తీసుకొని నగదు తెస్తానంటూ లోపలికి వెళ్లిన నిఖిల్ అటు నుంచి అటే జారుకున్నాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీసులు అతడికోసం గాలిస్తుండగానే ఈ నెల 3న బంజారాహిల్స్‌లోని శాంతానివాస్‌లో ప్లాట్ అద్దెకు తీసుకున్న అతను మరో ఎక్సైంజ్ సంస్థకు ఫోన్ చేసి 7 వేల డాలర్లు కావాలని కోరాడు. మహేష్ అనే వ్యక్తి డాలర్లు తీసుకుని అక్కడికి రాగా వాటిని తీసుకొని నగదు ఇస్తానంటూ లోపలికి వెళ్లి జారుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు పక్కా నిఘా వేశారు. ఇందుకుగాను టెక్నాలజీని వినియోగించిన పోలీసులు నగరంలోని అన్ని ఫోరెక్స్ ఎక్సైంజ్ సంస్థలకు ఈ తరహా మోసాలపై సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం మళ్లీ ఇదే తరహాలో ఓ సంస్థకు ఫోన్ రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వలపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల 8, 20 తేదీల్లో పూణేలో కూడా ఇదే తరహాలో డాలర్లు కావాలంటూ ఫోన్ చేసి వాటితో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. కోల్‌కతాలోనూ అతడిపై చెక్‌బౌన్స్ కేసు ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పూణే, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల డాలర్ కేసులు నమోదయ్యాయి. కాగా పూణే పోలీసులు గత నెల 3 నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బంజారాహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బంజారాహిల్స్ క్రైం ఎస్‌ఐ భరత్ భూషణ్‌ను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్‌స్పెక్టర్ ఆర్. కళింగరావు తదితరులు పాల్గొన్నారు.
నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు
నిందితుడు రాహుల్ కిరణ్ అలియాస్ నిఖిల్ ఓ సారి మోసానికి పాల్పడిన అనంతరం అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డులను వాడడు. డాలర్లతో ఉడాయించిన మరుక్షణమే ఈ సెల్‌ఫోన్‌ను బద్దలు కొట్టి సిమ్‌కార్డును జేబులో వేసుకుంటాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులు వినియోగించాడు. పోలీసులకు చిక్కకుండా ఈ తరహా సిమ్‌లు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా తనను ఎవరూ గుర్తు పట్టకుండాముఖానికి సగం వరకు మాస్క్ ధరించే ఇతను నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment