ప్రొఫెసర్ చంద్రశేఖర్ అసభ్యప్రవర్తనపై చర్చించుకుంటున్న వైద్య విద్యార్థులు
నెల్లూరు(బారకాసు): వైద్య విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రొఫెసర్ వికృత చేష్టలు కళాశాలకు మాయని మచ్చగా మారాయి. నగరం లోని ఏసీ ఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల పట్ల ఆ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లగా వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. గురువారం ఓ విద్యార్థిని ఫిర్యాదుతో ఆ ప్రబుద్ధిడి లీలలు వెలుగులోకి వచ్చా యి. నగరంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని రూ.300 కోట్లతో ప్రభుత్వ బోధన ఆస్పత్రిగా ఏర్పాటు చేసింది.
దీనికి అనుబంధంగా ఏసీఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా నెల్లూరునగరంలో అత్యాధునిక భవనాలను నిర్మించి వైద్య ప్రొఫెసర్లు నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని క్యాడర్లలో ఉద్యోగులను నియమించింది. ఓ వైపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ వైద్యకళాశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నాల్గో సంవత్సరం వైద్యవిద్యనభ్యసిస్తున్న ఓ వైద్య విద్యార్థినిపై ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించడం పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై విభిన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రొఫెసర్ తీరుపై ఆగ్రహం
నాల్గో సంవత్సరం వైద్యవిద్యనభ్యసిస్త్ను ఓ వైద్య విద్యార్థిని పట్ల గురువారం అసభ్యంగా వ్యవహరించిన జనరల్ సర్జరీ విభాగపు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గతంలో కూడా తమపై ఇలాగే ప్రవర్తించారని పలువురు విద్యార్థినులు తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ విషయాలేమిటో వారి మాటల్లోనే..
‘చాలాకాలం నుంచి ప్రొఫెసర్ చంద్రశేఖర్ వైద్య విద్యార్థినుల పట్ల మిస్‌బిహేవియర్ చేస్తున్నారు. ఇప్పుడు నాపై కూడా అదే జరిగింది. ఈపరిస్థితి మారాలి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాపై జరిగినటువంటి సంఘటన నాతోటి పలువురు వైద్యవిద్యార్థినులకు కూడా ఇలాగే జరిగింది. వారెవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నేను వచ్చాను’ అని బాధితురాలైన వైద్యవిద్యార్థిని వ్యక్తం చేసింది.‘2015లో నాపై కూడా ప్రొఫెసర్ చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో భయపడ్డాను. క్లాసులకు కూడా సక్రమంగా వెళ్లలేకున్నాం. అటెండెన్స్ పోగోట్టుకుంటున్నాం. భయంతో ఉన్న నేను ఇప్పుడు తోటి వైద్య విద్యార్థిని ధైర్యంగా ముందుకు రావడంతో నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. ఇకపై ఏ ఒక్క వైద్య విద్యార్థినికి ఇలా జరగకూడదని ముందుకొచ్చాను’ అంటూ మరో విద్యార్థిని తెలియజేసింది.
‘క్లినికల్ పోస్టింగ్ కోసం ప్రొఫెసర్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లాలంటే ఆయన ఎక్కడ మమ్మల్ని టచ్ చేస్తారోనని భయం వేస్తోంది. ఒక్కరిగా ఉండటం చూసి ఆయన అలుసుగా తీసుకుని ఏదోరకంగా మా శరీరాన్ని తాకాలని చూస్తుంటారు. గతంలో నన్ను కూడా టచ్ చేశారు. అంతేకాకుండా డెమో గదిలో పుస్తకాలిచ్చి చదవమని చెప్పి ఆయన మా పక్కన నిలబడి మమ్మల్ని అదోరకంగా చూస్తుంటారు. ఆయన చూపులు చూస్తేనే భయమేస్తుంటుంది.’ అని మరో వైద్య విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘మూడు నెలల క్రితం ఇటువంటి విషయమే నాకు కూడా జరిగింది. అప్పుడు ఫిర్యాదు చేయలేకపోయాం. కారణం భయంతోనే. ఈ రోజు మా సీనియర్ ముందుకు రావడంతో ధైర్యంగా నేను కూడా ముందుకు వచ్చాను’ మరో విద్యార్థిని పేర్కొంది.
పరస్పర కేసుల నమోదు
గురువారం నగరంలోని బోధనాస్పత్రిలో జరిగిన ఘటనపై పరస్పర కేసులు నమోదయ్యాయి. నాల్గో సంవత్సర వైద్య విద్య కోర్సు చేస్తున్న వైద్య విద్యార్థిని పై అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు.అలాగే ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై దాడి చేసిన బాధితురాలి సోదరుడిపై సదరు ప్రొఫెసర్ దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాడికి పాల్పడిన ప్రజ్ఞుపై కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment