అదను చూసుకుని ‘ఆరగించేస్తున్నారు’! | Meerpet SI Caught With Bribery Demand | Sakshi
Sakshi News home page

అదను చూసుకుని ‘ఆరగించేస్తున్నారు’!

Published Wed, Oct 24 2018 8:12 AM | Last Updated on Tue, Oct 30 2018 2:07 PM

Meerpet SI Caught With Bribery Demand - Sakshi

ఏసీబీకి పట్టుబడిన మీర్‌చౌక్‌ ఎస్సై సారంగపాణి

సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సహా ఉన్నతాధికారులు ఎన్ని విధానాలు అమలులోకి తెస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదును చూసుకుని లంచాలు ఆరగించేస్తున్నారు. ఓ విధానానికి చెక్‌ పడితే మరో పంథాలో తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. రాజధానిలోని పోలీసు కమిషనరేట్లలో వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మీర్‌చౌక్‌ ఠాణా సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), కానిస్టేబుళ్లను ఏసీబీ ్ఞఅధికారులు మంగళవారం ట్రాప్‌ చేశారు. దీంతో సహా ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదుగురు సబ్‌–ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

ఆ పరిస్థితులు మార్చినా...
ఒకప్పుడు పోలీసుస్టేషన్లు భూత్‌ బంగ్లాలను తలపించేవి. అధికారులు, సిబ్బందికి సరైన వాహనాలు కూడా ఉండేవి కాదు. కీలక కేసుల దర్యాప్తు కోసమూ ఆర్థిక సహాయం దొరికేది కాదు. ఈ పరిస్థితులకు తోడు ‘స్వకార్యం’లో భాగంగా అవినీతి రాజ్యమేలేది. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన నిందితుడే కాదు బాధితుడూ బోరుమనే పరిస్థితులు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు విభాగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఓపక్క మౌళిక వసతులు మెరుగవడంతో పాటు టెక్నాలజీ వినియోగం, నెలసరి ఠాణాల నిర్వహణ ఖర్చులు అందించడం తదితర చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు పనితీరును మందించడం, ఎక్కడిక్కడ పరిశీలనలు చేపట్టడంతో అధికారులు, సిబ్బంది తీరులో మార్పు వస్తుందని అంతా భావించారు.  

సిటీలోనే ఏరివేత షురూ..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సిబ్బంది, అధికారుల్లో ఉన్న అవినీతిపై దృష్టి పెట్టారు. స్టేషన్‌ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ.75 వేలు మంజూరు చేస్తున్న ఆయన ‘కలెక్షన్స్‌’ విధానాన్ని పారదోలాలని భావించారు. దీంతో 2015లోనే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలోని వసూల్‌ రాజాలపై దృష్టి పెడుతూ స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా ఆరా తీయించారు. దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరŠడ్మ్‌ రిజర్వ్‌ విభాగానికి బదిలీ చేయించారు. దీంతో మామూళ్లు, వసూళ్ల వ్యవహారాలు కొంత వరకు తగ్గాయి. అయితే ‘అధిక సొమ్ముకు’ అలవాటుపడిన కొందరు కింది స్థాయి అధికారులు తమ పని తీరును మార్చుకోవట్లేదు. డబ్బు కోసంకేసుల్లోనే కక్కుర్తి దందాలు ప్రారంభించారు.బాధితులు, నిందితులు అనే తేడా లేకుండా చాన్స్‌ దొరికినప్పుడల్లా అడ్డంగా లంచాలుగుంజేస్తున్నారు. 

కాదేదీ వసూలుకు అనర్హం...
ఈ లంచాలు తీసుకోవడంలో అధికారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. కేసును బట్టి, నిందితులు, బాధితుల తీరుతెన్నుల్ని బట్టి వసూళ్లు ఉంటున్నాయి. ఈ ఏడాది ఏసీబీకి చిక్కిన వారి కేస్‌స్టడీలే ఇందుకు నిదర్శనం.  
ఆసిఫ్‌నగర్‌ ఎస్సై గౌస్‌ ఖాన్‌ రూ.25 వేలు తీసుకుంటూ గత నెల 18న అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. పాన్‌మసాలాలు సరఫరా చేసే వ్యాపారిని నెలవారీ మామూళ్లు డిమాండ్‌ చేసిన గౌస్‌ ఖాన్‌ కొంత మొత్తం తీసుకున్నప్పటికీ మరికొంత కావాలని కోరి దానిని తీసుకుంటూ అడ్డంగా దొరికేశాడు.  
పాతబస్తీలోని మహిళా ఠాణాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్‌ గత నెల 5న రూ.20 వేలు తీసుకుంటూ చిక్కారు. భార్యభర్తల మధ్య పంచాయితీకి సంబంధించి నమోదైన కేసులో భర్తకు స్టేషన్‌ బెయిల్‌ ఇప్పిస్తానంటూ చెప్పిన కానిస్టేబుల్‌ రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు.  
చిలకలగూడ ఠాణా డిటెక్టివ్‌ ఎస్సై సీహెచ్‌ వెంకటాద్రి, కానిస్టేబుల్‌ రాజేష్‌ జూలైలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ చోరీ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రికవరీ చేసిన బైక్‌ను ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వడానికి డబ్బు డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు.  
హుమాయున్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై సీహెచ్‌ శ్రీకాంత్, కానిస్టేబుల్‌ మహ్మద్‌ రహీం పాషా రూ.20 వేలు లంచం తీసుకుంటూ జూన్‌ 13న ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత పోలీసు కస్టడీలో అతడిని కొట్టకుండా ఉండేందుకు, బెయిల్‌కు సహకరించేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. రూ.80 వేలు తీసుకున్నప్పటికీ మిగిలిన మొత్తం కోసం వేధించి అందుకుంటూ పట్టబడ్డారు.  
చైతన్యపురి ఎస్సై ఈరోజి రూ.20 వేలు తీసుకుంటూ మే 25న ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఓ మైనర్‌ బాలికను వేధిస్తున్న కేసులో న్యాయవాదిపై కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానం అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ఈరోజి లంచం డిమాండ్‌ చేశాడు.  

ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఎస్‌ఐ
యాకుత్‌పురా: ఓ కేసు విషయమై రూ.50 వేల లంచం తీసుకుంటున్న మీర్‌చౌక్‌ ఎస్సై సారంగపాణిని మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌–2 డీఎస్పీ ఎస్‌.అచ్చేశ్వర్‌ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌ కుమార్‌ తన స్నేహితుడు జితేందర్‌కు కొన్ని నెలల క్రితం రూ.37 లక్షలు అప్పుగా ఇచ్చాడు. జితేందర్‌ డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్‌ కుమార్‌ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న  మీర్‌చౌక్‌ ఎస్సై సారంగపాణి  జితేందర్‌ నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి అనిల్‌ కుమార్‌కు అప్పగించాడు. మిగతా బ్యాలెన్స్‌ రూ.11 లక్షలు సైతం ఇప్పిస్తానని చెప్పిన సారంగపాణి అందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని అనిల్‌ను కోరాడు. అందుకు అంగీకరించిన అనిల్‌ కుమార్‌ ఈ నెల 17న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.  మంగళవారం రూ.50 వేలు ఇచ్చేందుకు అనిల్‌ కుమార్‌ స్టేషన్‌కు రాగా, బయట కానిస్టేబుల్‌ కిరణ్‌ కుమార్‌కు ఇవ్వాలని ఎస్సై సూచించాడు. అతడి సూచనమేరకు కిరణ్‌ కుమార్‌ రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement