ప్రతీకాత్మక చిత్రం
లక్నో: గత మూడు రోజుల నుంచి మీరట్ పోలీసులు ఓ యువకుడి మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతునే ఉన్నారు. నీళ్లు పడ్డాయి కానీ శరీర భాగాలు మాత్రం లభించలేదు. వివరాలు.. మీరట్‌కు చెందిన ఐటీఐ విద్యార్థి రూపక్(20) గత నెల 25న స్నేహితులను కలవాలంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రూపక్ స్నేహితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. స్నేహితులు, రూపక్ సోదరి గురించి చెడుగా మాట్లాడటంతో వారి మధ్య గొడవ ప్రారంభమయ్యింది.
ఈ క్రమంలో స్నేహితుల్లో ఒకడైన వివేక్ రూపక్‌ని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పొలంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పాతి పెట్టారు. కానీ పోలుసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో మృతదేహాన్ని వెలికి తీసి ముక్కలుగా చేశారు. అనంతరం ఊరవతల ఉన్న బోరువెల్‌లో మృతదేహం ముక్కలను పడేసినట్లు వివేక్ బృందం పోలీసులకు తెలిపింది. దాంతో గత మూడు రోజులుగా పోలీసులు రూపక్ శరీర భాగాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు.
శరీర భాగాలు బావి లోపల చాలా లోతులో అయినా పడి ఉండాలి లేదా నిందితులు తప్పుడు సమాచారం అయినా ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో చాలా జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు. నీటి పారుదల శాఖ సాయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే 50 అడుగులు లోతు తవ్వారు. నీళ్లు పడ్డాయి.. కానీ శరీర భాగాలు మాత్రం లభ్యం కాలేదు. రూపక్ మృతదేహం లభించకపోతే.. నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేమంటున్నారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment