ఆయుధం కావాలా..? ఆన్‌లైన్‌ ఉందిగా! | Menu of illegal weapons available online | Sakshi
Sakshi News home page

ఆయుధం కావాలా..? ఆన్‌లైన్‌ ఉందిగా!

Published Tue, Jan 30 2018 1:22 AM | Last Updated on Tue, Jan 30 2018 12:04 PM

Menu of illegal weapons available online - Sakshi

స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మీడియాకు చూపిస్తున్న పోలీసులు. చిత్రంలో నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో లభిస్తున్న అక్రమ ఆయుధాల మెనూ ఇదీ. క్యాష్‌ ఆన్‌ డెలివరీ, నెలవారీ వాయిదాల పద్ధతుల్లోనూ ఇంటర్నెట్‌ కేంద్రంగా ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై కన్నేసిన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం 12 మందిని పట్టుకుని, 13 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఈ నిందితులు స్నాప్‌డీల్‌ నుంచి ఖరీదు చేసినట్లు తేలిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌పైనా కేసులు నమోదు చేస్తున్నామని డీసీపీ పి.రాధా కిషన్‌రావు తెలిపారు. 

ఉత్తరాదిని కాపీ కొడుతూ.. 
పెళ్లిళ్లు, బారాత్‌లతో పాటు పుట్టినరోజు వేడుకల్లో కత్తుల్ని ప్రదర్శించే, డాగర్లను వెంట ఉంచుకుని సంచరించే సంస్కృతి ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమై ఉండేది. ఇటీవల నగరంలోనూ ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది. గతంలోనూ సిటీలో కత్తుల్ని స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నా వాటిని నిందితులు బీదర్, గుల్బర్గా నుంచి తీసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ–కామర్స్‌ సైట్ల కారణంగా ఆన్‌లైన్‌లోనూ ఆయుధాలు దొరికేస్తున్నాయి. దీంతో అనేక మంది యువకులు అవసరం ఉన్నా లేకున్నా, చట్టవిరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, బారాత్‌లు, బర్త్‌డే పార్టీల్లో(కేక్‌ కటింగ్‌ కోసం) వాటితో పోజులిస్తూ ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఓ ఎంగేజ్‌మెంట్‌ బారాత్‌ ఊరేగింపులో కత్తి విన్యాసం 15 ఏళ్ల సయ్యద్‌ హమీద్‌ ప్రాణం తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెట్టారు.

అరెస్టు అయింది వీరే..
మంగళ్‌హట్‌ పరిధికి చెందిన సూద్‌ అమన్‌ సింగ్, తుసాంకునాల్‌సింగ్, సుధీర్‌సింగ్, మహ్మద్‌ సల్మాన్, హుస్సేనిఆలం పరిధికి చెందిన మహ్మద్‌ ముజీబ్, ముస్తాఫా హుస్సేన్, ఛత్రినాక పరిధికి చెందిన శశికాంత్‌ సింగ్, గోల్కొండకు చెందిన మహ్మద్‌ యాసీన్‌అహ్మద్, మహ్మద్‌ రవూఫ్, హుమాయున్‌నగర్‌ వాసి సల్మాన్‌ ఖాన్, బహదూర్‌పురకు చెందిన మహ్మద్‌ సిరాజుద్దీన్, అంబర్‌పేట వాసి మహ్మద్‌ సోహైల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. వీరిలో తొమ్మిది మంది పెళ్లిలో అలంకారానికి, సరదా కోసం వీటిని ఖరీదు చేశారు. మహ్మద్‌ ముజీబ్‌ సోదరుడిని ఇటీవల కొందరు హత్య చేశారు. దీంతో ఆయుధం కొని తన వద్ద ఉంచుకున్నాడు. మహ్మద్‌ రవూఫ్‌పై గతంలో హత్యాయత్నం కేసు, సల్మాన్‌పై హుక్కా సెంటర్‌ నిర్వహణ కేసులు ఉన్నాయి. 

‘ఆన్‌లైన్‌’ జాబితాలు అధ్యయనం చేసి..
రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌లైన్‌ దందాపై దృష్టి పెట్టారు. మూడు నెలల కాలంలో ఆయుధాలను ఆన్‌లైన్‌లో ఎవరు ఆర్డర్లు ఇచ్చారు? ఎవరెవరు డెలివరీ తీసుకున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ సోమవారం ఏడు ఠాణాల పరిధిలో దాడులు చేశారు. 12 మంది యువకుల్ని అరెస్టు చేసి 13 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించిన స్నాప్‌డీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. హరియాణాలోని గుర్గావ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్నాప్‌డీల్‌ ఎండీకి నోటీసులు జారీ చేయనున్నామని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. చిక్కిన వారంతా 20–25 ఏళ్ల మధ్య వయస్కులని, ఇలాంటి వారి దగ్గర ఆయుధాలు ఉంటే బెదిరింపులకు దిగడమే కాకుండా కీలక సందర్భాల్లో వాటిని వినియోగించి ఉద్రిక్తతలకు కారణమవుతారని వివరించారు. 

ఏ సైట్‌లో చూసినా..
స్నాప్‌డీల్‌ మాత్రమే కాదు.. ఏ ఈ–కామర్స్‌ సైట్‌లో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయి. రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే చాలు పార్శిల్స్‌ ఇంటికి చేర్చేస్తున్నారు. కొన్ని సైట్లు క్యాష్‌ ఆన్‌ డెలివరీ అవకాశాన్నీ ఇస్తున్నాయి. ఆయుధ చట్టం ప్రకారం ఇలా ఆయుధాలను అమ్మడం నేరం. ప్రస్తుతం స్నాప్‌డీల్‌పై ఆధారాలు చిక్కినందుకు దానిపై చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇతర సైట్లకు సంబంధించి ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని డీసీపీ అన్నారు. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాలకు మించి వెడల్పుతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరమే అని ఆయన స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న వాటినీ ఇంట్లో ఉంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement