అగర్తలా : దిశ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపివేసినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఉదంతాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. త్రిపురలో 17 ఏళ్ల బాలికపై నెలన్నర పాటు లైంగిక దాడికి పాల్పడిన యువకుడు ఆమెను సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు అజయ్ రుద్ర పౌల్, అతని తల్లి అనిమ రుద్ర పౌల్ (59)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కాలిన గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా తమ కుమార్తెను అక్టోబర్ 28న ఖవోసి జిల్లా కల్యాణ్‌పూరిలోని తమ ఇంటి నుంచి అజయ్ కిడ్నాప్ చేశాడని, శాంతిర్ బజార్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అజయ్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూ ఐదు లక్షలు కట్నం డిమాండ్ చేశాడని, కొంత మొత్తం సొమ్ము ముట్టడంతో డిసెంబర్ 11న ఆమెను వివాహం చేసుకునేందకు అజయ్ అంగీకరించాడని తెలిపారు. అయితే కట్నం విషయంలో అజయ్ తన తల్లితో వాగ్వాదం జరిగిన క్రమంలో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు వెల్లడించారు. బాలిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు, స్ధానికులు అజయ్, అనిమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నామని, కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అజయ్ బంధువు ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యులను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి వారు ఒకరికి ఒకరు పరిచయమయ్యారని, సోషల్ మీడియా, ఫోన్ సంభాషణల ద్వారా దగ్గరయ్యారని స్ధానికులు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment