షేక్ అబ్దుల్ రహీం (ఫైల్)
సాక్షి, బంజారాహిల్స్: రోజులు గడుస్తున్నా అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులు, కుటుంబ సభ్యులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జ్ హెడ్‌మాస్టర్ షేక్ అబ్దుల్ రహీం(48) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అతడి భార్య ముబీన్‌ఫాతిమా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓవైసీ కాలనీలో ఉంటున్న షేక్ అబ్దుల్ రహీం నాలుగేళ్లుగా ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నారు.
మే 1న స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం అతడి భార్య ఫాతిమా ఆయనకు ఫోన్ చేసి లంచ్‌కు వస్తున్నారా అని అడిగింది. పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టింది. వారం రోజుల నుంచి వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా మే 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రహీం మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో బైక్ పార్క్ చేసి రైల్లో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు.
జూన్ 2న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో రూ.40వేలు డ్రా చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రహీం హైదరాబాద్‌లోనే ఉన్నాడని, తన కుటుంబ సభ్యులకు దొరక్కుండా దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతినెలా జీతంమాత్రం డ్రా చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment