ఔరంగాబాద్ : ఓవైపు వాట్సాప్‌లో నకిలీ వార్తలతో అమాయకులపై దాడులు జరుగుతోంటే.. మరోవైపు నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్విన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే మోయిన్ మెహమూద్ పఠాన్ (35)పై దాదాపు 20 మంది వ్యక్తులు కత్తులు, తల్వార్‌లతో మూక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్సూల్ ప్రాంతంలోని ఫాతిమానగర్‌లో జరిగింది.
తీవ్ర గాయాలపాలైన పఠాన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాంయత్రం వాట్సాప్‌లో పఠాన్ చేసిన కామెంట్లు ప్రత్యర్థి వర్గాన్ని ఈ దాడికి ఉసిగొల్పాయని అంటున్నారు. దమ్ముంటే తనతో తేల్చుకోవాలని పఠాన్ చాలెంజ్ చేసినట్టు తెలుస్తోంది.
కొన్ని గంటల వ్యవధిలోనే..
వాట్సాప్‌లో రెచ్చగొట్టే కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 20 మంది సమూహం పఠాన్‌పై దాడి చేసిందని ఆయన మేనల్లుడు ఇర్ఫాన్ షైక్ తెలిపాడు. తన మామపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయినందుకు ఇర్ఫాన్‌ను కూడా తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనతో ప్రమేయమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment