
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టారు కొంతమంది దుర్మార్గులు. వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. ఈ దారుణ ఘటన వారణాసి నగరంలోని హార్సోస్ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్ భరద్వాజ్, రాహుల్ అనే నేరస్తులు హార్సోస్ గ్రామానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రాహుల్ అక్కడి నుంచి పారిపోయాడు. రాజన్ భరద్వాజ్ పోలీసులకు దొరికిపోయాడు.
రాజన్ భరద్వాజ్‌ను కారులో ఎక్కించుకుని వెళ్తుండగా, క్రిమినల్స్‌కు చెందిన అనుచరులు, కొందరు గ్రామస్తులు పోలీసులకు అడ్డుపడ్డారు. బైక్ మీద వెళ్తున్న పోలీసులను పట్టుకుని కొట్టారు. రాళ్లతో దాడి చేశారు. అనంతరం గ్రామంలోని ఓ చెట్టుకు వారిని కట్టేశారు. తమను వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. అనంతరం పోలీస్ అధికారుల వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను కూడా లూటీ చేసి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఎస్‌పీ అదనపు బలగాలతో వెళ్లి గ్రామస్తులను చెదరగొట్టారు. పోలీసులను రక్షించారు. ఈ ఘటన కు సంబంధించి సుమారు 12 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాజన్ భరద్వాజ్, రాహుల్ బంధువుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment