వివాహితపై రౌడీ షీటర్ల లైంగిక దాడి | Molestation Attack On Women In Eluru | Sakshi
Sakshi News home page

వివాహితపై రౌడీ షీటర్ల లైంగిక దాడి

Published Wed, Jan 8 2020 5:12 AM | Last Updated on Wed, Jan 8 2020 5:21 AM

Molestation Attack On Women In Eluru - Sakshi

ఏలూరు టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో పాశవికమైన అకృత్యం చోటుచేసుకుంది. ఓ మహిళపై రౌడీ షీటర్లు, కొందరు యువకులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్‌ రేప్‌కు ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు నగరంలోనే అంతర్భాగంగా ఉండే.. ఏలూరు గ్రామీణ పరిధిలోని నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత ఇటీవల జ్వరం బారినపడిన తన కుమారుడికి టాబ్లెట్లు తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్‌ షాపునకు కాలి నడకన వెళ్లింది. తిరిగి ఇంటికి బయలుదేరగా.. నాగేంద్ర కాలనీకే చెందిన యాకోబు అనే రౌడీషీటర్‌ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి తన బైక్‌ ఎక్కమన్నాడు. ఆమె నిరాకరించగా.. చలి గాలిలో ఒంటరిగా వెళ్లడం మంచిది కాదన్నాడు.

ముఖపరిచయం గల వ్యక్తి కావడం, త్వరగా ఇంటికెళ్లి కుమారుడికి టాబ్లెట్లు వేయాలన్న ఆతృతతో ఆ మహిళ అతడి బైక్‌ ఎక్కింది. నాగేంద్ర కాలనీకి వెళ్లాక ఆ రౌడీ షీటర్‌ బైక్‌ను దారి మళ్లించి సమీపంలో ముళ్ల పొదలతో చిట్టడవిని తలపించే ఫోర్త్‌ పిచ్‌ (క్రికెట్‌ మైదానం) ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ముగ్గురు రౌడీ షీటర్లు, మరికొందరు యువకులు మాటు వేసి ఉన్నారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావంటూ ఆ మహిళ ప్రతిఘటించబోగా.. వారంతా కలిసి కొబ్బరి మట్టలతో ఆమెను తీవ్రంగా కొట్టి.. బలవంతంగా మద్యం తాగించి.. ఆమె ఒంటిపై దుస్తులన్నీ తొలగించి.. ఒకరి తరువాత ఒకరు రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

తెల్లవారుజామున ఆమె స్పృహలోకి రాగా.. అకృత్యానికి ఒడిగట్టిన వారంతా గంజాయి కాలుస్తూ.. మద్యం మత్తులో జోగుతూ కనిపించారు. లేవలేని స్థితిలోనే ఆ మహిళ ముళ్లపొదల మధ్య నుంచి పాకుతూ నగ్నంగానే రోడ్డుపైకి చేరుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వ్యక్తి ఒకరు ఆమె నిస్సహాయతను గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడలేకపోయింది. ఆ వ్యక్తి తాను ధరించిన స్వెటర్‌ను ఆమె ఒంటిపై కప్పి వెళ్లిపోయాడు. ఆ మహిళ నడవ లేని స్థితిలోనే ఇంటికి చేరుకుంది.

భర్త ఊళ్లో లేకపోవడం.. మృగాళ్లు రౌడీ షీటర్లు కావడంతో..
ఇంటికి చేరిన బాధితురాలు తీవ్ర గాయాలతో నాలుగైదు రోజులపాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. భర్త ఉపాధి నిమిత్తం వేరే ఊళ్లో ఉండటం, ఇద్దరు బిడ్డలు చిన్నవాళ్లు కావడంతో ఆమెను పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. మరోవైపు నిందితులు రౌడీ షీటర్లు కావడం.. తనపై జరిగిన అకృత్యంపై ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమోనని బాధితురాలు భయపడింది. ఈ పరిస్థితుల్లో తరచూ యోగక్షేమాలు తెలుసుకునే బంధువు ఇంటికి రాగా.. బాధితురాలు జరిగిన దుర్మార్గాన్ని వివరించి బావురుమంది. రెండు రోజులుగా ఆ మృగాళ్లు రాత్రివేళ ఇంటికొచ్చి తలుపులు కొడుతున్నారని కూడా చెప్పింది. బంధువు ఆమెకు ధైర్యం చెప్పి.. చుట్టుపక్కల వారిని కూడగట్టి.. బాధితురాలిని మంగళవారం ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు సేకరించిన అనంతరం వెల్లడిస్తామని సీఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement