నైనాల చంద్రశేఖర్
చీమకుర్తి రూరల్: పొట్టపొడిస్తే అక్షరం ముక్కలేదు. చేసే పని గ్రానైట్ క్వారీల్లో పొక్లెయిన్ ఆపరేటర్. వచ్చే జీతం చాలదనుకున్నాడు. కంత్రీ తనానికి పాల్పడ్డాడు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టటం, పొక్లెయిన్‌లు, కార్లను తీసుకురావడం.. ఫైనాన్స్‌లో క్లియరెన్స్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించటం.. ఆ తర్వాత ఆ వాహనాలను వేరే ఫైనాన్స్‌లో పెట్టి మళ్లీ రుణాలు తీసుకోవడం.. లేక అదే వాహనాలను వేరే వారికి అమ్ముకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇదీ చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్ చీటింగ్ వ్యవహారం. వేలిముద్రగాడైన కంత్రీగాడి చేతిలో మోసపోయిన బాధితులు రెండు వారాల క్రితం ఎస్పీ ఆఫీస్‌తో పాటు చీమకుర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆయన చేతిలో మోసపోయిన ఇద్దరు ముగ్గురు బాధితులు తమ గోడును శుక్రవారం ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..
నిందితుడి స్వస్థలం చీమకుర్తే
నిందితుడు నైనాల చంద్రశేఖర్ స్వస్థలం చీమకుర్తిలోని గాంధీనగర్‌లోని 2వ లైన్. తండ్రి బేల్దారీ పనిచేసుకుంటుంటే తల్లి గేదెలు మేపుకుంటూ పాలు పోసి జీవనం సాగిస్తోంది. క్వారీలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తాడు. పొక్లెయన్ కొనుక్కుంటానని అంటే అప్పుగా ఎదురుగా నివాసం ఉంటున్న అంబటి వెంకట రమణారెడ్డి రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అంతే కాకుండా బంధువుల ఇళ్లల్లో పెళ్లి ఉంది బంగారు నగలివ్వమంటే 10 సవర్ల బంగారు నగలు కూడా ఇచ్చి పంపించారు. అది చాలదన్నట్లుగా రూ.17 లక్షల విలువ చేసే పొక్లెయిన్‌ను తీసుకెళ్లాడు. ఇంత వరకు బండి లేదు. అప్పుతీసుకున్న డబ్లుల్లేవు, పెళ్లికి వెళ్లి వస్తానని తీసుకెళ్లి నగలూ లేవని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ ఫక్కీలో పొక్లెయిన్ స్వాధీనం
టంగుటూరు మండలం కందులూరుకు చెందిన ఒక వ్యక్తి ఫైనాన్స్‌లో రూ.40 లక్షలు విలువ చేసే పొక్లెయిన్ తీసుకునేందుకు అప్రూవల్ చేయించుకున్నాడు. దాన్ని ఆయనకు తెలియకుండానే సినీ ఫక్కీలో తీసుకున్నాడు. తీరా ఆ బండి వాయిదాలు చెల్లించకపోవడంతో కందులూరు వ్యక్తికి నోటీసులు వచ్చాయి. ఇలా ఎందుకు చేశావని చంద్రశేఖర్‌ను అడిగితే తాను చెల్లిస్తానంటూనే బండితో పాటు కనపడకుండా పోయాడని బాధితుడు వాపోయాడు. తవ్వుతూ పోతుంటే ఇలాంటివి దాదాపు 10–15 కేసులు ఉన్నట్లు తెలిసింది. రామతీర్థానికి సమీపంలో ఉన్న ఇద్దరికి చెందిన రెండు పొక్లెయిన్‌లు తీసుకెళ్లి కనపడలేదు. చీమకుర్తి, టంగుటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాలను ఆధారంగా చేసుకొని దాదాపు 8–10 పొక్లెయిన్‌లు తీసుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రామతీర్థం పరిధిలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కట్టి దాని సర్వే నంబర్ మార్చి మళ్లీ రుణం తీసుకొని దాన్ని వేరే వారికి అమ్ముకొని పోయినట్లు తెలిసింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో కారు తీసుకొని క్లియరెన్స్ అయినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కారును వేరే వారికి అమ్ముకొని పోయినట్లు తెలిసింది. నిందితుడిపై చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment