పద్మ(ఫైల్)
నిజామాబాద్ క్రైం: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి కొడుకుచే దొంగతనాలు చేయించిందో తల్లి. అయితే.. ఆమె వ్యూహం బెడిసికొట్టడంతో కటకటాలపాలైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాందేవ్ వాడకు చెందిన కనుగంటి పద్మ ఇటీవల ఓ దుకాణంలో నాలుగు తులాల బంగారం కొనుగోలు చేసింది. చోరీకి గురైన సొత్తుపై 70 శాతం రికవరీ ఉంటుందని పేపర్‌లో చదివింది. ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో కొడుకుతో దొంగ అవతారం ఎత్తించింది.
తన వ్యూహంలో భాగంగా పద్మ పూసలగల్లీకి కొడుకుతోనే వాహనంపై వెళ్లింది. రోడ్డుపై ఎవరూ లేని చోట ఉండిపోగా, ముఖంపై కారం చల్లి మెడలో నుంచి గొలుసును దొంగ ఎత్తుకుపోయినట్లు విలపించింది. ఆమె మాటలను నమ్మి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు అదే రోజు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి ఉపయోగించిన వాహనం యజమానిని పోలీసులు పట్టుకుని విచారించగా తన స్నేహితుడు విష్ణు సిద్దార్థకు ఇచ్చినట్లు తెలిపాడు.
విష్ణును విచారించగా తన తల్లే తనతో దొంగతనం చేయించిందని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్సు డబ్బులకు ఆశపడి తానీ పథకం రచించినట్లు పద్మ అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ నాగేశ్వర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment