సాక్షి, ఒంగోలు : కన్న కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన కేసులో తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి, వ్యభిచార కేంద్రం నిర్వాహకులకు పదేళ్లు, మరో వ్యభిచార కేంద్రం నిర్వాహకులకు ఏడేళ్లు, బాధితురాలి తల్లికి నాలుగేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు జడ్జి జి.దుర్గయ్య సోమవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు విడిపోవడంతో వారి 13 ఏళ్ల కుమార్తె తల్లి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో తల్లి విల్సన్ అనే ఆటో డ్రైవర్‌తో సహజీవనం సాగిస్తోంది.
ఇంటికి వచ్చే విల్సన్ బాలికపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కన్న తల్లికి చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. అనంతరం బాలికను విజయవాడలోని వ్యభిచార గృహానికి రూ.2 లక్షలకు తల్లి అమ్మేసింది. బాలిక అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత వారు మంగళగిరిలోని మరో వ్యభిచార గృహానికి బాలికను అమ్మేశారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత వారు చీరాల బోడిపాలెంలోని వ్యభిచార గృహానికి అమ్మారు. బోడిపాలేనికి చెందిన వ్యభిచార గృహం నిర్వాహకులు బాలికను వ్యభిచారం కోసం చిలకలూరి పేట వైపు తీసుకెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో పొలీసులకు ఫిర్యాదు చేసింది.
అక్కడి నుంచి ఒంగోలు చైల్డ్‌లైన్‌కు సమాచారం అందడంతో హెల్ప్ సిబ్బంది బీవీ సాగర్ బాలికను చీరాల ఒన్‌టౌన్ పొలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అప్పటి చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ బాలికను విచారించి కేసును పక్కాగా విచారించారు. 2016లో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో కన్న తల్లి చేసిన ఘాతుకంపై సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి బాధితురాలికి ఉండటంతో తల్లికి సంబంధించిన బంధువులు కొందరు బాలికను బెదిరించారు.
డీఎస్పీ బాలికకు రక్షణ కల్పించడంతో బాలిక జరిగిన విషయాన్ని కోర్టులో వివరించింది. కోర్టులో నేరం రుజువైంది. నిందితులైన మారు తండ్రి విల్సన్, విజయవాడకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకురాలు లంక అనూషకు పదేళ్లు చొప్పున జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, చీరాలకు చెందిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు అన్నపురెడ్డి నాగమణి, సాంబ, జతిన్‌లాల్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, బాధితురాలి తల్లి తల్లి గజ్జెల దీపికకు నాలుగేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
ఈ కేసును అప్పటి డీఎస్పీ ప్రేమ్‌కాజల్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీరామ్, వెంకటేశ్వర్లు, హరిబాబు, వెంకట్రావ్, వినోద్‌ల పోలీసు బృందం నిందితులకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి వారికి శిక్ష పడేలా కృషి చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లుగా ఎం.గార్గేయి, జ్వోసిన్‌లు వ్యవహరించి నిందితులకు శిక్ష పడేందుకు తమ వాదనలు వినిపించారు. బాలికకు కేసు విచారణలో ఉండగానే పునరావసం, విద్య అభ్యసించేందుకు కలెక్టర్ రూ. రూ.3.75 లక్షలు మంజూరు చేశారు. ఈ నగదును బాలిక పేరుపై బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment