సీతంనాయుడు కొట్టిన దెబ్బలకు మృతి చెందిన తల్లి పైడమ్మ
గజపతినగరం రూరల్ : మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మీసాల పైడమ్మ (62) మతిస్థిమితం లేని తన కుమారుడు చేతిలో మంగళవారం హతమైంది. వివరాల్లోకి వెళ్తే... ముచ్చర్ల గ్రామానికి చెందిన పైడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహమైంది. పైడమ్మ భర్త సన్యాసప్పడు రెండు సంవత్సరాల కిందటే మృతి చెందడంతో ఆమె ముచ్చర్ల గ్రామంలో నివాసం ఉంటుంది.
ఈ క్రమంలో కొన్నేళ్లుగా విశాఖపట్నంలో మతిస్థిమితం లేని తన కుమారుడు సీతంనాయుడు ఇటీవల ముచ్చర్ల గ్రామంలోని తన తల్లి వద్దకు చేరాడు. ఒక్కోసారి బాగానే మంచివాడుగా ఉంటుండే వాడని కొన్నిసార్లు పిచ్చివాడుగా తిరుగుతుండేవాడని గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. పైడమ్మ కొన్ని నెలలుగా వేమలి గ్రామంలో తన కుమార్తె అచ్చియ్యమ్మ ఇంటి వద్ద ఉండేదని ఇటీవల ముచ్చర్ల గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.
తల్లి వద్దకు చేరిన కొడుకు సీతంనాయుడు ఒక్కసారిగా మానసిక స్థితి కొల్పోయి తన తల్లిని ఇంట్లో పెట్టి తలుపులు వేసి చెక్కతో తలపైన, వంటిపైన కొట్టడంతో పైడమ్మ పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న పైడమ్మను గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేక మృతి చెందింది. పోలీసుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో డీఎస్పీ ఆరా!
గజపతినగరం రూరల్: మీసాల పైడమ్మ హత్యకు గురవడం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు బొబ్బిలి డీఎస్పీ గౌతమి శాలి మంగళవారం ఆరా తీశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకువచ్చిన పైడమ్మను ఆమె పరిశీలించారు. సీతంనాయుడు పైడమ్మపై దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది ఆరా తీసినట్టు తెలిపారు. నిందితుడు సీతంనాయుడును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సీఐ కాళిదాసు ముచ్చర్ల గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment