'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్ | MSC student Murali suicide at OU | Sakshi
Sakshi News home page

'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్

Published Mon, Dec 4 2017 2:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

MSC student Murali suicide at OU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒత్తిడి తట్టుకోలేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూ వసతి గృహంలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఎంఎస్సీ ఫిజిక్స్‌ ఫస్ట్‌ ఇయర్‌కు చెందిన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చదవలేకపోతున్నానని, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉన్న ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. 

షూ లేస్‌.. ప్లాస్టిక్‌ తాడు.. 
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌కు చెందిన ఈరమైన మల్లేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మి కూలి పని చేసి రెండో కుమారుడు మురళిని చదివించింది. మురళి దౌలాపూర్‌లో ప్రైమరీ, జగదేవ్‌పూర్‌లో ఇంటర్మీడియెట్‌ వరకు చదివాడు. గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 2017 –18లో సైన్స్‌ కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌ (నానో సైన్స్‌) ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందాడు. క్యాంపస్‌లోని మానేరు హాస్టల్‌ రూం నంబర్‌ 159లో వసతి పొందుతున్నాడు. ఆదివారం ఉదయం విద్యార్థులు స్నానాల గది తలుపు తెరిచి చూడగా షూ లేస్, దుస్తులు ఆరేసుకునే ప్లాస్టిక్‌ తాడుతో ఉరేసుకుని మురళి విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం మురళి మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ వీసీని ఘెరావ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘మురళి చదువులకు తల్లి లక్ష్మి కూలి డబ్బులే ఆధారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, డీఎస్సీ కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశానని ఆవేదన చెందేవాడు. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని తపన పడేవాడు’అని మురళి స్నేహితులు అశోక్, రవి తెలిపారు. 

విద్యార్థుల అడ్డగింత 
మురళి మృతదేహాన్ని రాత్రి 10:30 గంటల వరకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. మురళీ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజ్‌ ఎదుట పోస్టుమార్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ కాలేజీలోనే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న జేఏసీ చైర్మన్‌ కోదండరాం మురలికి నివాళి అర్పించారు. మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాడి సాధించాలని పిలుపు నిచ్చారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కల్యాణ్‌ తెలిపారు. నేడు ఓయూ బంద్‌ చేపట్టనున్నట్లు నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కోటూరి మానవతారాయ్‌ తెలిపారు. మరోవైపు క్యాంపస్‌లో శాంతి భద్రతల కోసం ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. 

ఇంతలోనే ఎంత పని చేశాడు:  సోదరి 
‘వారం రోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. ఇంతలోనే ఎంత పనిచేశాడు’అంటూ మురళి సోదరి కవిత కన్నీటి పర్యంతమైంది. ఈసీఐఎల్‌లో నివాసముంటున్న ఆమె.. తమ్ముడి మరణవార్త తెలిసి వెంటనే క్యాంపస్‌కు వచ్చింది. తమ్ముడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. ‘నిన్ననే ఫోన్‌లో మాట్లాడాడు. ఇంటికి రమ్మని అడిగితే.. పరీక్షలు ఉన్నాయి.. వారం రోజుల్లో వస్తానని చెప్పాడు’అని పేర్కొంది. ‘ఈసారి నోటిఫికేషన్‌ వస్తే ఉద్యోగం తప్పక సంపాదిస్తానన్నాడు. ఇంతలోనే ఇలా చేస్తాడని ఊహించలేక పోయా’అంటూ ఆమె రోదించింది. 

బతుకులు మారుస్తనంటివి గద బిడ్డా.. 
గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: మురళి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియగానే అతడి తల్లి లక్ష్మి కుప్పకూలిపోయింది. ‘ఎంత పని జేస్తివిరా బిడ్డ.. కడుపుకోత మిగిలిస్తివా. చిన్నతనంలోనే అయ్య సచ్చిపోయిండు. మంచిగ సదువుకొని మన బతుకులు మారుస్తనంటివి. ఏ కష్టమొచ్చిందని గిట్ల చేస్తివిరా. దేవుడా నేనేమి పాపం చేసిన. నాకు శోకమే పెట్టిస్తున్నవ్‌’అంటున్న ఆమె రోదనలు కంటతడి పెట్టించాయి.

మురళి బలవన్మరణంపై ఓయూలో విద్యార్థుల ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement