OU student
-
ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్ !
భీమదేవరపల్లి: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె భరత్‌ను ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వారు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా శాతావాహన యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు స్టడీ టూర్ పేరిట ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి మావోయిస్టులను కలిసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టడీ టూర్లో భరత్ సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడిపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. భరత్ ఇటీవలే జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్ సోదరుడు ఉగ్గె శేఖర్ కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది. భరత్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీసులు తీసుకెళ్లారా.. లేక ఛత్తీస్‌ఘడ్‌లోనే అరెస్ట్ చేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా పోలీసులు తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భరత్ తండ్రి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అ‘పూర్వ’ కలయిక
సాక్షి, హైదరాబాద్ : చదువు నేర్పిన గురులకిది మా వందనం అంటూ.. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలచుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆనాటి మిత్రులను కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. యవ్వనంలో చేసిన అల్లర్లను.. నడి వయసులో మరో సారి గుర్తు చేసుకున్నారు. ఉన్నత శిఖరాలు, పదవులు అధిరోహించినప్పటికీ, అవన్నీ వదిలేసి మరోసారి విద్యార్థులుగా మారిపోయారు. ఆత్మీయత, అనురాగాల మధ్య ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 1968 - 69 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నుంచి 23 వరకూ ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. 50 ఏళ్ల తర్వాత ఆనాటి మిత్రులను కలుసుకుంటున్న ఈ కార్యక్రమానికి కొందరు తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీకి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఈ విషయం గురించి ప్రిన్స్‌పాల్‌తో చర్చించారు. ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకునేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక మీదట తరచుగా ఇలా మిత్రులందరూ కలుస్తుండాలని నిర్ణయించుకుని సెలవు తీసుకున్నారు. -
'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్
-
'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడి తట్టుకోలేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూ వసతి గృహంలోని బాత్రూమ్లో ఉరేసుకుని ఎంఎస్సీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్‌కు చెందిన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చదవలేకపోతున్నానని, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉన్న ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. షూ లేస్.. ప్లాస్టిక్ తాడు.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌కు చెందిన ఈరమైన మల్లేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మి కూలి పని చేసి రెండో కుమారుడు మురళిని చదివించింది. మురళి దౌలాపూర్‌లో ప్రైమరీ, జగదేవ్‌పూర్‌లో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 2017 –18లో సైన్స్ కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్ (నానో సైన్స్) ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందాడు. క్యాంపస్‌లోని మానేరు హాస్టల్ రూం నంబర్ 159లో వసతి పొందుతున్నాడు. ఆదివారం ఉదయం విద్యార్థులు స్నానాల గది తలుపు తెరిచి చూడగా షూ లేస్, దుస్తులు ఆరేసుకునే ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని మురళి విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మురళి మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ వీసీని ఘెరావ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘మురళి చదువులకు తల్లి లక్ష్మి కూలి డబ్బులే ఆధారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, డీఎస్సీ కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశానని ఆవేదన చెందేవాడు. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని తపన పడేవాడు’అని మురళి స్నేహితులు అశోక్, రవి తెలిపారు. విద్యార్థుల అడ్డగింత మురళి మృతదేహాన్ని రాత్రి 10:30 గంటల వరకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. మురళీ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎదుట పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీలోనే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న జేఏసీ చైర్మన్ కోదండరాం మురలికి నివాళి అర్పించారు. మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాడి సాధించాలని పిలుపు నిచ్చారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్ తెలిపారు. నేడు ఓయూ బంద్ చేపట్టనున్నట్లు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ తెలిపారు. మరోవైపు క్యాంపస్‌లో శాంతి భద్రతల కోసం ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఇంతలోనే ఎంత పని చేశాడు: సోదరి ‘వారం రోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. ఇంతలోనే ఎంత పనిచేశాడు’అంటూ మురళి సోదరి కవిత కన్నీటి పర్యంతమైంది. ఈసీఐఎల్‌లో నివాసముంటున్న ఆమె.. తమ్ముడి మరణవార్త తెలిసి వెంటనే క్యాంపస్‌కు వచ్చింది. తమ్ముడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. ‘నిన్ననే ఫోన్లో మాట్లాడాడు. ఇంటికి రమ్మని అడిగితే.. పరీక్షలు ఉన్నాయి.. వారం రోజుల్లో వస్తానని చెప్పాడు’అని పేర్కొంది. ‘ఈసారి నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం తప్పక సంపాదిస్తానన్నాడు. ఇంతలోనే ఇలా చేస్తాడని ఊహించలేక పోయా’అంటూ ఆమె రోదించింది. బతుకులు మారుస్తనంటివి గద బిడ్డా.. గజ్వేల్/జగదేవ్‌పూర్: మురళి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియగానే అతడి తల్లి లక్ష్మి కుప్పకూలిపోయింది. ‘ఎంత పని జేస్తివిరా బిడ్డ.. కడుపుకోత మిగిలిస్తివా. చిన్నతనంలోనే అయ్య సచ్చిపోయిండు. మంచిగ సదువుకొని మన బతుకులు మారుస్తనంటివి. ఏ కష్టమొచ్చిందని గిట్ల చేస్తివిరా. దేవుడా నేనేమి పాపం చేసిన. నాకు శోకమే పెట్టిస్తున్నవ్’అంటున్న ఆమె రోదనలు కంటతడి పెట్టించాయి. మురళి బలవన్మరణంపై ఓయూలో విద్యార్థుల ఆందోళన -
గుండెపోటుతో ఓయూ విద్యార్థి మృతి
హైదరాబాద్: ఓయూ సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ చేసి బేసిక్ సైన్స్ రీసెర్చ్ (బీఎస్ఆర్) ఫెలోగా పరిశోధన చేస్తున్న సిరికొండ శ్రీకాంత్ (33) గుండెపోటుతో చనిపోయాడు. ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా వైరా మండలం గుబ్బగుర్తి గ్రామానికి చెందిన సిరికొండ అప్పయ్యచారి కుమారుడైన శ్రీకాంత్ గురువారం రాత్రి 12 గంటలకు పని ముగించుకొని తిరిగి బైక్ పై అంబర్‌పేట్‌లో గల తన రూంకు వెళ్తుండగా క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద గుండెపోటు వచ్చింది. బాధతో బైక్‌పై నుంచి కిందపడిపోయిన అతడిని అక్కడే ఉన్న కొందరు 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆరు నెలల క్రితమే శ్రీకాంత్‌కు నల్లగొండ జిల్లా యువతితో వివాహం అయిందని స్నేహితులు తెలిపారు. -
ఉద్యోగాల ఊసేది?
ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంపై ఓయూలో ఆందోళన హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీలో జాప్యంపై ఓయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోటూరి మానవతరాయ్ ఆధ్వర్యంలో లైబ్రరీని బహిష్కరించి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా మానవతరాయ్ మాట్లాడుతూ జూలైలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని కేసీఆర్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ప్రకటించినా భర్తీ ఊసే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగుల డొక్కల గురించి ఆలోచించడం లేదన్నారు. హరిత హారానికి ప్రతీకగా నిరుద్యోగ హారం చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించినట్లు 25 వేల ఉద్యోగాలు కాకుండా.. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని, గ్రూప్-2, 3, ఎస్సై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు బండి నరేష్, పెద్దిబాబు, జగన్, తిరుపతి, మహిపాల్‌రెడ్డి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.