సాక్షి, హైదరాబాద్ : చదువు నేర్పిన గురులకిది మా వందనం అంటూ.. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలచుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆనాటి మిత్రులను కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. యవ్వనంలో చేసిన అల్లర్లను.. నడి వయసులో మరో సారి గుర్తు చేసుకున్నారు. ఉన్నత శిఖరాలు, పదవులు అధిరోహించినప్పటికీ, అవన్నీ వదిలేసి మరోసారి విద్యార్థులుగా మారిపోయారు. ఆత్మీయత, అనురాగాల మధ్య ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 1968 - 69 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నుంచి 23 వరకూ ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది.
50 ఏళ్ల తర్వాత ఆనాటి మిత్రులను కలుసుకుంటున్న ఈ కార్యక్రమానికి కొందరు తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీకి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఈ విషయం గురించి ప్రిన్స్‌పాల్‌తో చర్చించారు. ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకునేలా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇక మీదట తరచుగా ఇలా మిత్రులందరూ కలుస్తుండాలని నిర్ణయించుకుని సెలవు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment