దొరికితే దొంగ.. లేకుంటే దొర | Municipal RI In ACB Net in Vizianagaram | Sakshi
Sakshi News home page

అవినీతికి చిరునామా...

Published Wed, Aug 7 2019 8:45 AM | Last Updated on Wed, Aug 7 2019 8:45 AM

Municipal RI In ACB Net in Vizianagaram - Sakshi

ఏసీబీకి పట్టుబడిన పార్వతీపురం మున్సిపల్‌ ఆర్‌ఐ శంకర్రావు

ఆయన చేయి తడిపితే చాలు భవనాల విస్తీర్ణం తగ్గిపోతుంది. పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. సర్కారు ఆదాయానికి గండికొట్టడమే తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్న ఆ అధికారి ఉన్న పళంగా ఆస్తులు కూడబెట్టేశారు. సునాయాసంగా లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఆయన పాపం పండింది. ఓ భవన యజమాని నుంచి లంచం ఆశించిన ఆయన అవినీతి అధికారుల వలలో చిక్కారు. ఆయనే పార్వతీపురం మునిసిపాలిటీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శంకరరావు.

సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శంకర్రావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు మాటు వేసి మున్సిపల్‌ కార్యాలయం ముందు కారులో ఆర్‌.శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అపార్టుమెంట్‌ అసెస్‌మెంట్‌ను తగ్గించి ట్యాక్స్‌ వేసేందుకు రూ.2.80లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  పట్టుబడ్డాడు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యక్తుల్లో ఆర్‌ఐ శంకర్రావు పార్వతీపురం చరిత్రలో మొదటి వ్యక్తి కావడం విశేషం. లంచం అడిగిన శంకర్రావు విషయమై భవన యజమాని శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు తెలియజేసి పథకం ప్రకారం పట్టించారు. ఏసీబీ అధికారులు శంకర్రావుపై కేసు నమోదు చేశారు.

పెచ్చుమీరిన అవినీతి
వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచగొండుల తీరు మారడం లేదు. ఈ శాఖ ఆ శాఖ అన్న తేడా లేకుండా  పని జరగాలంటే చేయి తడపాల్సిందే. ముఖ్యంగా రెవెన్యూ, పురపాలక శాఖలో  లంచగొండితనం పెట్రేగిపోతుంది. దొరికిన వాడు దొంగగా ముద్ర వేసుకుంటున్నాడు. దొరకని వాడు దొరలా దర్జాగా తిరుగుతున్నాడు. లంచం ఇచ్చేవారు కూడా తమ పని అయిపోతే సరిపోతుంది అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు అన్న కోణంలో ఆలోచన చేస్తూ అధికారుల చేయి తడుపుతూ పనులు చేయించుకుంటున్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలో..
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెట్రేగిపోతుంది. రెవెన్యూ శాఖలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల మొండి బకాయిలు చెల్లించకుండా ఉండే వారిని బెదిరించి వారి నుంచి లంచాలు తీసుకుని వారికి లబ్ధి చేయడం పరిపాటిగా మారింది. సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించని వారు ఉంటే అటువంటి వారిని టార్గెట్‌ చేసి పన్ను కడతారా? లేక ఆస్తులు జప్తు చేయమంటారా? అని బెదిరించి ఎంతోకొంత చేతికి ముట్ట చెబితే విడిచిపెడతామని బెదిరించి లంచాలు తీసుకుంటున్నారు. అయినా వీరు ఏసీబీ అధికారులకు చిక్కకుండా సత్యహరిశ్చంద్రుల్లా దర్జాగా తిరుగుతున్నారు.

పట్టణ ప్రణాళికా విభాగం లంచగొండి తనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఎన్నో అనధికార భవనాలు ఉన్నాయి. కానీ వాటిపై చర్యలు ఉండవు. ఎందుకుంటే పాలకుల నుంచి అధికారుల వరకు భారీగా ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. బిల్డింగ్‌ ప్లాన్‌ కావాలంటే లంచం, భవనం విస్తీర్ణం తగ్గించాలంటే లంచం, లేఔట్‌ రెగ్యులైజేషన్‌ చేయాలంటే లంచం, కొత్త లేఔట్‌ వేయడానికి అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇలా ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయించి లంచం తీసుకుంటుంటారు.

వరుస సంఘటనలు...
మూడేళ్ల కిందట పార్వతీపురం రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పని చేసిన కిరీటి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగంలో టీపీఎస్‌గా పని చేసిన జనార్ధన్‌ లంచం తీసుకుంటు పట్టుబడ్డారు.
పార్వతీపురం పట్టణంలోని జేపీ అపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటూ జియ్యమ్మవలసకు చెందిన తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఐటీడీఏ డీఈగా పని చేసి మూడేళ్లు క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఇటుక బట్టీకి విద్యుత్‌ సరఫరా ఇవ్వడానికి లంచం తీసకుంటూ గరుగుబిల్లి ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement