
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి, వెనుక నిందితులు(ముసుగు ధరించిన వ్యక్తులు)
రోలుగుంట(చోడవరం): మాకవరంపాలెం మండలం అప్పన్నదొర పాలెంకు చెందిన ఎత్తుల రాజేంద్ర ప్రసాద్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి రెండో భార్య హత్య చేసినట్టు గుర్తించారు. మండలం గుండుబాడు చెరువులో ఈ నెల 4న రాజేంద్రప్రసాద్ శవమైతేలాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి అన్ని కోణాల్లో విచారణ జరిపి, మృతుడి రెండో భార్య మంగ , ఆమె ఇద్దరు సోదరులను గురువారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను ఏఎస్పీ వెల్లడించారు. మాకవరంపాలెం మండలం అప్పన్నదొర పాలెంకు చెందిన ఎత్తుల రాజెంద్ర ప్రసాద్‌కు ఇద్దరు పిల్లలున్నారు. తరువాత మంగ అనే మహిళను పదేళ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడం మంగ అన్నదమ్ములకు ఇష్టం లేదు. మంగ, రాజేంద్రప్రసాద్‌కు ముగ్గురు పిల్లలున్నారు. రాజేంద్రప్రసాద్ కూలి డబ్బులతో మద్యం సేవిస్తూ మంగపై తరచూ చేయి చేసుకునేవాడు. సెప్టెంబర్ 4న కూడా మంగను కొట్టడంతో ఆమె తన పుట్టింటికి మామిడిపాలెం వెళ్లిపోయింది. భర్త తరచూ చేయి చేసుకోవడంతో మంగ భర్తపై అయిష్టత పెంచుకుంది. ఈ నేపధ్యంలో అదే నెల 20న మంగ తమ్ముడు ప్రమాదంలో గాయపడడంతో విశాఖకు చికిత్స కోసం తరలించారు. ఆ రోజు కూడా రాజేంద్రప్రసాద్ పూటుగా తాగి, ఆ మైకంలో భార్య వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంగ లావుపాటి సర్వే కర్రతో అతనిని బలంగా కొట్టింది. దీంతో రాజేంద్రప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాడు. తరువాత కూడా రెండు దెబ్బలు వేసింది. అంతలో మంగ అన్నలు కచ్చాల గోవింద, కచ్చాల అప్పలనాయుడు ఇంటికి వచ్చి రాజేంద్రప్రసాద్‌ను పరీక్షించి, మృతిచెందినట్టు గుర్తించారు. వెంటనే చెల్లితో కలసి ఇంటి వెనుక భాగంలోంచి సమీప సుకుమారకొండపైకి మృతదేహాన్ని తీసుకెళ్లి పాతిపెట్టారు. కొన్ని రోజుల తరువాత ఈ ప్రాంతంలో ఎవరైనా తిరిగితే అనుమానం వస్తుందని భావించిన వారు, కొండ పైకి వెళ్లి మృతదేహాన్ని గోనె సంచెలో వేసి, పాలిథిన్ కవర్ మూసి పాతిపెట్టి వచ్చేశారు. కొన్ని రోజుల పోయిన తరువాత ఈ నెల 4 న కొండ దిగువన రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ శివారు కశిరెడ్డిపాలెం ఊట చెరువులో మృతదేహాన్ని పడేశారు. చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లివిచారించారు. మృతదేహాన్ని మొద టి భార్య గున్న గుర్తించింది. పాత కక్షలతో ఎవ రో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలతో కలసి ఏఎస్పీ సంఘటనా స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. అనుమానితులైన మృతుడి రెండో భార్య మంగ, ఆమె సోద రులను మంగళ, బుధవారాలు విచారించారు. లభించిన ఆధారాలు, విచారణలో వెలువడిన విషయాలు ధ్రువపడడంతో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో కొంతమందికి సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఏఎస్పీ రిషాంత్ రెడ్డి విలేకరులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment