రక్తసిక్తమైన సుబ్బలక్ష్మి
ఆ భార్యాభర్తలిద్దరూ కలసి ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చారు. భర్త టీవీ చూస్తుండగా, భార్య నిద్రకు ఉపక్రమించింది. ఈలోగా ఏం జరిగిందో ఏమో! తెల్లారేసరికి భార్య రక్తపు మడుగులో ఉంది. భర్త కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన పిఠాపురం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..
పిఠాపురం టౌన్ : మండలంలోని ఎఫ్‌కే పాలెం గ్రామానికి చెందిన ముమ్మిడి సుబ్రహ్మణ్యం(42)తో కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఒడిశాలోని బిలాస్‌పూర్‌లో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలతో కలసి సుబ్బలక్ష్మి స్థానిక బైపాస్ రోడ్డులోని గోపాలబాబా ఆశ్రమానికి ఎదురుగా ఉన్న తమ ఇంటి మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. భర్త సుబ్రహ్మణ్యం బిలాస్‌పూర్ నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూండేవాడు.
భార్యాభర్తలిద్దరి మధ్య స్వల్ప తగాదాలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల సుబ్బలక్ష్మి తన పిల్లలతో కలసి బిలాస్‌పూర్ వెళ్లింది. భర్తతో గొడవ పడి నాలుగు రోజుల క్రితం పిల్లలను అక్కడే వదిలేసి ఒంటరిగా పిఠాపురం వచ్చేసింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం కూడా పిల్లలను బిలాస్‌పూర్‌లోనే వదిలేసి పిఠాపురం వచ్చాడు. సుబ్బలక్ష్మి పుట్టిన ఊరయిన కొండెవరంలో శుక్రవారం జరిగిన శుభకార్యానికి భార్యాభర్తలిద్దరూ వెళ్లి, రాత్రి పది గంటల సమయంలో తిరిగి పిఠాపురంలోని ఇంటికి చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం టీవీ చూస్తుండగా, సుబ్బలక్ష్మి నిద్రపోయింది.
తెల్లారేసరికి నిద్రమత్తు వీడిన సుబ్బలక్ష్మి.. చూసుకొనేసరికి రక్తపు మడుగులో ఉంది. పక్కనే ఉండాల్సిన భర్త కనిపించకుండా పోయాడు. దీంతో భీతిల్లిన ఆమె ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి భయాందోళనతో కేకలు వేసింది. అది గమనించిన చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్‌ను రప్పించి తొలుత పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సుబ్బలక్ష్మిని తరలించారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఎడమచేతిలో కొంత భాగం తొలగించారు.
అంతా మిస్టరీయే..
తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుబ్బలక్ష్మి ముఖం మీద మత్తుమందు స్ప్రే చేసి చేతులు, మెడ మీద నరికి, భర్త సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో సుబ్బలక్ష్మి చెప్పిన సమాచారం మరోలా ఉంది. తాను నిద్రపోతుండగా ముఖం మీద ఎవరో మత్తుమందు స్ప్రే చేసినట్టు గుర్తుకు వస్తోందని, తెల్లారేసరికి చేతుల మీద, మెడ మీద కత్తితో నరికిన గాయాలున్నాయని, తెలివి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నానని సుబ్బలక్ష్మి చెప్పినట్టు పట్టణ ఎస్సై శోభన్‌కుమార్ తెలిపారు.
భర్త సుబ్రహ్మణ్యం కనిపించలేదని ఆమె తెలిపిందని, ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఇన్‌చార్జ్ సీఐ రాంబాబు నేతృత్వంలో పోలీసు బృందాలు ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి. ఆధారాల కోసం క్లూస్ టీం అన్వేషించింది. డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీస్ డాగ్ సమీపంలో ఉన్న ఆదిత్య స్కూల్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. సుబ్రహ్మణ్యం ఆచూకీ తెలిస్తేనే ఈ కేసులో మిస్టరీ వీడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భర్త లేకపోవడం, లోపల ఉండాల్సిన బైక్ కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment