పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుపై.. నరికి చంపారు | Murder In Front Of Police In Attapur | Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుపై.. నరికి చంపారు

Published Thu, Sep 27 2018 1:10 AM | Last Updated on Thu, Sep 27 2018 8:43 AM

Murder In Front Of Police In Attapur - Sakshi

బుధవారం అత్తాపూర్‌లో పెట్రోలింగ్‌ వాహనం ముందే నడిరోడ్డుపై రమేశ్‌ను నరుకుతున్న లక్ష్మణ్‌గౌడ్‌,(ఇన్‌సెట్‌లో) హతుడు రమేష్‌(పైన) నిందితులు కిషణ్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌ : కన్న కొడుకును హతమార్చాడని పగబట్టిన ఓ తండ్రి బావమరిదితో కలసి రంగంలోకి దిగాడు. దాదాపు 9 నెలలుగా అదను కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. పరోక్షంగా హతుడి అన్న ఇచ్చిన సమాచారంతో బుధవారం ఉదయం అత్తాపూర్‌ వద్ద కాపుకాశారు. అందరూ చూస్తుండగానే పోలీసుల కళ్ల ఎదుటే దారుణంగా నడిరోడ్డుపై పరిగెత్తించి నరికి చంపారు. హతుడి ఒంటిపై కత్తి, గొడ్డలికి సంబంధించి 17 బలమైన గాయాలను పోలీసులు గుర్తించారు. పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఎర్రగడ్డలో తండ్రి కత్తివేటుకు తీవ్రంగా గాయపడిన మాధవి ఉదంతం జరిగిన వారానికే రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. నగరంలోని జుమ్మేరాత్‌బజార్‌కు చెందిన మహేశ్‌గౌడ్‌ ఓ వివాహితకు సంబంధించిన వివాదంలో గత ఏడాది డిసెంబర్‌ 24న నగర శివార్లలో దారుణహత్యకు గురయ్యాడు.

ఈ కేసులో జుమ్మేరాత్‌ బజార్‌కే చెందిన జె.రమేశ్‌ (24) ప్రధాన నిందితుడు. హతుడు, నిందితుడు పక్కపక్క ఇళ్లవారే. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన తర్వాత రమేశ్‌ తన మకాం మార్చేశాడు. తన కదలికల్ని మహేశ్‌ సంబంధీకులకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మహేశ్‌ తండ్రి వి.కిషన్‌గౌడ్‌ (వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌) తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోయాడు. ఇతనికి బావమరిది ఎ.లక్ష్మణ్‌ గౌడ్‌ (టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు) కూడా తోడయ్యాడు. ఇద్దరూ రమేశ్‌ను హత్య చేయడానికి అదును కోసం ఎదురు చూశారు. రమేశ్‌ ఆచూకీ కోసం అతడి అన్న, సోదరి ఇళ్ల వద్ద కాపుకాసినా ఫలితం దక్కలేదు.  

మాటల్లో పెట్టి వివరాలు ఆరా... 
ఇటీవల ఓ సందర్భంలో రమేశ్‌ అన్న ఇంటికి వెళ్లిన కిషన్‌ మాటల సందర్భంలో అతని వివరాలు ఆరా తీశాడు. అతడు ఎక్కడ ఉంటున్నాడో తనకు తెలియదని చెప్పిన అన్న... 26న కోర్టు వాయిదా ఉండటంతో ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి వస్తాడని చెప్పాడు. దీంతో బుధవారం హత్య చేసేందుకు కిషన్, లక్ష్మణ్‌ సిద్ధమయ్యారు. మద్యం సేవించి గొడ్డలి, కత్తి తీసుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి అత్తాపూర్‌ ప్రాంతంలో కాపుకాశారు. ఉప్పర్‌పల్లి కోర్టులో విచారణకు మిగిలిన నిందితులు నరేశ్, శివతో కలసి రమేశ్‌ హాజరయ్యాడు. తర్వాత రెండు బైక్‌లపై ఎస్‌బీఆర్‌ గార్డెన్‌ నుంచి హైదర్‌గూడ చౌరస్తా మీదుగా వెళుతున్నారు. కిషన్, లక్ష్మణ్‌ బైక్‌పై అతడిని అనుసరించారు. అత్తాపూర్‌లోని హైదర్‌గూడ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నం.134 వద్ద ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో రమేశ్‌ వాహనం స్పీడు తగ్గింది. ఇదే అదునుగా భావించిన కిషన్‌ వాహనం దిగి రమేశ్‌ను పట్టుకోబోయాడు. ఇది గమనించిన రమేశ్‌ వాహనం దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. ‘నన్ను చంపేందుకు వస్తున్నారు.. కాపాడండి’అంటూ నడిరోడ్డుపై పరుగు ప్రారంభించాడు. అప్పటికే రమేశ్‌పై కత్తితో కిషన్, గొడ్డలితో లక్ష్మణ్‌ దాడి చేయడంతో కొంత వరకు గాయాలయ్యాయి. రమేశ్‌తో ఉన్న మిగిలిన ముగ్గురూ ప్రాణభయంతో అక్కడ నుంచి ఉడాయించారు.  

అడ్డుకోవడం మానేసి... చిత్రీకరణ... 
కాగా అటుగా వచ్చిన ఆటోలో ఎక్కిన రమేశ్‌ కాస్త ముందుకువెళ్లి అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లింగమూర్తి వద్దకు చేరుకున్నాడు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కిషన్, లక్ష్మణ్‌ను నిలువరించే ప్రయత్నం చేయబోయి వారి చేతుల్లో గొడ్డలి, కత్తి కనిపించడంతో వెనక్కి తగ్గాడు. ఈలోపు రమేశ్‌ పిల్లర్‌ నం.140 వద్దకు పరిగెడుతూ వెళ్లాడు. సమీపంలోని బాంటియా షోరూమ్‌ మేనేజర్‌ సురేశ్‌ అప్రమత్తమై హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా... ఫలితం దక్కలేదు. లక్ష్మణ్‌ తన చేతిలోని కత్తితో బెదిరిస్తూ వారించాడు. కాస్త ముందుకు వెళ్లిన సురేశ్‌ ఓ వాహనం అడ్డురావడంతో కింద పడిపోయారు. దీంతో కిషన్, లక్ష్మణ్‌లు రమేశ్‌ను చంపడానికి ముందుకు వెళ్లారు. లక్ష్మణ్‌ అదుపు తప్పి కిందపడగా... కిషన్‌ గొడ్డలితో రమేశ్‌ కాలు మీద బలంగా నరికాడు. తర్వాత లేచిన లక్ష్మణ్‌ అదే గొడ్డలితో కిందపడిన రమేశ్‌ మెడపై 3 వేట్లు వేశాడు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్, మరొకరు కిషన్‌పై హెల్మెట్‌ విసిరినా.. మరో వ్యక్తి ఎగిరి కిషన్‌ తన్నినా.. మళ్లీ తేరుకొని ఇద్దరూ కలసి మరో 7 వేట్లు వేశారు. నిందితులు రమేశ్‌ను గొడ్డలితో నరుకుతుండటంతో లింగమూర్తి కూడా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇంత జరుగుతున్నా ఓవైపు వాహనాలు యథావిధిగా వెళ్లగా.. మరోవైపు చుట్టూ ఉన్న వారు సెల్‌ఫోన్లలో చిత్రీకరించే చేశారే తప్ప ఆపేందుకు ముందుకు రాలేదు. 

బేటా.. నీతానికి పంపించేసిన... 
అదే సమయంలో ఓ దొంగ అత్తాపూర్‌ వైన్స్‌ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పెట్రోలింగ్‌ వాహనం అటు వచ్చింది. ఈ హత్యను చూసి ఇద్దరు కానిస్టేబుళ్లు అందులోంచి దిగారు. వాహనం రోడ్డుపై పడి ఉన్న రమేశ్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోగా... ప్లాíస్టిక్‌ లాఠీలు మాత్రమే ఉన్న ఇద్దరు క్రైమ్‌ కానిస్టేబుళ్లు.. నిందితులు గొడ్డలితో నరుకుతుండటంతో దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. రమేశ్‌ చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక కిషన్, లక్ష్మణ్‌లు ‘బేటా... పంపించేసిన... నీతానికి పంపించేసిన’అంటూ గట్టిగా అరిచారు. కొనఊపిరితో ఉన్న రమేశ్‌ వద్దకు వెళ్లిన కిషన్‌ సమీపంలో పడి ఉన్న గొడ్డలిని తీసి అతడికి చూపించాడు. రక్తం మరకలు అంటిన చొక్కాను విప్పిన లక్ష్మణ్‌... రమేశ్‌పై పడేశాడు. ఆపై ఇద్దరూ పోలీసుల వాహనంలో రాజేంద్రనగర్‌ స్టేషన్‌కు వెళ్లారు. రమేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

ఆ వెంటనే రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్‌టీమ్‌ కూడా శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. కాగా ఫొటోలు, వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తుండగా, నిందితులు మొత్తం నలుగురు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.  నన్ను... చంపేందుకు వస్తున్నారు... కాపాడండి అంటూ... యువకుడు వచ్చాడు. వెనకే ఇద్దరు గొడ్డలి పట్టుకొని దాడి చేసేందుకు వచ్చారు. వారిని నిలువరించే ప్రయత్నం చేశా. ఒకరిని పట్టుకొని పక్కకు తప్పించగానే మరొకరు దాడి చేస్తున్నారు. యువకుడు అలా పరిగెత్తి కుప్పకూలాడు. వద్దని వారించినా.. అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే సెట్‌ ద్వారా సమాచారాన్ని అందించాను.  
– లింగమూర్తి 

కాపాడండి అన్న అరుపులు విని బయటికి చూశా. వెంటనే వచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఒకరి తరువాత ఒకరు దాడి చేస్తుండటంతో నివారించలేకపోయా. నా శాయశక్తులా కృషి చేసినా ఫలితం దక్కలేదు. నాతో పాటు ఈ దారుణాన్ని ఆపేందుకు ఒకరిద్దరు వచ్చినా ముందుకు వచ్చినా హంతకుల్ని పట్టుకునేవాళ్లం.. రమేశ్‌ బతికేవాడు. 
–సురేశ్‌ 

ఇద్దరు దొంగలను తీసుకొని మరో దొంగ అత్తాపూర్‌ వైన్స్‌ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పట్టుకునేందుకు పెట్రోలింగ్‌ వాహనంలో బయలుదేరాం. పిల్లర్‌ నంబర్‌ 143 వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రోడ్డు ప్రమాదం జరిగిందేమో అనుకుని సైరన్‌ వేసుకొని ముందుకు వచ్చాం. ఒక యువకుడు కిందపడి ఉండగా మరో వ్యక్తి గొడ్డలితో నరుకుతున్నాడు. వెంటనే కిందకు దిగి ముందుకు వచ్చాం. అప్పటికే గొడ్డలితో నరుకుతున్న వ్యక్తి దాన్ని పడేసి అరుస్తూ మరో వ్యక్తి వద్దకు వచ్చాడు. తర్వాత నిమిషం వ్యవధిలోనే ఇరువురిని పట్టుకుని బంధించాం.  
– శేఖర్‌ (క్రైమ్‌ కానిస్టేబుల్‌). 

నా కుమారుడిని దారుణంగా చంపేశాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి రమేశ్‌ కోసం వెతుకుతున్నం. ఇంటి పక్క నుంచి ఖాళీ చేసి ఎక్కడో ఉంటున్నడు. వాళ్ల అన్నా, చెల్లి ఇళ్లకు వెళ్లి చూసినా దొరకలేదు. 26న కోర్టుకు వస్తడని రమేశ్‌ వాళ్ల అన్న నర్సింహ్మ చెప్పిండు. దీంతో ఉదయమే అతడిని చంపాలని సిద్ధమైనం. రోడ్డుపై దొరికాడు.. చంపేశా. దీంతో లెక్క సమానమైంది. నా కొడుకును చంపాడు... నేను రమేశ్‌ను చంపా అంతే. ఎలాంటి శిక్షకైనా సిద్ధమే.  
–కిషన్‌గౌడ్, మహేశ్‌ తండ్రి  

అల్లుడు చనిపోయినప్పటి నుంచి బావ మనిషిలో మనిషి లేడు. రమేశ్‌ కోసం అంతా తిరిగాం. ఇవాళ వస్తడని వాళ్ల అన్న చెప్పిండు. ఉదయమే బావ కిషన్‌గౌడ్‌ గొడ్డలి తీసుకొని వెళ్తుండటంతో నేనూ వెంట వచ్చా. బావ రమేశ్‌ను పట్టుకునేందుకు వెళ్లగా.. పరిగెత్తాడు. నేను కూడా పరిగెత్తి పట్టుకొని కొట్టాం. మాపై కత్తితో దాడి చేశాడు. దీంతో గొడ్డలితో నరికేశాం.  
– లక్ష్మణ్‌గౌడ్, మహేశ్‌ మామ 

ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌ 
హత్య కేసులో నిందితుడి ఉన్న రమేశ్‌గౌడ్‌ కోర్టు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో నడిరోడ్డుపై విచక్షణారహితంగా హత్య చేసిన నిందితులపై రౌడీషీట్‌తో పాటు పీడీ యాక్ట్‌ నమోదు చేశామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. నిందితులు 3 రోజుల పాటు రెక్కి చేసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారన్నారు. హత్య చేస్తున్న సమయంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లింగయ్య కాపాడే ప్రయత్నం చేశారన్నారు. వీడియోల్లో కనిపిస్తున్న రక్షక్‌ వాహనం.. మఫ్టీలోని ఇద్దరు కానిస్టేబుళ్లు దిగిన తర్వాతే ఆ వాహనం ముందుకు వెళ్లిందన్నారు. వారే నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసు వాహనం పట్టించుకోకుండా పోతున్నట్లుగా చూపిస్తున్నది అవాస్తమన్నారు. హత్య చేసిన కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నారన్నారు. ఇందులో కిషన్‌గౌడ్‌ మానసిక స్థితి సరిగ్గా లేదని ఆయన చికిత్సపొందుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement