ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చజెప్పుతున్న పోలీసులు, యాకయ్యను పరామర్శిస్తున్న ప్రతాప్
వరంగల్, రఘునాథపల్లి: కాబోయే పెళ్లి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విస్తుగొలిపే విషయం వెలుగు చూసింది. ఈ దురాఘాతానికి పాల్పడింది వధువుకు స్వయంగా పెద్దమ్మ కొడుకేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అన్నాచెల్లెలి మధ్య కొనసాగుతున్న అనైతిక బంధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వారి విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. జనగామ జిల్లా కంచనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి గొంగళ్ల యాకయ్య అనే యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి కీలకాధారాలను రాబట్టినట్లు తెలిసింది.
వధువు కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు యాకయ్యకు ఆమె ఎప్పుడు ఫోన్ చేసింది? అంతకు ముందు ఫోన్ ఎవరితో మాట్లాడింది ? అనే వివరాలను సేకరించారు. యాకయ్యకు ఫోన్ చేయక ముందు ఆమె కాల్ చేసిన వ్యక్తి ఆమె పెద్దమ్మ కొడుకుగా గుర్తించారు. రాత్రి 11.45 గంటలకు ఐదు సార్లు యాకయ్యతో ఎందుకు మాట్లాడావు.. ఏం మాట్లాడావు, బయటకు ఎందుకు రమ్మన్నావు ? అని పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో తాను, తన పెద్దమ్మ కుమారుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆ యువతి వెల్లడించినట్లు తెలిసింది. తాము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే యాకయ్యను హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు ఇరువురు అంగీకరించినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ వద్ద మహిళల ఆందోళన..
అభంశుభం తెలియని యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని కంచనపల్లి మహిళలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. రెండు ట్రాక్టర్లపై దాదాపు 50 మంది మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా వారిని పోలీసులు మద్యలో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిలో 20 మందికిపైగా మహిళలు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యాకయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రంజిత్‌రావు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు.
కాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాకయ్యను టీఆర్‌ఎస్ నాయకుడు రాజారపు ప్రతాప్ పరామర్శించారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షపడేలా మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయినితో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రతాప్ తెలిపినట్లుగా యాకయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment