
సాక్షి, నల్లగొండ: నిన్నటి నుంచి కనిపించకుండాపోయిన నల్లగొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. శనివారం సాయంత్రం ఆయన తిరిగి ఉద్యోగంలో చేశారు. నల్లగొండలో సంచలనం రేపిన రెండు హత్యకేసులను విచారిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండాపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సీఐ కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం గుంటూరులోని బాపట్లలో ఓ రిసార్ట్‌లో ఆయన ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అయితే, పని ఒత్తిడి వల్లే రిలాక్స్ అయ్యేందుకు తాను గుంటూరు వెళ్లానని సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో తెలిపారు. వెళ్లే సమయంలో తన సిమ్ కార్డును, ఆయుధాన్ని డిపార్ట్‌మెంట్‌కు అప్పజెప్పానని తెలిపారు.
కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశానని, గత పది రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో రెస్ట్ తీసుకోవడానికి రిసార్ట్‌కు వెళ్ళానని, తరచూ తాను అక్కడికి వెళ్తూనే ఉంటానని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నల్లగొండలో ఇటీవల సంచలనం రేపిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, పాలకూరి రమేశ్ హత్యకేసులకు సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment