
విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద పనీష్ చౌదరి మృతదేహం పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, నాయకులు
పిల్లల మార్కులు, ర్యాంకులు ఎంత మెరుగయ్యాయని తల్లిదండ్రులు పదే పదే పరిశీలించారుగానీ.. గుండెల్లో కుంపటిలా రగులుతున్న మనోవేదనను గుర్తించలేకపోయారు.పుస్తకాలు, తరగతులంటూ తీరికలేని చదువుల్లో తీర్చిదిద్దుతున్నామని అపోహపడ్డారుగానీ.. వారి ఆకాంక్షల బరువులను ఆ పసి హృదయాలు మోయలేకపోతున్నాయని తెలుసుకోలేకపోయారు.. అదిరిపోయే అంతస్తుల్లో తమ పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆశపడ్డారుగానీ.. కార్పొరేట్ యాజమాన్యాల నిర్బంధకాండలో ఊపిరాడక విలవిలలాడుతున్నారని గమనించలేకపోయారు.. ఒత్తిడి ఉరికొయ్యకు తమ బిడ్డలు వేలాడే వరకు కళ్లు తెరవక.. వాళ్లకువాళ్లే నిండు నూరేళ్లకు సరిపడా కడుపుకోత శిక్ష విధించుకుంటున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో, రామవరప్పాడు : కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి లేని విద్య అందిస్తామంటూ యాజమాన్యాలు ఆర్భాటపు ప్రచారాలు చేస్తున్నాయే గానీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. చదువులో వెనుకంజలో ఉన్నారనే సాకుతో తోటి విద్యార్థుల మధ్య అవమానకరంగా మాట్లాడటం, దూషించడం వంటి దుశ్చర్యలతో మనస్థాపం చెంది అనేక మంది ప్రాణాలు వదులుతున్నా కళాశాలల యాజమాన్యాల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని నారాయణ కళాశాల సరస్వతి భవన్‌లో మంగళవారం ఓ విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. గుడివాడ కడియాలవారి వీధి, విశ్వభారతి స్కూల్ సమీపంలో కడియాల తిరుమల భాస్కర్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. తిరుమల భాస్కర్ జేసీబీ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. చిన్నకుమారుడు కడియాల పనీష్ చౌదరి గ్రామంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నాడు.
ఉరికి వేలాడుతూ...
పనీష్ ఈ కళాశాలలోనే హాస్టల్‌లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల వరకు చదువుకున్నాడు. అనంతరం హాస్టల్‌లో తన రూమ్ నెంబర్ 215 వచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచి చూసిన తన తోటి స్నేహితుడు పవన్‌సాయికు హాస్టల్‌గదిలో పనీష్ చౌదరి ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో కంగారు పడ్డ పవన్‌సాయి మరో విద్యార్థి ఈశ్వరకుమార్‌ను నిద్రలేపి విషయం చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఫ్లోర్ ఇన్‌చార్జి నల్లంటి వీరబాబు, వరప్రసాద్‌కు తెలియపర్చారు. ఉరికి వేలాడుతున్న పనీష్ చౌదరిని కిందకు దింపి ఉదయం 5గంటల సమయంలో హుటాహుటిన కామినేని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్థారించారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి శిరీష, మేనమామ కోటేశ్వరరావు కళాశాల వద్దకు చేరుకుని తోటి విద్యార్థులతో మాట్లాడి హాస్టల్‌రూమ్‌ను పరిశీలించారు. పనీష్ తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపించి సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం అందుకున్న పటమట సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ సత్యసుధాకర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తోటి విద్యార్థులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు.
10 గంటల తర్వాత బయటకు వెళ్లి...
పనీష్ సోమవారం రాత్రి 10 గంటల నుంచి కనిపించలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. 11 గంటల తర్వాత రూమ్‌కు వచ్చి తోటి విద్యార్థులు చూస్తే పడుకుని ఉన్నాడు. విద్యార్థులంతా నిద్రపోయిన తర్వాత పనీష్ తన రూమ్‌కు దగ్గరలో బట్టలు ఆరేసుకునేందుకు వాడే తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడని యాజమాన్యం చేబుతుంది. కానీ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నప్పుడు ఆ అలజడికి అడుగు దూరంలో ఉన్న తోటి విద్యార్థులకు మెలకువ రాలేదా, పైగా పనీష్ కాళ్లు నేలకు తాకుతుండటంతో చనిపోవడం ఎలా సాధ్యపడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి నారాయణనుబర్తరఫ్ చేయాలి....
నిజా నిజాలను వెలికితీయాలి. కాలేజీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. వార్డెన్ వేధింపుల వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. తగిన విచారణ చేయించాలి. విద్యార్థుల ఆత్మహత్యలపై వేసిన కమిటీ రిపోర్టును అమలు చేసి ఉంటే ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండేవి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోడం వల్లే పునరావృతం అవుతున్నాయి. మార్కులు, ర్యాంకులపేరు చెప్పి రూ.లక్షల్లో ఫీజులు వసూల్ చేసి పిల్లలను వేధిస్తున్నారు. పిల్లలు చదవలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంత్రి నారాయణపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
మధురానగర్( విజయవాడ సెంట్రల్) : ఒత్తిడి భరించలేక బీటెక్ ఫైనల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీనగర్‌కాలనీలో మంగళవారం కలకలం రేపింది. శ్రీనగర్ కాలనీ మూడో లైనుకు చెందిన మండాది రాజేంద్రకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన సాయికృష్ణ (22) ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవటంతో సాయికృష్ణ తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం సాయికృష్ణ ఇంటికి రాకపోవటంతో తండ్రి రాజేంద్ర ఎన్‌ఆర్‌ఐ కళాశాలకు ఫోన్ చేశారు. దీంతో కళాశాల వారు గత కొంత కాలంగా సాయికృష్ణ కళాశాలకు రావటం లేదని చెప్పారు. దీంతో అతని స్నేహితులకు ఫోన్ చేయగా తాము సాయంత్రం ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం సెంటర్‌లో వదలి వెళ్ళిపోయామని చెప్పారు. సాయికృష్ణకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో స్నేహితులతో ఉండి ఉంటాడని ఉదయం మాట్లాడవచ్చని మిన్నకుండిపోయారు. సాయికృష్ణ రాత్రంతా వీధులలో తిరిగి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రైలు కింద పడగా రైలు ఈడ్చుకుంటూ వెళ్ళిందని స్ధానికులు చెబుతున్నారు. తాను చదవలేకపోతున్నానని తల్లితండ్రులను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ రాశాడని స్దానికులు చెబుతున్నారు. చేతికి అంది వచ్చిన కన్న కొడుకు ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్ళిపోవటంతో సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
కళాశాల యాజమాన్యమే మా బిడ్డను చంపేసింది
పనీష్ చౌదరి చదువులో వెనుకున్న మాట వాస్తవమే. ఈ కారణంతో తోటి విద్యార్థుల మధ్య అవమానించడం, దుర్భాషలాడటం వల్లే చనిపోయాడు. హాస్టల్ వార్డెన్ వీరబాబు కూడా పనీష్‌ను దూషించడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తనను రూమ్ మార్పించాలని చాలా సార్లు మాతో చెప్పాడని ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మార్పిస్తానని చెప్పామని ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మా బిడ్డకు ఎప్పుడో ఒకసారి ఆస్తమా వస్తుంది గానీ ఆస్తమా కారణం చేత ఆత్మహత్య చేసుకోడు. కళాశాల వేధింపులో మా బిడ్డ చావుకు కారణం. కళాశాల జైల్‌లా ఉందని తరుచూ పనీష్ బాధపడేవాడు కళాశాల యాజమాన్యం తోటి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు.–కోటేశ్వరరావు, మృతుడి మేనమామ,
సూసైడ్‌నోట్ దొరకలేదు
పనీష్ చనిపోయే ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను మాయం చేశారనడంలో వాస్తవం లేదు. కళాశాలలో ఐఐటీ కొచింగ్ పనీష్ తీసుకుంటున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు రావాలంటూ బలవంతపు చర్యలు కూడా మేమేమీ తీసుకోలేదు. తిట్టడం, కొట్టడం వంటి ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు. గత కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నాడు. చదువులో వెనుకపడుతున్నాడన్న కారణం చేతనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు. – ప్రిన్సిపాల్, విజయభాస్కర్
విచారణ జరిపించాలి
విద్యాసంస్థల్లో జరిగిన ఆత్మహత్యలపై వెంటనే కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో ప్రభుత్వానికి, యాజమాన్యాలకు తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కాలేజీని మూసివేసి, మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. చంద్రబాబు వెంటనే నారాయణను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలి. –ఎస్ సలాం,వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు.
Comments
Please login to add a commentAdd a comment