narayana college students
-
నిట్ 2021 ఫలితాల్లో సత్తాచాటిన నారాయణ విద్యాసంస్ధలు
-
సంధ్యారాణి డెత్ మిస్టరీ!
-
విద్యార్థులపై పోలీసుల దాష్టీకం
పటాన్చెరు టౌన్: నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బుధవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమం లో మృతురాలి తండ్రి ని ఓ కానిస్టేబుల్ బూటు కాలుతో తన్నడం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వెలిమెలలోని నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి (16) ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతదేహంతో నారాయణ కళాశాల ఎదుట ధర్నా చేయాలని బాధితులు, కొన్ని విద్యార్థి సంఘాలు యత్నించాయి. మరోవైపు కొందరు యువకులు ఆస్పత్రిలోని మార్చురీ తలుపుల తాళాలు పగులగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని తీసుకుని తెచ్చారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని మళ్లీ మార్చురీ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్.. మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో తన్నారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యార్థిని చనిపోయిందని చెబుతున్న గదిని చూపిస్తామని మృతురాలి బంధువులను తీసుకువెళ్లారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆస్పత్రి పోస్టుమార్టం గది తలుపులు పగలగొట్టిన ఘటనలో విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పటాన్చెరు సీఐ నరేశ్ తెలిపారు. కానిస్టేబుల్‌పై వేటు: ఇన్చార్జి ఎస్పీ: కానిస్టేబుల్ శ్రీధర్ మృతిరాలి తం డ్రితో దురుసుగా ప్రవర్తించడంపై శాఖ తరఫున చింతిస్తున్నట్లు ఇన్చార్జి ఎస్పీ చందనాదీప్తి అన్నారు. కానిస్టేబుల్‌ను ఏఆర్ హెడ్ క్వార్టర్ సంగారె డ్డికి అటాచ్ చేశామన్నారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు. -
ఉదయ్ మృతికి నారాయణ యాజమాన్యానిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ కళాశాల విద్యార్థుల కుటుంబసభ్యులు... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరంతా మాదాపూర్‌లో నారాయణ క్యాంపస్‌లో మెడిసిన్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. అయితే ఫ్రెండ్ బర్త్‌డేకి పర్మిషన్ తీసుకోకుండానే గోడ దూకి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నుంచి తిరిగి వస్తుండగా ఆరంఘర్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్, ఉదయ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇక గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. చదవండి: విషాదం: ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి... మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరుణ్, ఉదయ్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న ఉదయ్ కుటుంబసభ్యులు ఉస్మానియాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన సోదరుడి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ మృతుడి సోదరుడు కాలేజీ ఉద్యోగిని నిలదీశాడు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళుతుంటే యాజమాన్యం నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే విద్యార్థులు కుటుంబసభ్యులకు సమాధానం చెప్పలేక నారాయణ కాలేజీ ఉద్యోగి అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడు ఉదయ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్. ఇక తరుణ్ స్వస్థలం బెంగళూరు కాగా, కుటుంబం బోయినపల్లిలో నివాసం ఉంటోంది. కాలేజీ యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను చేరిస్తే వారికి బాధ్యత ఉండదా అని ఉదయ్ మేనత్త మండిపడ్డారు. ఉదయ్ మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాగా తొమ్మిది మంది హాస్టల్ విద్యార్థులు అదృశ్యం అయ్యారంటూ నారాయణ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి బాల్కనీ దూకి..
సాక్షి, అత్తాపూర్ : వేగంగా దూసుకొచ్చిన సఫారీ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కారులో పది మంది ప్రయాణిస్తుండగా మిగతా ఏడుగురు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. అయ్యప్ప సొసైటీ నారాయణ క్యాంపస్‌లో కోచింగ్ తీసుకునే హనుమదీశ్వర్(19), గణేష్(19), తరుణ్(19), శషాంక్గౌడ్(19), భాను(19), అభివరణ్(19), భాస్కర్(19) వరుణ్(19)లు స్నేహితులు. గురువారం రాత్రి అందరూ కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కొంపల్లిలో ఉండే గణేష్ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ బాబాయ్ కారు సఫారీని తీసుకొని రాత్రి 12:30 గంటలకు శంషాబాద్ వైపు వచ్చారు. తరువాత ఇంటికి బయలు దేరారు. హనుమదీశ్వర్ కారును వేగంగా నడిపాడు. కారు పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 221 వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారులో ముందు కూర్చున ఉదయ్, తరుణ్‌లకు బలమెన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి శషాంక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరగగానే మిగతా విద్యార్థులు అందరూ పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఉదయ్‌ది మహబూబ్‌నగర్ మద్దూర్ మండలం, తరుణ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అని పోలీసులు తెలిపారు. కారు తీసుకెళ్లారిలా.. గణేష్ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కొంపల్లిలో ఉండే తన చెల్లెలు గాయత్రికి ఫోన్‌చేశాడు. తాను గంటలోపు వస్తానని సఫారి కారు తాళం కావాలని అడిగాడు. ఇంటి ముందు ఉన్న పూల చెట్టు తొట్టిలో కారు తాళం వేయాలని చెప్పాడు. దీంతో గాయత్రి పూలతొట్టిలో తాళం వేసి ఉంచింది. గణేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కారు తీసుకువెళ్ళినట్లు గణేష్ బాబాయి కృష్ణ విలేకరులకు తెలిపాడు. అసలు విషయం అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు బర్త్ డేకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఐదుగురు వార్డెన్లు నిద్రపోగానే 9 మంది విద్యార్థులు బాల్కనీ నుంచి కిటికి గోడ పైకి వచ్చి కిందికి దిగారు. కారులో శంషాబాద్‌కు బర్త్ డే కోసం వెళ్లారు. తెల్లవారు జామున వారు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్లోని వర్మ క్యాంపస్‌లో మెడిసన్ లాంగ్ టర్మ్ విద్యార్థి గణేష్ కుత్బుల్లాపూర్‌లోని ఇంటికి వెళతానని తల్లిదండ్రులతో మాట్లాడించి అనుమతి తీసుకొని వెళ్లాడు. అర్థరాత్రి బర్త్ డేకు వెళ్లేందుకు ఇంట్లోని సఫారీ కారును తీసుకొని వచ్చి అయ్యప్ప సొసైటీలో వేచి ఉన్నాడు. రూమ్‌లలో ఉన్న విద్యార్థులు యశ్వంత్, తరుణ్, శంకర్ గౌడ్, భాను, భాస్కర్, వరుణ్‌లు మొదటి అంతస్తులోని బాల్కానీలో బీమ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికి పైకి వెళ్ళారు. పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన నెట్‌ను తొలగించి కిందికి దిగారు. గురువారం అర్థరాత్రి 12.40 గంటలకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. గణేష్ తప్ప మిగతా విద్యార్థులంతా గురువారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు స్టడీ అవర్‌లో ఉన్నారు. 11.30 గంటలకు వార్డెన్ రాములు అటెండెన్స్ తీసుకున్నాడు. 11.45 గంటలకు లైట్లు ఆపి అంతా పడుకున్నారు. వర్మ క్యాంపస్‌లో రాత్రి సమయంలోను ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, వార్డెన్ రాములుతో పాటు జూనియర్ లెక్చరర్లు కరీం, యోగీష్, మురళీ తదితరులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున చేవెళ్ల ఎస్ఐ వెంకటేష్ ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో మీ విద్యార్థులు ఇద్దరు చనిపోయారని చెప్పడంతో విషయం తెలిసిందని నారాయణ కాలేజ్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించేమా పూర్య విద్యార్థి ఫోన్ చేసి ఇద్దరు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని చెప్పినట్లు తెలిపారు. హస్టల్ ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడం, డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కనీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేదికాదు. హాస్టల్లో రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. -
నారాయణ కాలేజీ సిబ్బంది దాష్టికం
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీ సిబ్బంది విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హాస్టల్లో వసతి, భోజనం సరిగా ఉండడం లేదని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు అధ్యాపకులను నిలదీశారు. దీంతో కంగుతిన్న నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ శిఖామణి, వార్డెన్ మహేష్ సీనియర్ విద్యార్థులతో జూనియర్ విద్యార్థులపై దాడి చేయించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పట్టణ పోలీస్‌కు చేరుకొని పోలిసులకు ఫిర్యాదు చేశారు. -
నారాయణ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
కార్పొరేట్ విద్యా సంస్థల భవనాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన నిర్మాణాలు విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వివిధ శాఖాధికారులు చేస్తున్న తనిఖీలు తూతూమంత్రమేనని బట్టబయలైంది. నెల్లూరు నారాయణ జూనియర్ కళాశాల గోడ కూలి పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటనే ఇందుకు నిదర్శనం. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం, ధన దాహం, అధికారుల అలసత్వం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇరుకు గదులు, గాలి, వెలుతురు లేమి, ఎత్తయిన అపార్ట్మెంట్లను తలపించే భవనాలు విద్యార్థులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి. సాక్షి, నెల్లూరు (టౌన్): నెల్లూరు అరవింద్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల్లో శనివారం గోడ కూలి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు ఆరుగురు గాయాలపాలయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో వాష్‌రూంకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన చేసుకుంది. అదృష్టవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గోడ కూలిన సమయంలో ఎంపీసీ విద్యార్థులు గిరీష్, కృష్ణవంశీ, వర్షిత్, లీలేష్, జశ్వంత్, వంశీచైతన్య వాష్‌రూంకు వెళుతుండగా గోడ కూలింది. దీంతో గిరీష్, వంశీచైతన్య, జశ్వంత్‌కు తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన తరువాత కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా గాయపడిన విద్యార్థులను హుటావుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోకి ఎవరిని వెళ్లకుండా సెక్యూరిటీని టైట్ చేశారు. విద్యార్థులు కూడా తరగతులకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో నారాయణ కళాశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం మాత్రం ఒక్కసారిగా విద్యార్థులు వచ్చి గోడపై పడడంతోనే గోడ కూలిందని బుకాయిస్తున్నారు. అయితే నారాయణ కళాశాల్లో గోడ కూలిన సంఘటను చిన్నబజారు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నారాయణ జూనియర్ కళాశాల్లో జరిగిన సంఘటనను ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ఆర్ఐఓ తదితర అధికారులు పరిశీలించారు. విద్యార్థి సంఘాలు ఆందోళన నారాయణ జూనియర్ కళాశాల్లో గోడ కూలిన సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ఆందోళన నిర్వహించాయి. గోడ కూలి విద్యార్థులకు గాయాలు కావడంపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులను ఆస్పత్రి, కళాశాల లోపలకు అనుమితంచలేదు. ఈ సంఘటనపై పలువురు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నారాయణ జూనియర్ కళాశాల వద్ద ధర్నాచేస్తున్న ఏబీవీపీ నాయకులు ఇరుకు భవనాల్లో కళాశాలలు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే ఇరుకు భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నాయి. సౌండ్‌లెస్, ఫైర్, కార్పొరేషన్ సర్టిఫికెట్ లేకుండానే కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలే ఎక్కువ బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో చాలా బ్రాంచీలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకోకుండానే కళాశాలలు నిర్వహిస్తున్న సంఘటనలో కోకొల్లలు. భవనానికి రెండు వైపులా మెట్లు ఉండాల్సి ఉన్నా ఎక్కడా కనిపించవు. ఆట స్థలం ఉన్న సందర్భం ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చే అమ్యామ్యాలతో సరిపుచ్చుకుంటున్నారు. విద్యార్థుల భద్రతా ప్రమాణాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘నారాయణ’ దాష్టీకం
అనంతపురం: విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను సాకుగా చూపి నారాయణ కళాశాల అధ్యాపకులు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగర శివారులోని టీవీ టవర్ వద్ద నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. రాత్రి భోజన సమయంలో మెస్‌హాల్లో టేబుల్ విషయంలో గొడవ పడ్డారు. సీనియర్లకు ఎదురు చెప్పినందుకు జూనియర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం యాజమాన్యం దృష్టికి పోవడంతో రాత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. గొడవకు పాల్పడ్డారనే కారణంతో యశ్వంత్, మరో విద్యార్థిని కట్టెతో కొట్టారు. దీంతో వాతలు పడ్డాయి. ఈ విషయం కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి పోవడంతో మంగళవారం ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వంట మనుషులు, పని మనుషులతో తమను గొడ్డును కొట్టినట్లు కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు ప్రిన్సిపాల్ శిఖామణి, వైస్ ప్రిన్సిపాల్ నారపరెడ్డి, ఏజీఎం సుధాకర్‌రెడ్డి, వార్డెన్ భవాని ప్రసాద్‌లపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
నారాయణ కాలేజీలో కొట్లాట.. విద్యార్థికి తీవ్ర గాయాలు
సాక్షి, విజయవాడ : నారాయణ కాలేజీలో విద్యార్థుల విభేధాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాధర్‌రెడ్డి అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. బాత్రూమ్లో వేసి కళాధర్‌ను చితకొట్టారు. బాధితుడి వీపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెల 29వ తేదీన జరిగింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నలుగురు విద్యార్థులపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
పాలబుగ్గలకు పనీష్మెంట్
పిల్లల మార్కులు, ర్యాంకులు ఎంత మెరుగయ్యాయని తల్లిదండ్రులు పదే పదే పరిశీలించారుగానీ.. గుండెల్లో కుంపటిలా రగులుతున్న మనోవేదనను గుర్తించలేకపోయారు.పుస్తకాలు, తరగతులంటూ తీరికలేని చదువుల్లో తీర్చిదిద్దుతున్నామని అపోహపడ్డారుగానీ.. వారి ఆకాంక్షల బరువులను ఆ పసి హృదయాలు మోయలేకపోతున్నాయని తెలుసుకోలేకపోయారు.. అదిరిపోయే అంతస్తుల్లో తమ పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆశపడ్డారుగానీ.. కార్పొరేట్ యాజమాన్యాల నిర్బంధకాండలో ఊపిరాడక విలవిలలాడుతున్నారని గమనించలేకపోయారు.. ఒత్తిడి ఉరికొయ్యకు తమ బిడ్డలు వేలాడే వరకు కళ్లు తెరవక.. వాళ్లకువాళ్లే నిండు నూరేళ్లకు సరిపడా కడుపుకోత శిక్ష విధించుకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో, రామవరప్పాడు : కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి లేని విద్య అందిస్తామంటూ యాజమాన్యాలు ఆర్భాటపు ప్రచారాలు చేస్తున్నాయే గానీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. చదువులో వెనుకంజలో ఉన్నారనే సాకుతో తోటి విద్యార్థుల మధ్య అవమానకరంగా మాట్లాడటం, దూషించడం వంటి దుశ్చర్యలతో మనస్థాపం చెంది అనేక మంది ప్రాణాలు వదులుతున్నా కళాశాలల యాజమాన్యాల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని నారాయణ కళాశాల సరస్వతి భవన్లో మంగళవారం ఓ విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. గుడివాడ కడియాలవారి వీధి, విశ్వభారతి స్కూల్ సమీపంలో కడియాల తిరుమల భాస్కర్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. తిరుమల భాస్కర్ జేసీబీ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. చిన్నకుమారుడు కడియాల పనీష్ చౌదరి గ్రామంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నాడు. ఉరికి వేలాడుతూ... పనీష్ ఈ కళాశాలలోనే హాస్టల్లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల వరకు చదువుకున్నాడు. అనంతరం హాస్టల్లో తన రూమ్ నెంబర్ 215 వచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచి చూసిన తన తోటి స్నేహితుడు పవన్సాయికు హాస్టల్‌గదిలో పనీష్ చౌదరి ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో కంగారు పడ్డ పవన్‌సాయి మరో విద్యార్థి ఈశ్వరకుమార్‌ను నిద్రలేపి విషయం చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి ఫ్లోర్ ఇన్చార్జి నల్లంటి వీరబాబు, వరప్రసాద్‌కు తెలియపర్చారు. ఉరికి వేలాడుతున్న పనీష్ చౌదరిని కిందకు దింపి ఉదయం 5గంటల సమయంలో హుటాహుటిన కామినేని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్థారించారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి శిరీష, మేనమామ కోటేశ్వరరావు కళాశాల వద్దకు చేరుకుని తోటి విద్యార్థులతో మాట్లాడి హాస్టల్రూమ్ను పరిశీలించారు. పనీష్ తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపించి సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం అందుకున్న పటమట సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్ఐ సత్యసుధాకర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తోటి విద్యార్థులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. 10 గంటల తర్వాత బయటకు వెళ్లి... పనీష్ సోమవారం రాత్రి 10 గంటల నుంచి కనిపించలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. 11 గంటల తర్వాత రూమ్‌కు వచ్చి తోటి విద్యార్థులు చూస్తే పడుకుని ఉన్నాడు. విద్యార్థులంతా నిద్రపోయిన తర్వాత పనీష్ తన రూమ్‌కు దగ్గరలో బట్టలు ఆరేసుకునేందుకు వాడే తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడని యాజమాన్యం చేబుతుంది. కానీ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నప్పుడు ఆ అలజడికి అడుగు దూరంలో ఉన్న తోటి విద్యార్థులకు మెలకువ రాలేదా, పైగా పనీష్ కాళ్లు నేలకు తాకుతుండటంతో చనిపోవడం ఎలా సాధ్యపడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నారాయణనుబర్తరఫ్ చేయాలి.... నిజా నిజాలను వెలికితీయాలి. కాలేజీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. వార్డెన్ వేధింపుల వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. తగిన విచారణ చేయించాలి. విద్యార్థుల ఆత్మహత్యలపై వేసిన కమిటీ రిపోర్టును అమలు చేసి ఉంటే ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండేవి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోడం వల్లే పునరావృతం అవుతున్నాయి. మార్కులు, ర్యాంకులపేరు చెప్పి రూ.లక్షల్లో ఫీజులు వసూల్ చేసి పిల్లలను వేధిస్తున్నారు. పిల్లలు చదవలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంత్రి నారాయణపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మధురానగర్( విజయవాడ సెంట్రల్) : ఒత్తిడి భరించలేక బీటెక్ ఫైనల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీనగర్‌కాలనీలో మంగళవారం కలకలం రేపింది. శ్రీనగర్ కాలనీ మూడో లైనుకు చెందిన మండాది రాజేంద్రకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన సాయికృష్ణ (22) ఎన్ఆర్ఐ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవటంతో సాయికృష్ణ తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం సాయికృష్ణ ఇంటికి రాకపోవటంతో తండ్రి రాజేంద్ర ఎన్ఆర్ఐ కళాశాలకు ఫోన్ చేశారు. దీంతో కళాశాల వారు గత కొంత కాలంగా సాయికృష్ణ కళాశాలకు రావటం లేదని చెప్పారు. దీంతో అతని స్నేహితులకు ఫోన్ చేయగా తాము సాయంత్రం ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం సెంటర్లో వదలి వెళ్ళిపోయామని చెప్పారు. సాయికృష్ణకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో స్నేహితులతో ఉండి ఉంటాడని ఉదయం మాట్లాడవచ్చని మిన్నకుండిపోయారు. సాయికృష్ణ రాత్రంతా వీధులలో తిరిగి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రైలు కింద పడగా రైలు ఈడ్చుకుంటూ వెళ్ళిందని స్ధానికులు చెబుతున్నారు. తాను చదవలేకపోతున్నానని తల్లితండ్రులను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ రాశాడని స్దానికులు చెబుతున్నారు. చేతికి అంది వచ్చిన కన్న కొడుకు ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్ళిపోవటంతో సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కళాశాల యాజమాన్యమే మా బిడ్డను చంపేసింది పనీష్ చౌదరి చదువులో వెనుకున్న మాట వాస్తవమే. ఈ కారణంతో తోటి విద్యార్థుల మధ్య అవమానించడం, దుర్భాషలాడటం వల్లే చనిపోయాడు. హాస్టల్ వార్డెన్ వీరబాబు కూడా పనీష్ను దూషించడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తనను రూమ్ మార్పించాలని చాలా సార్లు మాతో చెప్పాడని ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మార్పిస్తానని చెప్పామని ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మా బిడ్డకు ఎప్పుడో ఒకసారి ఆస్తమా వస్తుంది గానీ ఆస్తమా కారణం చేత ఆత్మహత్య చేసుకోడు. కళాశాల వేధింపులో మా బిడ్డ చావుకు కారణం. కళాశాల జైల్లా ఉందని తరుచూ పనీష్ బాధపడేవాడు కళాశాల యాజమాన్యం తోటి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు.–కోటేశ్వరరావు, మృతుడి మేనమామ, సూసైడ్‌నోట్ దొరకలేదు పనీష్ చనిపోయే ముందు రాసిన సూసైడ్‌నోట్‌ను మాయం చేశారనడంలో వాస్తవం లేదు. కళాశాలలో ఐఐటీ కొచింగ్ పనీష్ తీసుకుంటున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు రావాలంటూ బలవంతపు చర్యలు కూడా మేమేమీ తీసుకోలేదు. తిట్టడం, కొట్టడం వంటి ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు. గత కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నాడు. చదువులో వెనుకపడుతున్నాడన్న కారణం చేతనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు. – ప్రిన్సిపాల్, విజయభాస్కర్ విచారణ జరిపించాలి విద్యాసంస్థల్లో జరిగిన ఆత్మహత్యలపై వెంటనే కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో ప్రభుత్వానికి, యాజమాన్యాలకు తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కాలేజీని మూసివేసి, మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. చంద్రబాబు వెంటనే నారాయణను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలి. –ఎస్ సలాం,వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా
-
నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్ : నారాయణా విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారాయణ పిల్లల శవాల మీద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదువుకుందామని వచ్చిన విద్యార్థులు నారాయణ కళాశాలల శాడిజానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో దాదాపు 30మంది విద్యార్థులు చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, విద్యాసంస్థల అధినేత నారాయణతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏమాత్రం స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు బినామీ నారాయణ కాబట్టి పట్టించుకోవడం లేదా లేక విద్యాశాఖ మంత్రి వియ్యంకుడు కాబట్టి ఏ చర్యలు తీసుకోవడం లేదా..? పిల్లల ఆత్మహత్యలు చూస్తే మీ మనసు కరగడం లేదా...? తల్లిదండ్రుల గుండెకోత మీకు కనబడడం లేదా’ అంటూ చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావులపై నిప్పులు చెరిగారు. మీ పిల్లలు, బంధువుల పిల్లలకు ఇదే గతి పడితే చూస్తూ ఊరుకుంటారా..? అని నిలదీశారు. అధికారం తమదే అయినందున, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎటువంటి కేసుగానీ, కనీసం విచారణ కూడా చేపట్టడం లేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికాఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీనే స్వయంగా వెల్లడించారని రోజా పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఇచ్చే వందల కోట్లుకళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత అని ఆమె అన్నారు. నారాయణ కాలేజీలు టీడీపీ ప్రాంగణాలుగా మారాయని రోజా విమర్శించారు. ఎన్నికలొచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలకు అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమవుతోందన్నారు. 2015లో విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ వీసీ రత్నకుమారి, ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో విచారణ కమిటీ వేశారని, వారు అక్కడి పరిస్థితులు తెలియజేసినప్పుడు ఏం చర్యలు తీసుతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు మనసు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలన్నారు. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. అహంకారంతో ముందుకు వెళితే ఎవరిని వదిలేది లేదని, న్యాయ వ్యవస్థముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తామన్నారు. ఇక మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరులోని గూడూరులో దిలీప్ అనే విద్యార్థిని కర్ణబేరి పగిలిపోయేలా కొట్టిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరినైనా వదలిపెట్టొద్దంటూ గంటా ఆవేశంతో ఊగిపోతూ నటిస్తున్నారే తప్ప నిజాయితీగా వ్యవహరించడం ఎద్దేవా చేశారు. -
‘నారాయణ’ విద్యార్థుల తిరుగుబాటు
-
నారాయణ కాలేజీలో విద్యార్థుల మద్య ఘర్షణ
విశాఖపట్టణం: నగరంలోని నారాయణ జూనియర్ కాలేజీ లో విద్యార్థులు రెండు వర్గాలు చీలిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటన వైజాగ్‌లోని అసిలిమెట్ట నారాయణ జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ వర్గం విద్యార్థులు మరో వర్గం విద్యార్థులపై దాడి చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు పలువరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే కళాశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.