సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ కళాశాల విద్యార్థుల కుటుంబసభ్యులు... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే.
వీరంతా మాదాపూర్‌లో నారాయణ క్యాంపస్‌లో మెడిసిన్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే ఫ్రెండ్ బర్త్‌డేకి పర్మిషన్ తీసుకోకుండానే గోడ దూకి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నుంచి తిరిగి వస్తుండగా ఆరంఘర్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్, ఉదయ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇక గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది.
చదవండి: విషాదం: ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి...
మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరుణ్, ఉదయ్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న ఉదయ్ కుటుంబసభ్యులు ఉస్మానియాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన సోదరుడి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ మృతుడి సోదరుడు కాలేజీ ఉద్యోగిని నిలదీశాడు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళుతుంటే యాజమాన్యం నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే విద్యార్థులు కుటుంబసభ్యులకు సమాధానం చెప్పలేక నారాయణ కాలేజీ ఉద్యోగి అక్కడ నుంచి పరారయ్యాడు.
మృతుడు ఉదయ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్. ఇక తరుణ్ స్వస్థలం బెంగళూరు కాగా, కుటుంబం బోయినపల్లిలో నివాసం ఉంటోంది. కాలేజీ యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను చేరిస్తే వారికి బాధ్యత ఉండదా అని ఉదయ్ మేనత్త మండిపడ్డారు. ఉదయ్ మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాగా తొమ్మిది మంది హాస్టల్ విద్యార్థులు అదృశ్యం అయ్యారంటూ నారాయణ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment