సాక్షి, అత్తాపూర్ : వేగంగా దూసుకొచ్చిన సఫారీ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కారులో పది మంది ప్రయాణిస్తుండగా మిగతా ఏడుగురు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. అయ్యప్ప సొసైటీ నారాయణ క్యాంపస్‌లో కోచింగ్ తీసుకునే హనుమదీశ్వర్(19), గణేష్(19), తరుణ్(19), శషాంక్‌గౌడ్(19), భాను(19), అభివరణ్(19), భాస్కర్(19) వరుణ్(19)లు స్నేహితులు. గురువారం రాత్రి అందరూ కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కొంపల్లిలో ఉండే గణేష్ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ బాబాయ్ కారు సఫారీని తీసుకొని రాత్రి 12:30 గంటలకు శంషాబాద్ వైపు వచ్చారు. తరువాత ఇంటికి బయలు దేరారు. హనుమదీశ్వర్ కారును వేగంగా నడిపాడు.
కారు పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 221 వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారులో ముందు కూర్చున ఉదయ్, తరుణ్‌లకు బలమెన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి శషాంక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరగగానే మిగతా విద్యార్థులు అందరూ పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఉదయ్‌ది మహబూబ్‌నగర్ మద్దూర్ మండలం, తరుణ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అని పోలీసులు తెలిపారు.
కారు తీసుకెళ్లారిలా..
గణేష్ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కొంపల్లిలో ఉండే తన చెల్లెలు గాయత్రికి ఫోన్‌చేశాడు. తాను గంటలోపు వస్తానని సఫారి కారు తాళం కావాలని అడిగాడు. ఇంటి ముందు ఉన్న పూల చెట్టు తొట్టిలో కారు తాళం వేయాలని చెప్పాడు. దీంతో గాయత్రి పూలతొట్టిలో తాళం వేసి ఉంచింది. గణేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కారు తీసుకువెళ్ళినట్లు గణేష్ బాబాయి కృష్ణ విలేకరులకు తెలిపాడు.
అసలు విషయం
అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థులు బర్త్ డేకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఐదుగురు వార్డెన్లు నిద్రపోగానే 9 మంది విద్యార్థులు బాల్కనీ నుంచి కిటికి గోడ పైకి వచ్చి కిందికి దిగారు. కారులో శంషాబాద్‌కు బర్త్ డే కోసం వెళ్లారు. తెల్లవారు జామున వారు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్‌లోని వర్మ క్యాంపస్‌లో మెడిసన్ లాంగ్ టర్మ్ విద్యార్థి గణేష్ కుత్బుల్లాపూర్‌లోని ఇంటికి వెళతానని తల్లిదండ్రులతో మాట్లాడించి అనుమతి తీసుకొని వెళ్లాడు. అర్థరాత్రి బర్త్ డేకు వెళ్లేందుకు ఇంట్లోని సఫారీ కారును తీసుకొని వచ్చి అయ్యప్ప సొసైటీలో వేచి ఉన్నాడు. రూమ్‌లలో ఉన్న విద్యార్థులు యశ్వంత్, తరుణ్, శంకర్ గౌడ్, భాను, భాస్కర్, వరుణ్‌లు మొదటి అంతస్తులోని బాల్కానీలో బీమ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికి పైకి వెళ్ళారు. పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన నెట్‌ను తొలగించి కిందికి దిగారు. గురువారం అర్థరాత్రి 12.40 గంటలకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది.
అక్కడి నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. గణేష్ తప్ప మిగతా విద్యార్థులంతా గురువారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు స్టడీ అవర్‌లో ఉన్నారు. 11.30 గంటలకు వార్డెన్ రాములు అటెండెన్స్ తీసుకున్నాడు. 11.45 గంటలకు లైట్లు ఆపి అంతా పడుకున్నారు. వర్మ క్యాంపస్‌లో రాత్రి సమయంలోను ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, వార్డెన్ రాములుతో పాటు జూనియర్ లెక్చరర్లు కరీం, యోగీష్, మురళీ తదితరులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున చేవెళ్ల ఎస్‌ఐ వెంకటేష్ ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో మీ విద్యార్థులు ఇద్దరు చనిపోయారని చెప్పడంతో విషయం తెలిసిందని నారాయణ కాలేజ్ డీజీఎం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించేమా పూర్య విద్యార్థి ఫోన్ చేసి ఇద్దరు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని చెప్పినట్లు తెలిపారు. హస్టల్ ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడం, డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కనీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేదికాదు. హాస్టల్‌లో రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు.
Comments
Please login to add a commentAdd a comment