సాక్షి, హైదరాబాద్ : నారాయణా విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారాయణ పిల్లల శవాల మీద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదువుకుందామని వచ్చిన విద్యార్థులు నారాయణ కళాశాలల శాడిజానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లలో దాదాపు 30మంది విద్యార్థులు చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, విద్యాసంస్థల అధినేత నారాయణతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏమాత్రం స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
‘చంద్రబాబు బినామీ నారాయణ కాబట్టి పట్టించుకోవడం లేదా లేక విద్యాశాఖ మంత్రి వియ్యంకుడు కాబట్టి ఏ చర్యలు తీసుకోవడం లేదా..? పిల్లల ఆత్మహత్యలు చూస్తే మీ మనసు కరగడం లేదా...? తల్లిదండ్రుల గుండెకోత మీకు కనబడడం లేదా’ అంటూ చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావులపై నిప్పులు చెరిగారు. మీ పిల్లలు, బంధువుల పిల్లలకు ఇదే గతి పడితే చూస్తూ ఊరుకుంటారా..? అని నిలదీశారు. అధికారం తమదే అయినందున, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు.
ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎటువంటి కేసుగానీ, కనీసం విచారణ కూడా చేపట్టడం లేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికాఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీనే స్వయంగా వెల్లడించారని రోజా పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఇచ్చే వందల కోట్లుకళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ఊడితే ఎంత అని ఆమె అన్నారు. నారాయణ కాలేజీలు టీడీపీ ప్రాంగణాలుగా మారాయని రోజా విమర్శించారు.
ఎన్నికలొచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలకు అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమవుతోందన్నారు. 2015లో విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ వీసీ రత్నకుమారి, ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో విచారణ కమిటీ వేశారని, వారు అక్కడి పరిస్థితులు తెలియజేసినప్పుడు ఏం చర్యలు తీసుతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు మనసు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలన్నారు.
ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. అహంకారంతో ముందుకు వెళితే ఎవరిని వదిలేది లేదని, న్యాయ వ్యవస్థముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తామన్నారు. ఇక మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరులోని గూడూరులో దిలీప్ అనే విద్యార్థిని కర్ణబేరి పగిలిపోయేలా కొట్టిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరినైనా వదలిపెట్టొద్దంటూ గంటా ఆవేశంతో ఊగిపోతూ నటిస్తున్నారే తప్ప నిజాయితీగా వ్యవహరించడం ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment