నారాయణ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం | In Nellore Six students injured in collapse of Narayana college wall | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

Published Sun, Jul 21 2019 11:36 AM | Last Updated on Sun, Jul 21 2019 11:36 AM

In Nellore Six students injured in collapse of Narayana college wall - Sakshi

నారాయణ జూనియర్‌ కళాశాల్లో గోడ కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కార్పొరేట్‌ విద్యా సంస్థల భవనాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన నిర్మాణాలు విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వివిధ శాఖాధికారులు చేస్తున్న తనిఖీలు తూతూమంత్రమేనని బట్టబయలైంది. నెల్లూరు నారాయణ జూనియర్‌ కళాశాల గోడ కూలి పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటనే ఇందుకు నిదర్శనం. కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం, ధన దాహం, అధికారుల అలసత్వం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇరుకు గదులు, గాలి, వెలుతురు లేమి, ఎత్తయిన అపార్ట్‌మెంట్లను తలపించే భవనాలు విద్యార్థులను ఇబ్బందుల పాలుజేస్తున్నాయి.

సాక్షి, నెల్లూరు (టౌన్‌): నెల్లూరు అరవింద్‌నగర్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాల్లో శనివారం గోడ కూలి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు ఆరుగురు గాయాలపాలయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో వాష్‌రూంకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన చేసుకుంది. అదృష్టవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గోడ కూలిన సమయంలో ఎంపీసీ విద్యార్థులు గిరీష్, కృష్ణవంశీ, వర్షిత్, లీలేష్, జశ్వంత్, వంశీచైతన్య వాష్‌రూంకు వెళుతుండగా గోడ కూలింది. దీంతో గిరీష్, వంశీచైతన్య, జశ్వంత్‌కు తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన తరువాత కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా గాయపడిన విద్యార్థులను హుటావుటిన ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలోకి ఎవరిని వెళ్లకుండా సెక్యూరిటీని టైట్‌ చేశారు. విద్యార్థులు కూడా తరగతులకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో నారాయణ కళాశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం మాత్రం ఒక్కసారిగా విద్యార్థులు వచ్చి గోడపై పడడంతోనే గోడ కూలిందని బుకాయిస్తున్నారు.  అయితే నారాయణ కళాశాల్లో గోడ కూలిన సంఘటను చిన్నబజారు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నారాయణ జూనియర్‌ కళాశాల్లో జరిగిన సంఘటనను ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్, ఆర్‌ఐఓ తదితర అధికారులు పరిశీలించారు.

విద్యార్థి సంఘాలు ఆందోళన 
నారాయణ జూనియర్‌ కళాశాల్లో గోడ కూలిన సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ఆందోళన నిర్వహించాయి. గోడ కూలి విద్యార్థులకు గాయాలు కావడంపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులను ఆస్పత్రి, కళాశాల లోపలకు అనుమితంచలేదు. ఈ సంఘటనపై పలువురు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ  తదితర విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. 

నారాయణ జూనియర్‌ కళాశాల వద్ద ధర్నాచేస్తున్న ఏబీవీపీ నాయకులు 

ఇరుకు భవనాల్లో కళాశాలలు
కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే ఇరుకు భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నాయి. సౌండ్‌లెస్, ఫైర్, కార్పొరేషన్‌ సర్టిఫికెట్‌ లేకుండానే కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలే ఎక్కువ బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో చాలా బ్రాంచీలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకోకుండానే కళాశాలలు నిర్వహిస్తున్న సంఘటనలో కోకొల్లలు. భవనానికి రెండు వైపులా మెట్లు ఉండాల్సి ఉన్నా ఎక్కడా కనిపించవు. ఆట స్థలం ఉన్న సందర్భం ఉండదు.

ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం కార్పొరేట్‌ యాజమాన్యాలు ఇచ్చే అమ్యామ్యాలతో సరిపుచ్చుకుంటున్నారు. విద్యార్థుల భద్రతా ప్రమాణాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement