
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ఐదుగురు మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం చందానగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అతడి ఆత్మహత్యకు సంబంధించి కీలక ఆధారాలు దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సెల్‌ఫోన్ల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిగతావారి సెల్‌ఫోన్లను ప్రభాకర్‌రెడ్డి కావాలనే మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం.
ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవిల గురించి కుటుంబ సభ్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నారు. షేర్ మార్కెట్ వ్యాపారంలో నష్టపోయాడు, ఎంతమంది పేర్లతో షేర్ ఖాతాలు నిర్వహిస్తున్నాడనే వివరాలు ఆరా తీస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభాకర్‌రెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న కొల్లూరు సమీపంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు, పిన్ని, ఆమె కూతురు విగతజీవులుగా పడివుండటాన్ని మంగళవారం గుర్తించారు. తనతోపాటు ఉన్న నలుగురికి విషమిచ్చి తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షేర్ల మార్కెట్‌లో వచ్చిన నష్టాల కారణంగానే ప్రభాకర్‌రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment