ఎ‍న్నికల హోరు లిక్కర్‌ జోరు | NDP Liquor Caught By Adilabad Police | Sakshi
Sakshi News home page

ఎ‍న్నికల హోరు లిక్కర్‌ జోరు

Published Sat, Nov 10 2018 12:50 PM | Last Updated on Sat, Nov 10 2018 12:53 PM

NDP Liquor Caught By Police - Sakshi

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు పట్టుకున్న ఎన్‌డీపీ లిక్కర్‌ (ఫైల్‌)

మంచిర్యాలక్రైం: జిల్లాలో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ (ఎన్‌డీపీ) లిక్కర్‌ విక్రయాలకు చెక్‌ పెట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ రంగంలోకి దిగింది. ఈ లిక్కర్‌తో సర్కారు ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అక్రమ దందాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని దాదాపు అన్ని మద్యం షాపులు ఇప్పటికే ఏడు రెట్లు అధికంగా మద్యం విక్రయించాయి. అదనంగా విక్రయించే మద్యంపై చెల్లించే మార్జిన్‌ను ప్రభుత్వం గతంలో తగ్గించిం ది. ఏడు రెట్ల వరకు 15శాతం ఇచ్చే మార్జిన్‌ను ఆ తర్వాత ఐదు శాతానికి పరిమితం చేసింది. దీంతో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు మద్యం వ్యాపారులు ఎన్‌డీపీ మద్యాన్ని విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునే  పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలో వాడవాడల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయించి, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలకు తెరలేపడం తెలిసిందే. ఇప్పుడు ఎన్‌డీపీ లిక్కర్‌ అమ్మకాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ శాఖ కన్నేసి ఉంచింది.

గతంలో పట్టుబడిన ఎన్‌డీపీ లిక్కర్‌..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్‌డీపీ మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. గతంలో నిర్మల్, ఆదిలాబాద్‌ పట్టణాల్లో ఎన్‌డీపీ మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు గుర్తించారు. బోధన్, ఆర్మూర్, ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో భారీ గానే ఎన్‌డీపీ మద్యం పట్టుబడిన దాఖాలాలు ఉన్నాయి. ఇటీవల నిర్మల్‌ జిల్లా కేంద్రంగా సరఫరా జరుగుతోందనే  ఆరోపణలున్నాయి. జిల్లాలోని బడా మద్యం వ్యాపారులకు నిర్మల్‌కు చెందిన ఎన్‌డీపీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఎౖMð్సజ్‌ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీనికితోడు ఎన్నికలు దగ్గర పడుతుండడం తదితర కారణాలతో జిల్లాలోకి ఈ నిల్వలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ భావిస్తోంది.

భారీగా అక్రమార్జన..
పాండిచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మద్యంపై ప్రభుత్వం విధించే పన్నులు నామమాత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో రూ.1000 విలువ చేసే మద్యం సీసా అక్కడ రూ.4వందలోపే ఉంటుంది. రాష్ట్రంలోని ధరల కంటే సగానికిపైగా తక్కువకు మద్యం లభిస్తుంది.దీంతో అక్కడినుంచి పెద్ద మొత్తంలో ఈ ఎన్‌డీపీ మద్యం నిల్వలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయారాష్ట్రాల పరిధిలోని చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల కళ్లుగప్పి రాష్ట్రంలో డంప్‌ చేసే ముఠాలున్నాయి. నిర్మల్‌ ప్రాంతానికి చెందిన బడా మద్యం వ్యాపారులకు ఈ ముఠాలతో సంబంధాలున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారుల అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో పెద్దమొత్తంలో మద్యం ఏరులై పారుతోంది.

దీంతో ఇప్పటినుంచే మద్యం నిల్వలపై నేతలు దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌డీపీ లిక్కర్‌ జిల్లాకు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈసారి కూడా ఎన్‌డీపీ మద్యం దిగుమతి అయ్యే ఆస్కారం ఉంటుందని, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నిఘా పటిష్టం చేశామని ఎక్సైజ్‌ శాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement