ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న దొంగనోట్లు
సాక్షి, నెల్లూరు : చదువుకుంది ఇంటర్మీడియట్. కంప్యూటర్ పరిజ్ఞానం అతన్ని దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడుని చేసింది. పోలీసులకు చిక్కి జైలు పాలైనా వెరవక తిరిగి యథేచ్ఛగా తన కార్యకలాపాలను విస్తృతం చేసి పలు రాష్ట్రాలకు వాటిని విస్తరింప చేశాడు. నిందితుడిపై వైఎస్సార్ జిల్లాలోనూ కేసులు ఉన్నాయి. ఇది ఇటీవల పోలీసులకు చిక్కి జైలు పాలైన మురళీ ఉదంతం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెంకు చెందిన పి. మురళీ అలియాస్ మురళీకృష్ణ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కంప్యూటర్‌లో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆటో క్యాడ్‌తో పాటు ఫొటోషాప్‌లో పూర్తిస్థాయి పట్టు సాధించాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచన అతన్ని దొంగనోట్ల ముద్రణకు ఉసిగొల్పాయి. దీంతో ఏలూరుకు మకాం మార్చారు. కంప్యూటర్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండటంతో ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోట్లకు అచ్చు పోలిన విధంగా 2016లో దొంగనోట్లు ముద్రణ ప్రారంభించాడు. తొలుత తాను ముద్రించిన నోట్లను ఏలూరు జిల్లా శివారు గ్రామాల్లో వాటిని చలామణి చేశారు. దొంగనోట్లను ఎలా మార్చాలి? ఎవరికి విక్రయించాలి తదితరాలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నాడు.
ఎవరికీ అనుమానం రాకపోవడంతో దొంగనోట్లను ముద్రించి విచ్చలవిడిగా చలామణి చేశాడు. మూడు నెలల కిందట గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర కిందట బెయిల్‌పై బయటకు వచ్చిన మొరళీకృష్ణ రూ.50, రూ.100, రూ. 200. రూ.500, రూ.2 వేల నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్‌లో చలామణి చేసేందుకు మోసాల్లో సిద్ధహస్తులైన ఎనిమిది మందితో ముఠాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరింప చేశాడు. అందుకు ముఠాలోని సభ్యులకు రూ.లక్ష నగదుకు రూ.25 వేలు కమీషన్ ఇచ్చేవాడు. దీంతో వారు దొంగనోట్లను యథేచ్ఛగా చలామణి చేయసాగారు. ముఠాలోని రాజస్థాన్‌కు చెందిన ప్రేమదాస్ సహకారంతో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగనోట్ల చలామణికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సూరత్‌కు చెందిన ఓ వ్యాపారికి రూ.4 లక్షలు దొంగనోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 5వ తేదీ నోట్లు అందజేయాల్సి ఉండగా ఇందుకూరుపేటలో పోలీసులు ప్రధా న నిందితుడితో పాటు ముగ్గురిని, 6వ తేదీ మిగిలిన ఐదుగురును నెల్లూరు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
వెలుగులోకి వస్తున్న కేసులు
మురళీకృష్ణపై ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాలోనే పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోనూ దొంగనోట్లకు సంబంధించి పోలీసు కేసు ఉన్నట్లు, సదరు కేసులో వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీ సులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో వారెంట్‌పై అక్కడి పోలీసులు నిందితుడు మురళీకృష్ణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీకృష్ణపై ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా? అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాల సేకరణలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment