సాక్షి, గుంటూరు : నరసరావుపేట పట్టణంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేదాంత ఆసుపత్రి ఎండీ రామకృష్ణ శనివారం సంచలన విషయాలను వెల్లడించారు. పేషెంట్ శివ నాగేశ్వర్‌రావు కుటుంబం తమను మోసం చేసిందని, కిడ్నీ దానం చేసే రావూరి రవి కుమార్ స్ధానంలో వెంకటేశ్వర నాయక్‌ను తీసుకొచ్చారని చెప్పారు.
వ్యక్తిని మార్చి ఆసుపత్రిని మోసగించారని ఆరోపించారు. నకిలీ ఆధార్ కార్డు పెట్టడంతో విచారణలో వెంకటేశ్వర నాయక్ దొరికాడని తెలిపారు. నాయక్ దొరకడంతో దేవరగట్టు గోపి అనే కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారని అన్నారు. కిడ్నీ మార్పిడికి గుంటూరు ఎమ్మార్వో మూడు నెలల సమయాన్ని ఎలా ఇచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు.
ఆసుపత్రికి గోపి అందించిన అడ్రస్ కూడా తప్పని తేలినట్లు చెప్పారు. తెలుగుదేశం నేత కపిలవాయి విజయకుమార్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నరసరావుపేటలో సినిమా థియేటర్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, థియేటర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి లంచం డిమాండ్ చేశారని వెల్లడించారు.
డబ్బు ఇవ్వనందుకే వేదాంత ఆసుపత్రిపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషంట్ శివనాగేశ్వరావు, వెంకటేశ్వరనాయక్, గోపిల మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఆసుపత్రి యజమాన్యానికి తెలియదని చెప్పారు. కిడ్నీ రాకెట్‌పై పూర్తి విచారణ చేస్తేనే నిజనిజాలు బయటకు వస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment