ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవడంతో అక్కడి వారు దొడ్డిదారిలో సంపాదన కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు.
పాకిస్తాన్‌లో ఓ అనామక డాక్టర్ గుట్టుగా నిర్వహిస్తోన్న మానవ అవయవాల స్మగ్లింగ్ గుట్టును రట్టు చేశారు పంజాబ్ ప్రావిన్స్‌లోని పోలీసులు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్‌సిన్ నఖ్‌వీ బయటపెట్టారు.
మొహ్‌సిన్ నఖ్‌వీ మాట్లాడుతూ.. డాక్టర్ ఫవాద్ ఇప్పటివరకు మొత్తం 328 సర్జరీలు నిర్వహించారని వీటి ద్వారా సుమారుగా 35000 యూఎస్ డాలర్లు( రూ.28.27 లక్షలు) కొల్లగొట్టారునై అన్నారు. ఈ ముఠాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒక కారు మెకానిక్ పేషేంట్లకు అనస్థీషియా ఇవ్వడంలో సహకరించేవాడని వెల్లడించారు.
ఆసుపత్రుల్లో చేరిన పేషేంట్లను లాహోర్ లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అక్కడ గుట్టుగా ఆపరేషన్లు నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేనందున అక్కడ వీరు యథేచ్ఛగా సర్జరీలు చేసేవారని అన్నారు. ఈ ముఠా నిర్వహించిన సర్జరీల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని, మిగిలిన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
నిందితుడు డాక్టర్ ఫవాద్ ఇదే కేసులో గతంలో ఐదు సార్లు అరెస్టయ్యారని కానీ న్యాయపరమైన లొసుగులను అడ్డంపెట్టుకుని బయటకు వచ్చేవారని అన్నారు. ఆశ్చర్యకరంగా సర్జరీలు జరిగిన చాలామందికి తమ కిడ్నీని తొలగించిన విషయం కూడా తెలియదు. ఈ ముఠాసభ్యుల్లో ఒకరు తనవద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ కోసం బలవంత పెట్టారని.. ఇప్పుడు వేరొక డాక్టర్ వద్దకు వెళ్తే తనకు ఒక కిడ్నీలేదని చెప్పారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్
Comments
Please login to add a commentAdd a comment