తూప్రాన్‌లో అబ్బాయి కారుపై దాడికి పాల్పడుతున్న అమ్మాయి బంధువులు
తూప్రాన్: నవ దంపతుల మధ్య ఉన్న విభేదాలు ఇరువర్గాల మద్య దూరం పెంచాయి. పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ దాక వెళ్లిన ఈ ఘటన పరస్పర దాడులకు పాల్పడే స్థితికి దారి తీసింది. తూప్రాన్ పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం జెండాపల్లికి చెందిన యువతిని గత నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన యువకుడితో పెళ్లి చేశారు. వీరి కాపురం సజావుగా సాగిన నాలుగు నెలల అనంతరం భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. యువతి కుటుంబ సభ్యులు తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువకుడితో పాటు వారి కుటుంబ సభ్యులు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
పోలీసులు ఇరు కుటుంబసభ్యులు, పెద్దల సమక్షంలో నవ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో నెల రోజుల తర్వాత మాట్లాడుకుంటామని పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. కోపోద్రికులైన అమ్మయి తరుపువారు అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ వెళ్తుండగా వెనుకాల నుంచి వెంబడించిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టణంలోని శివాలయం ఎదురుగా అడ్డగించి కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే యువకుడిని చితకబాదారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. తిరిగి వారిని హైదరాబాద్ పంపించి వేశారు. కాగా ఈ సంఘటన తూప్రాన్ పట్టణంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment