సాక్షి, మేడ్చల్ : బోడుప్పల్ టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పెళ్లిళ్ల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన సంగీతకు... మూడో భార్య దేవి జగదీశ్వరి తల్లి మద్దతుగా నిలిచింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి శ్రీనివాస్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. తన బిడ్డ అమాయకురాలని, 19ఏళ్ల తన కూతుర్ని...40ఏళ్ల శ్రీనివాస్ రెడ్డి మూడోపెళ్లి ఎలా చేసుకుంటాడని అన్నారు. ఇదేంటని తాను ప్రశ్నించినందుకు తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, తన కూతుర్ని తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తనతో పాటు పిల్లల్ని చంపేస్తామని బెదిరించడంతో భయంతో నిజామాబాద్ వెళ్లి అక్కడ బతుకుతున్నామని తెలిపారు. రేపు ఇదే పరిస్థితి తన కూతురికి రాదనే నమ్మకం ఏంటని, ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని ఎంతమందిని మోసం చేస్తారని విలపించారు. టీఆర్‌ఎస్ నేతల అండతోనే శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోతున్నాడని దేవి జగదీశ్వరి తల్లి అన్నారు. తన బిడ్డ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే... తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు తన కూతురితో శ్రీనివాస్ రెడ్డి చెప్పించాడని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు సంగీత రెండోరోజు కూడా భర్త ఇంటి ఎదుట తన ఆందోళనను కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. సంగీత అంతకు ముందు శ్రీనిసవారెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది. మరోవైపు ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. సంగీతకు న్యాయం జరగాలనే...తాము సంఘీభావం తెలిపేందుకు వచ్చామన్నారు.
సంగీత ప్లాన్ మీదే వచ్చింది...
కాగా రెండోభార్య సంగీతను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చివేసి, ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో శ్రీనివాసరెడ్డిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మూడున్నరేళ్లు అవుతుందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకపోయిందన్నాడు. అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలురకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంగీతకు డబ్బు మాత్రమే కావాలని, తనతో కాపురం చేసేందుకు ఆమె ఇష్టపడటం లేదన్నాడు. తాను సంపాదించిది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు ...తన దగ్గర ఉన్నాయని, త‍్వరలోనే వాటిని బయటపెడతానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment