
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఐసిస్ కలకలం బయలుదేరింది. తమిళ పోలీసుల కళ్లు గప్పి ఇక్కడ సాగుతున్న ఐసిస్ వ్యవహారాలను ఎన్‌ఐఏ పసిగట్టడం రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేసింది. దాడులకు వ్యూహరచన జరిగినట్టు విచారణలో తేలడంతో ఆలస్యంగానైనా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో విచారణను ముమ్మరం చేశారు. అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమతంగానే వ్యవహరిస్తూ వస్తోంది.
అయితే, ఇక్కడ చాప కింద నీరులా సాగుతున్న వ్యవహారాలు పోలీసుల పని తీరు మీద విమర్శలు గుప్పించడమే కాదు, రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థకు అనుకూలంగా యువత ఏకం అవుతోండటాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించే వరకు ఇక్కడి పోలీసులు, ఇంటెలిజెన్స్ పసిగట్టలేని పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడి పోలీసులు హడావుడి సృష్టించినా, ఫలితం శూన్యం. ఇక, సెంట్రల్ రైల్వేస్టేషన్ పేలుడు కేసు విచారణ ఓ సవాలుగానే మారింది. అలాగే, హిందూ నేతల హత్యకు వ్యూహ రచనలు సాగి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలు, సమాచారాలు ఉన్నా, ఇక్కడ ఐఎస్‌ఐఎస్(ఐసిస్) కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నా భద్రతా పరంగా దూకుడు పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఐఏ వర్గాలు ఇక్కడ దాడులు చేసే వరకు ఐసిస్ సానుభూతి పరుల గురించిన వివరాలు, వారి కార్యకలాపాలను రాష్ట్రపోలీసులు పసిగట్టలేని పరిస్థితి ఉండటం విమర్శలకు దారి తీస్తోంది.
దాడులే లక్ష్యంగా వ్యూహాలు
శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేసి రాష్ట్ర పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే, రాష్ట్రంలో నక్కి ఉన్న ఆ దాడులకు మాడ్యూల్ సూత్రధారి గురించి సమాచార సేకరణలో విఫలం కావడం గమనార్హం. ఇది కూడా ఎన్‌ఐఏ బుధవారం రంగంలోకి దిగడంతోనే వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వర్గాలు కోయంబత్తూరు నగరం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో దాడులు సాగించిన విషయం తెలిసిందే. పొద్దు పోయే వరకు ఈ దాడులు సాగగా, అజారుద్దీన్ ఎన్‌ఐఏ టార్గెట్ అయ్యాడు. మిగిలిన ఐదుగుర్ని విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ వర్గాలు సమన్లు జారీ చేసి వెళ్లాయి. అయితే, అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణ, లభించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సామగ్రి మేరకు ఐసిస్ మాడ్యూల్‌గా ఇక్కడ అతగాడు వ్యవహరిస్తుండం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన మానవ బాంబు జహ్రన్ హషీంకు ఫేస్‌బుక్ మిత్రుడిగా ఉండటమే కాదు, తమిళనాడులో ఐసిస్‌కు యువతను పంపించడం లక్ష్యంగా అజారుద్దీన్ ఇక్కడ తిష్ట వేసి ఉండటం గమనార్హం. అలాగే, తమిళనాడులో దాడులే లక్ష్యంగా వ్యూహ రచనలు సైతం సాగి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడటం ఆందోళన కల్గిస్తోంది.
ఆలస్యంగా ఉరకలు
ఎన్‌ఐఏ వర్గాలు మహ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లినానంతరం ఆలస్యంగా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో బుధవారం అర్థరాత్రి నుంచి హడావుడి పెంచారు. అజారుద్దీన్‌తో సన్నిహితంగా ఉన్నట్టు పేర్కొనబడుతున్న ఉక్కడం మహ్మద్ హసీం, కరుంబుకడై సయబుల్లా, అన్భునగర్ షాజహాన్ ఇళ్లల్లో సోదాల్లో నిమగ్నం అయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఈ సోదాలు సాగాయి. అజారుద్దీన్ ఇంటి పరిసరాల్లో ఉన్న వారి వద్ద, అతడితో సన్నిహితంగా ఉన్న మిత్రులు, వారికి సంబంధించిన వాళ్లను టార్గెట్ చేసి విచారణ పేరిట ఉరకలు తీశారు. అలాగే, అజారుద్దీన్ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. కోయంబత్తూరులో గత కొంత కాలంగా హఠాత్తుగా కన్పించకుండా పోయిన యువత, వారికి సంబంధించిన వివరాల్ని సేకరించి, వీరు ఐసిస్‌లో చేరడానికి ఏమైనా దేశం దాటారా? అన్న అనుమానాలతో విచారణను ముమ్మరం చేసి ఉన్నారు. అలాగే, తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న చెన్నై, మదురై నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment