పాపకు ఆపరేషన్‌ పేరుతో టోకరా | nigeriens cheating hyderabad city girl in shadi.com | Sakshi
Sakshi News home page

పాపకు ఆపరేషన్‌ పేరుతో టోకరా

Published Thu, Sep 28 2017 7:56 AM | Last Updated on Thu, Sep 28 2017 8:50 AM

nigeriens cheating hyderabad city girl in shadi.com

సాక్షి, సిటీబ్యూరో : షాదీ.కామ్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న నగరానికి చెందిన మహిళతో పరిచయం పెంచుకొని డబ్బులు వసూలు చేసి మోసగించిన ఇద్దరు నైజీరియన్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన కింగ్‌స్లే ఉచె అనిసొడొ,  క్లెమెంట్‌ ఇదొషాలను ట్రాన్సింట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.  సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ జానకీ షర్మిలా కథనం ప్రకారం...మాదాపూర్‌కు చెందిన యువతి షాదీ.కామ్‌లో ప్రొఫైల్‌ ఆప్‌లోడ్‌ చేసింది. అదే వెబ్‌సైట్‌లో భూమేష్‌ దీపక్‌ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసిన  నైజీరియన్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆ తర్వాత వైబర్‌ యాప్‌ ద్వారా మాట్లాడుకున్నారు. హల్లీబర్టన్‌ ఆయిల్‌ సర్వీసెస్‌లో జియోఫిజిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాడు.

2011 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, ఎనిమిదేళ్ల అభా అనే పాప ఉన్నట్లు తెలిపాడు. అయితే పాపకు కుడివైపున గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్‌ చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు వైద్య చికిత్సకు అవసరమయ్యే రూ.6,51,000 వారి బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆస్పత్రి ఖర్చుల కోసం మరిన్ని డబ్బులు కావాలంటూ అడగడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతడు పనిచేసే కంపెనీలో ఆరా తీసింది. అక్కడే భూమేష్‌ దీపక్‌ పేరుతో ఎవరూ లేరని తేలండంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు సీడీఆర్‌ వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాల ఆధారంగా ఢిల్లీలో ఉంటున్నట్లుగా గుర్తించి ఈ నెల 23న అతడిని అరెస్టు చేశారు. వారి నుంచి ఒరిజినల్‌ పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, డెబిట్, క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement