Shadi. Com
-
షాదీ. కామ్‌లో ఇకపై ఆ ఆప్షన్ ఉండదు
ప్రముఖ మ్యాట్రియమోనియల్ వెబ్సైట్ షాదీ. కామ్ తన వెబ్సైట్ నుంచి కలర్ ఫిల్టర్‌ను తొలిగించింది. స్కిన్‌టోన్ ఆధారంగా భాగస్వామిని ఎంపిక చేసుకునే ఆప్షన్‌పై ఆన్లైన్లో పిటిషన్ దాఖలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కావాలని చేసింది కాదని ఏదో పొరపాటు జరిగిందని సదరు వెబ్సైట్ వివరణ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జాత్యాంహకారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాదీ.కామ్ వెబ్‌సైట్‌పై వివాదం చర్చనీయాంశమైంది. దీని ప్రకారం భాగస్వామిని ఎంపిక చేసుకునేముందు సదరు వ్యక్తి వాళ్ల చర్మరంగు ఏదో సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫెయిర్, వైటీష్, డార్క్ వంటి ఆప్షన్లుంటాయి. తద్వారా స్కిన్‌టోన్ ఆధారంగా వారికి తగ్గ జోడీలు దర్శనమిస్తాయన్నమాట. దీంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి లఖాని అనే మహిళ ఆన్లైన్లో సదరు వెబ్‌సైట్‌పై పిటిషన్ దాఖలుచేసింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని రంగు ఆధారంగా భాగస్వామిని ఎలా సెలక్ట్ చేస్తారంటూ మండిపడింది. అంతేకాకుండా ఈ ఫిల్టర్‌ను వెబ్సైట్ నుంచి శాశ్వతంగా తొలిగించాలని డిమాండ్ చేసింది. లఖానీ దాఖలు చేసిన పిటిషన్‌పై దాదాపు 1600కి పైగానే ప్రజలు సంతకాలు చేసి తమ మద్దతు ప్రకటించారు. (మహిళ ఉద్యోగిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోండి ) -
మహిళా ప్రొఫెసర్‌కు నైజీరియన్ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: ఓ నైజీరియన్ ‘మాట్రి’మోసగాడు నగరానికి చెందిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు టోకరా వేశాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఇతగాడు వివాహం చేసుకుంటానని, ఇండియాకు వస్తున్నానని చెప్పి రూ.33 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అతడి కోసం గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసిన ఆమె మరో రూ.11 వేలు నష్టపోయింది. ఎట్టకేలకు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరానికి చెందిన మహిలా అసిస్టెంట్ ప్రొఫెసర్ షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం దీనికి లండన్‌లో నివసిస్తున్నానంటూ చెప్పుకున్న దీపాంకర్ అనే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాము బీహార్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందిన వారమని, కొన్నేళ్ల క్రితం లండన్‌లో స్థిరపడినట్లు చెప్పాడు. ఇద్దరూ కొన్ని రోజుల పాటు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఓ దశలో ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు ఆసక్తి చూపించాడు. ఇటీవల ఆమెతో చాటింగ్ చేసిన అతగాడు తాను వ్యాపార పని మీద స్వీడన్ వెళ్లానని.. అక్కడి నుంచి భారత్‌కు రావాలని భావిస్తున్నట్లు సందేశం ఇచ్చాడు. తన వెంట భారీ మొత్తం తీసుకువస్తున్నట్లు చెప్పాడు. హైదరాబాద్‌కు వస్తే తనలాంటి సంపన్నులు ఎక్కడ నివసించాలో తెలియట్లేదని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరాడు. దీంతో ఆమె గోల్కొండ హోటల్లో రూ.11 వేలు అడ్వాన్స్ చెల్లించి సూట్ రూమ్ బుక్ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకు ఇస్తాంబుల్ విమానాశ్రయం నుంచి అంటూ ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారిగా చెప్పుకున్న అపరిచితుడు దీపాంకర్ అనే వ్యక్తి భారీ మొత్తం తీసుకుని భారత్ వచ్చే ప్రయత్నాల్లో తమకు చిక్కాడని, తక్షణం ట్యాక్స్ చెల్లించకపోతే అతడిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె రూ.33 వేలను కస్టమ్స్ అధికారిగా చెప్పిన వ్యక్తి పేర్కొన్న ఖాతాలోకి బదిలీ చేసింది. ఆపై మరికొంత మొత్తం డిమాండ్ చేస్తూ ఉండటంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. కనీసం రూ.11 వేలు అయినా వెనక్కు తీసుకుందామనే ఉద్దేశంతో గోల్కొండ హోటల్‌కు వెళ్లిన బాధితురాలు బుక్ చేసిన సూట్ రూమ్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులకు చెప్పింది. రూమ్ రద్దు చేస్తామని, అయితే 48 గంటల ముందు రద్దు చేస్తేనే డబ్బు రీఫండ్ ఇస్తామంటూ వారు చెప్పడంతో ఆ ఆశ కోల్పోయింది. చివరకు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మోసం చేసింది నైజీరియన్‌గా అధికారులు భావిస్తున్నారు. -
పాపకు ఆపరేషన్ పేరుతో టోకరా
సాక్షి, సిటీబ్యూరో : షాదీ.కామ్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న నగరానికి చెందిన మహిళతో పరిచయం పెంచుకొని డబ్బులు వసూలు చేసి మోసగించిన ఇద్దరు నైజీరియన్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన కింగ్స్లే ఉచె అనిసొడొ, క్లెమెంట్ ఇదొషాలను ట్రాన్సింట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా కథనం ప్రకారం...మాదాపూర్‌కు చెందిన యువతి షాదీ.కామ్‌లో ప్రొఫైల్ ఆప్‌లోడ్ చేసింది. అదే వెబ్సైట్లో భూమేష్ దీపక్ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసిన నైజీరియన్ రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత వైబర్ యాప్ ద్వారా మాట్లాడుకున్నారు. హల్లీబర్టన్ ఆయిల్ సర్వీసెస్‌లో జియోఫిజిస్ట్గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాడు. 2011 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, ఎనిమిదేళ్ల అభా అనే పాప ఉన్నట్లు తెలిపాడు. అయితే పాపకు కుడివైపున గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు వైద్య చికిత్సకు అవసరమయ్యే రూ.6,51,000 వారి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆస్పత్రి ఖర్చుల కోసం మరిన్ని డబ్బులు కావాలంటూ అడగడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతడు పనిచేసే కంపెనీలో ఆరా తీసింది. అక్కడే భూమేష్ దీపక్ పేరుతో ఎవరూ లేరని తేలండంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు సీడీఆర్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాల ఆధారంగా ఢిల్లీలో ఉంటున్నట్లుగా గుర్తించి ఈ నెల 23న అతడిని అరెస్టు చేశారు. వారి నుంచి ఒరిజినల్ పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. -
అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీప
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. తాజా సర్వేలో అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. షాదీ.కామ్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం తేలింది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకే ఓటేశారు. ఈ సర్వేలో మొత్తం 12,500 మంది పాల్గొన్నారు. రెండో స్థానంలో 27.4 శాతంతో రెజ్లర్ సాక్షి మలిక్ నిలిచింది. అయితే ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా నిలిచి రికార్డు సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైపు కేవలం 6.2 శాతం మందే మొగ్గు చూపారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.