సాక్షి, సిటీబ్యూరో: ఓ నైజీరియన్ ‘మాట్రి’మోసగాడు నగరానికి చెందిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు టోకరా వేశాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఇతగాడు వివాహం చేసుకుంటానని, ఇండియాకు వస్తున్నానని చెప్పి రూ.33 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అతడి కోసం గోల్కొండ హోటల్‌లో సూట్ రూమ్ బుక్ చేసిన ఆమె మరో రూ.11 వేలు నష్టపోయింది. ఎట్టకేలకు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరానికి చెందిన మహిలా అసిస్టెంట్ ప్రొఫెసర్ షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం దీనికి లండన్‌లో నివసిస్తున్నానంటూ చెప్పుకున్న దీపాంకర్ అనే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాము బీహార్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందిన వారమని, కొన్నేళ్ల క్రితం లండన్‌లో స్థిరపడినట్లు చెప్పాడు. ఇద్దరూ కొన్ని రోజుల పాటు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు.
ఓ దశలో ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు ఆసక్తి చూపించాడు. ఇటీవల ఆమెతో చాటింగ్ చేసిన అతగాడు తాను వ్యాపార పని మీద స్వీడన్ వెళ్లానని.. అక్కడి నుంచి భారత్‌కు రావాలని భావిస్తున్నట్లు సందేశం ఇచ్చాడు. తన వెంట భారీ మొత్తం తీసుకువస్తున్నట్లు చెప్పాడు. హైదరాబాద్‌కు వస్తే తనలాంటి సంపన్నులు ఎక్కడ నివసించాలో తెలియట్లేదని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరాడు. దీంతో ఆమె గోల్కొండ హోటల్‌లో రూ.11 వేలు అడ్వాన్స్ చెల్లించి సూట్ రూమ్ బుక్ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకు ఇస్తాంబుల్ విమానాశ్రయం నుంచి అంటూ ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారిగా చెప్పుకున్న అపరిచితుడు దీపాంకర్ అనే వ్యక్తి భారీ మొత్తం తీసుకుని భారత్ వచ్చే ప్రయత్నాల్లో తమకు చిక్కాడని, తక్షణం ట్యాక్స్ చెల్లించకపోతే అతడిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె రూ.33 వేలను కస్టమ్స్ అధికారిగా చెప్పిన వ్యక్తి పేర్కొన్న ఖాతాలోకి బదిలీ చేసింది. ఆపై మరికొంత మొత్తం డిమాండ్ చేస్తూ ఉండటంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. కనీసం రూ.11 వేలు అయినా వెనక్కు తీసుకుందామనే ఉద్దేశంతో గోల్కొండ హోటల్‌కు వెళ్లిన బాధితురాలు బుక్ చేసిన సూట్ రూమ్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులకు చెప్పింది. రూమ్ రద్దు చేస్తామని, అయితే 48 గంటల ముందు రద్దు చేస్తేనే డబ్బు రీఫండ్ ఇస్తామంటూ వారు చెప్పడంతో ఆ ఆశ కోల్పోయింది. చివరకు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మోసం చేసింది నైజీరియన్‌గా అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment