
కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ గత ఏడాది మలేషియా విమానాశ్రయంలో అత్యంత అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. జాంగ్ నామ్‌ను చంపింది ఉత్తరకొరియానేనని, అత్యంత విషపూరితమైన వీఎక్స్ అనే రసాయనిక సమ్మేళనంతో అతన్ని హతమార్చిందని తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. జాంగ్ నామ్‌ను హతమార్చినందుకు ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించినట్టు తెలిపింది.
రసాయనిక యుద్ధాల్లో వినియోగించే వీఎక్స్.. జాంగ్ నామ్ ముఖంపై, కళ్లలో, రక్తంలో, మూత్రంలో, దుస్తుల్లో, బ్యాగులో దొరికినట్టు పోస్టుమార్టం నివేదికంలో తేలిందని వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి 13న జాంగ్ నామ్ కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మకావ్ వెళుతుండగా.. ఎయిర్‌పోర్టులో ఇద్దరు యువతులు వెనుకనుంచి పరిగెత్తుకొని వచ్చి.. అతనిపై గుర్తుతెలియని దవ్రాన్ని చల్లిన విషయం తెలిసిందే. ఈ ద్రవం పడటంతో వెంటనే స్పృహ కోల్పోయి.. కుప్పకూలిన జాంగ్ నామ్ ఎయిర్‌పోర్టుకు అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణాలు విడిచారు. జాంగ్ నామ్‌పై గుర్తుతెలియని ద్రవాన్ని చల్లి ఓ టాక్సీలో పారిపోయిన ఆ ఇద్దరు యువతులు ఉత్తరకొరియా ఏజెంట్లు అని దక్షిణ కొరియా టీవీ చానెల్ టీవీ చోసాన్ ఆ మరునాడు వెల్లడించింది.
దివంగత ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఇల్, ఆ దేశ నటి సంగ్ హ్యే రిలకు పుట్టిన అక్రమ సంతానం కిమ్ జాంగ్ నామ్. అతను తన అధ్యక్ష పదవికి అడ్డు వస్తాడనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అతన్ని ఇలా దారుణంగా చంపేసినట్టు ఇప్పటికీ దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment