
లండన్: మాజీ ప్రియురాలిని తీవ్రంగా వేధించిన నేరానికి ప్రవాస భారతీయుడికి బ్రిటన్‌లోని హారో క్రౌన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పశ్చిమలండన్‌కు చెందిన ప్రదీప్ థామస్(37), ఓ మహిళ(50) కొంతకాలం వరకు సన్నిహితంగా మెలిగారు. అనంతరం వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రదీప్ ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా పెట్టింది. ఇది జీర్ణించుకోలేని అతడు ఆమె వెంట పడటం ఆపలేదు. చంపేస్తా, యాసిడ్ పోస్తా అంటూ సెల్‌ఫోన్‌లో వేధించసాగాడు.
ఆమె ఇతర పురుషులతో మాట్లాడినట్లు తెలిసినా, చూసినా ఊరుకునేవాడు కాదు. ఒక రోజు ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి లోపలికి రానివ్వకుంటే ఇంటిని తగుల బెడతానంటూ ఫోన్‌లో మెసేజ్‌లు పంపాడు. ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనలకు లోనైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు ప్రదీప్‌ను ఆగస్టులో అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 12, 13వ తేదీల్లో బాధితురాలికి అతడు 73 మిస్డ్ కాల్స్, 35 వాయిస్ మెసేజ్‌లు పంపినట్లు వెల్లడయింది. తనకు ఆమె దక్కలేదనే కోపంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని తపి‍్పంచుకోజూశాడు. ఆమె ఇప్పటికీ తన ప్రియురాలేనని వాదించాడు. ఇవన్నీ పరిశీలించిన పోలీసులు కోర్టులో కేసు ఫైల్ చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.